Devotional

నేడు సంకష్ట హర చతుర్థ

నేడు సంకష్ట హర చతుర్థ

ఒక సంవత్సరంలో అధికమాసంతో సహా పదమూడు సంకష్ట హర లేక సంకట హర చతుర్థులు వస్తాయి. ప్రతి నెల కృష్ణ పక్షంలో నాల్గోవరోజు భక్తి శ్రద్ధలతో పూజిస్తే, కష్టాలు తొలిగి శుభాలు కలుగుతాయి. ఈ శుభకృత్ నామ సంవత్సరం చైత్రం మొదలు పాల్గుణ మాసం వరకు ప్రతి నెల వ్రతం ఆచరిస్తే అన్ని బాధలు దూరమై జీవితంలో ఆనంద మకరందం వెల్లివిరుస్తుంది. 

సృష్టి ఆదిలో బ్రహ్మా దేవుడు ఆది దేవుడైన శ్రీమహావిష్ణువును తన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగేలా చూడమని అర్థించాడు. సృష్టికి ఎలాంటి ఆటంకం రాకుండా కాపడడానికి ఆది దేవుడే సంకట హరుడై అవతరించాడని ప్రతీతి. విష్ణువే వినాయకుడు. వేదంలో వ్రాత్య గణపతి, విశ్వంభర గణపతి అన్న శబ్ధాలు ఈ విషయాన్ని సమర్థిస్తూన్నాయి. వ్రాతం అంటే సమూహం. దేవదానవ మానవ గణాధిపతి కావడం వల్ల వ్రాత్య గణపతి అన్న పేరు సార్థకం అయింది. విశ్వరూపంలో గజాననం కూడ ఒకటి కావడం వల్ల విశ్వబభర గణపతి అన్న నామధేయమూ సముచితమే. గజముఖుడు సంకష్టహరుడైన ఆదినారాయణుడే.

ఒక శుభకార్యం ఆరంభించడానికి ముందు, శుక్లాంబరధరం అన్న శ్లోకంతో గణపతిని ఆవాహనం చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనవాయితీ, వేదంలో, పురాణంలో, తంత్ర గమంలో, గణపతి ప్రస్తావన కనిపిస్తూనే ఉన్నది. అయినప్పటికీ బొజ్జగణపతి భూలోకంలో ఒజ్జగా తొలి పూజలందు కోవడం విశేషం. అభిషేక మహర్షి ఆనాడు బ్రహ్మాదేవుడు కోరిన విధంగానే, తన శిష్యుల పాఠ్యపఠనాలకు ఏలాంటి అవరోధం కలగకుండా ఉండాలని మహా విష్ణువును సంకట హరుడిగా భావించి సేవించారని ఒక కథనం ఉన్నది. “గణనామ్ త్వగణపతి గం హనామహే” అన్న సూక్తం సుపరిచితం. నిత్య పూజలకు స్వాగతగీతం లాంటి సుశ్లోకం. 

చైత్రంలో సంకటహరుడు వికట మహాగణపతి, వైశాఖంలో చణక్రాజ ఏకదంత, జ్యేష్ఠంలో కృష్ణ పింగళ, ఆషాఢంలో గజానన, శ్రావణంలో హేరంభ, భాద్రపదంలో విఘ్నారాజ, ఆశ్వయుజంలో వక్రతుండ, కార్తీకంలో గణదీప, మార్గశిరంలో అభురథమ్, పుష్యంలో లంబోదర, మాఘంలో ద్విజప్రియ, పాల్గునంలో బాలచంద్ర, అధికంలో విభువన పాలహ, అనే నామధేయంలో పూజలు అందుకుంటాడు సంకటహరుడు.

విశ్వంభరుడి పూజ విశ్వవ్యాప్తం కావటానికి సర్వవ్యాప్తి అయిన ఆ శ్రీమహావిష్ణువే మూలకారణం. భగవంతుడికి, భక్తునికి, నడుమ వీడని అనుబంధం ఉన్నందున వెశ్వర్యం, త్యాగం అనే రెండు దైవీగుణాలు, దురాశ, స్వార్థం అనే అసురీ గుణాలకు విరుగుడు మందులా పని చేస్తుందని జన వాక్యం, భక్తిని మించిన వెశ్వర్యం, త్యాగాన్ని తలదన్నే ధనం, ఇలలో లేవని పురాణ గాథలు గుర్తు చేస్తూనే ఉన్నాయి. భక్త సిరియాళుడు కన్న కొడుకును బలిదానం ఇచ్చి, బలి చక్రవర్తి తన సర్వస్వం త్యాగం చేసి, పురాణ పురుషులుగా శాశ్వతమైన స్థానం ప్రజా హృదయాలలో సంపాదించుకో గలిగారు. ఇదే హిందూ ధర్మంలోని విశిష్ఠతః లోకానికి ఆదర్శం.

సంకటహరుడైన గణనాథుడు టిబెటులో మహాకాళగా, జపాన్ లో కంగ్ టన్ గా, థాయిలాండ్ లో, మైనమార్ లో సక్రగా, ఇరాన్ లొ ఆహుర్ మజ్దాగా, ఇండోనేషియాలో గణేష్ గా ఈ నాటికి ఘనంగా పూజలు అందుకుంటున్నాడు. గణపత్యం విశ్వవ్యాప్తమై విరాజిల్లుతున్నది అనడానికి ఇవి సజీవ సాక్ష్యాలు.
 
నాగబాబు.రామిశెట్టి.