Politics

MAHANADU 2022: జగన్‌కు ఈ రోజు పిచ్చెక్కుతుంది.. నిద్ర కూడా పట్టదు

MAHANADU 2022: జగన్‌కు ఈ రోజు పిచ్చెక్కుతుంది.. నిద్ర కూడా పట్టదు

ఏ మహానాడులోనూ ఒంగోలు మహానాడులో ఉన్నంత కసి చూడలేదని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉన్మాదుల పాలన నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించాలని కార్యకర్తలు తరలివచ్చారని ఆయన తెలిపారు. టీడీపీకి జనాలు ఉన్నారని.. వైసీపీకి బస్సులున్నాయని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అధికారం పోతే ఆ బస్సులు కూడా వైసీపీకి ఉండవన్నారు. మహానాడును అడ్డుకునేందుకు పోలీసులు ఎంతగానో ప్రయత్నించారని చెప్పారు. మహానాడు వాహనాలకు గాలి తీసేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం గాలి తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. ‘‘జగన్ కు ఈ రోజు పిచ్చెక్కుతుంది. ఇవాళ నిద్ర పట్టదు. వైసీపీ నేతలు వెల వెల.. టీడీపీ మీటింగులు కళ కళ. భవిష్యత్తులో ఎన్టీఆర్ రికార్డులను ఎవ్వరూ బద్దలు కొట్టలేరు. ఏడాది పాటు ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు చేపడుతున్నాం. ఎన్టీఆర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా జిల్లాల్లో మినీ మహానాడు కార్యక్రమాలు చేపడతాం.’’ అని చంద్రబాబు తెలిపారు.

**మహానాడులో తెదేపాకు మహా విరాళాలు
మహానాడు సందర్భంగా తెదేపాకు భారీగా విరాళాలు వచ్చాయి. పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం పలువురు నేతలు, ప్రముఖులు తెదేపాకు భారీగా విరాళాలిచ్చారు. తెదేపా నాయకుడు కోవెలమూడి రవీంద్ర (గుంటూరు) పార్టీకి అత్యధికంగా రూ.27 లక్షల విరాళం ప్రకటించారు.
* మహానాడు సందర్భంగా తెదేపాకు భారీగా విరాళాలు వచ్చాయి. గుంటూరుకు చెందిన తెదేపా నాయకుడు మన్నవ మోహనకృష్ణ రూ.31,60,000 విలువైన తాగునీటి బాటిళ్లు అందించారు. తెదేపా నాయకుడు కోవెలమూడి రవీంద్ర (గుంటూరు) పార్టీకి అత్యధికంగా రూ.27 లక్షల విరాళం ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, దామచర్ల జనార్దన్‌, ఇంటూరి నాగేశ్వరరావు రూ.25 లక్షలు చొప్పున విరాళాలిచ్చారు. ఆర్‌.శ్రీనివాసరెడ్డి (కడప), పుట్టా సుధాకర్‌ యాదవ్‌ (మైదుకూరు), గల్లా జయదేవ్‌ (గుంటూరు) రూ.20 లక్షలు చొప్పున అందించారు.
*రూ.15 లక్షలు ఇచ్చినవారు:
బీసీ జనార్దన్‌రెడ్డి (బనగానపల్లె), గొట్టిపాటి రవికుమార్‌ (అద్దంకి).రూ.10 లక్షలు ఇచ్చినవారు: జీవీ ఆంజనేయులు (వినుకొండ), భాష్యం ప్రవీణ్‌ (గుంటూరు), దామచర్ల సత్య (ఒంగోలు), ఎం.ఎం.కొండయ్య (చీరాల), పమిడి రమేష్‌ (ఒంగోలు), ఏలూరి సాంబశివరావు (పర్చూరు), శంకర్‌ యాదవ్‌ (తంబళ్లపల్లె).
*రూ.5 లక్షలు ఇచ్చినవారు:
డేగల ప్రభాకర్‌ (గుంటూరు), వేగేశ్న నరేంద్రవర్మ (బాపట్ల), బొల్లినేని రామారావు (ఉదయగిరి), కురుగొండ్ల రామకృష్ణ (వెంకటగిరి), కొమ్మాలపాటి శ్రీధర్‌ (పెదకూరపాడు), పిన్నమనేని వీరయ్య (గుడివాడ), ఉగ్ర నరసింహారెడ్డి (కనిగిరి), బీఎన్‌ విజయ్‌కుమార్‌ (సంతనూతలపాడు), ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ (తెనాలి), ఎం.అశోక్‌రెడ్డి (గిద్దలూరు), ప్రత్తిపాటి పుల్లారావు (చిలకలూరిపేట), దేవినేని ఉమామహేశ్వరరావు (మైలవరం), టీజీ భరత్‌ (కర్నూలు), పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి (కొవ్వూరు), తోట సీతారామలక్ష్మి (భీమవరం), ఆదిరెడ్డి వాసు (రాజమహేంద్రవరం), ఎ.రాధాకృష్ణ (తణుకు), దాట్ల సుబ్బరాజు (ముమ్మిడివరం), మన్నం సుబ్బారెడ్డి (డోన్‌).

*జన సంద్రం.. మహానాడు ప్రాంగణం
మహానాడు ప్రాంగణం జన సందోహంగా మారింది. ప్రాంగణం ఎదురుగా ఉన్న జాతీయ రహదారితోపాటు ఇతర రహదారుల్లో ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న కారు టైర్లలో గాలిని పోలీసులు తీసేస్తున్నారు. ఇటు మహానాడుకు టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బయల్దేరారు. కారులో నుంచి ఆయన కార్యకర్తలకు అభివాదం చేస్తూ పెద్ద కాన్వాయ్‌తో ముందుకు సాగారు. లోకేష్‌తో పాటు పలువురు నేతలు మహానాడుకు బయల్దేరారు. మహానాడుకు తరలివస్తున్న టీడీపీ కార్యకర్తలు, ప్రజలు పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా మహానాడు ప్రాంగణానికి చేరుకుంటామంటున్నారు టీడీపీ అభిమానులు. జనం పెరిగిపోతుండడంతో అనుకున్న సమయానికంటే ముందుగానే సభను ప్రారంభించాలన్న ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉంది.

* తెలుగుదేశం మహానాడులో.. రాజధాని నిర్మాణానికి అనుకూలంగా తీర్మానం చేసినందుకు అమరావతి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఒంగోలులో మహానాడు ప్రాంగణానికి తరలివచ్చి మద్దతు తెలిపారు. అమరావతికి తెలుగుదేశం తొలినుంచి అనుకూలంగా ఉందన్నారు. చంద్రబాబు హయాంలో రాజధాని నిర్మాణం చాలా వేగంగా జరిగిందంటూ.. రైతులు ముక్తకంఠంతో చెప్పారు.