DailyDose

న్యూయార్క్‌ లో భవంతి మీద నుంచి పడి బాలుడు మృత్యువాత – TNI నేర వార్తలు

న్యూయార్క్‌ లో  భవంతి   మీద నుంచి పడి   బాలుడు మృత్యువాత  – TNI  నేర వార్తలు

*ఎత్తైన భవంతి 29వ అంతస్థు మీద నుంచి పడి 3 ఏళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో శనివారం వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ‘బూమ్’ అని గట్టి శబ్దాలు వినిపించడంతో బయటకొచ్చి అటూఇటూ చూసిన బిల్డింగ్ వాసులకు 5వ ఫ్లోర్‌ పరంజాపై పడివున్న బాలుడు కంటపడ్డాడు. అప్పటికే బాలుడిలో ఎలాంటి కదలికలు కనిపించలేదు. ప్రమాద సమయంలో బాలుడి తల్లి బిల్డింగ్ ఆవరణలోనే ఉన్న పార్క్‌లో ఉంది. బాలుడు పడడాన్ని గమనించి ‘ నా బిడ్డ.. నా బిడ్డ.. అది నా బిడ్డే’ అని బిగ్గరగా అరుచుకుంటూ పరిగెత్తుకొచ్చిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ఇక బాలుడి తండ్రి పైఅంతస్థుల నుంచి కిందికి పరిగెత్తుకుంటూ కిందకు వచ్చాడు. పరంజా మీదకు ఎక్కి బాలుడిని దించే ప్రయత్నం చేశాడు. కానీ సాధ్యపడలేదు. అక్కడున్న కొందరు సాయం చేయడంలో బాలుడిని కిందికి దించారు. హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే బాలుడు కన్నుమూశాడని వైద్యులు నిర్ధారించారు.
* చిల్లకల్లులోని ఓ చెరువులో దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. వర్క్ ఫ్రం హోమ్ తర్వాత ఉద్యోగంలో చేరేందుకు ఆదివారం సాయంత్రం మంగళగిరి నుంచి తల్లిదండ్రులతో కలసి హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిన శ్వేత.. రాత్రి 8 గంటల సమయంలో చనిపోతున్నట్లు తన తల్లిదండ్రులకు వాట్సప్లో సందేశం పంపింది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని శ్వేతా చౌదరి.. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరిన శ్వేత.. చిల్లకల్లు చేరుకొని పక్కనే ఉన్న చెరువులో దూకి చనిపోతున్నట్లు తల్లిదండ్రులకు వాట్సాప్ మెసేజ్ను షేర్ చేసింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు చిల్లకల్లు బయలుదేరి వెళ్లి.. చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా.. తెల్లవారుజామున మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం శవ పంచనామ నిమిత్తం మృతదేహాన్ని జగ్గయ్యపేట ఆసుపత్రికి తరలించారు.హైదరాబాద్లోని ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్న శ్వేత.. గత మూడు నెలలుగా మంగళగిరిలోనే ఉంటూ వర్క్ ఫ్రం హోం నిర్వహిస్తుందని ఆమె తాత తెలిపారు. ఆదివారం సాయంత్రం మంగళగిరి నుంచి తల్లిదండ్రులతో కలసి హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమైనట్లు వివరించారు. శనివారం సాయంత్రం పని ఉందని ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లిన శ్వేత.. రాత్రి 8 గంటల సమయంలో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మెసేజ్ వచ్చిందని ఆయన చెప్పారు. తమకు ఎవరి పైన అనుమానం లేదని.. మృతికి గల కారణాలు ఇప్పటి వరకు తెలియదని అన్నారు. అందరితో కలివిడిగా ఉండే తమ మనవరాలు విగత జీవిగా పడి ఉండటాన్ని ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
*విశాఖ నగరం పాతగాజువాక సమీపంలో దారుణం చోటుచేసుకుంది. మానసిక రోగి అయిన 21 ఏళ్ల యువతిపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈమేరకు బాధిత యువతి తల్లి ఫిర్యాదుతో గాజువాక పోలీసులు కేసు నమోదు చేశారు. ఘాతుకానికి పాల్పడిన ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని సీఐ మల్లేశ్వర రావు తెలిపారు. కేసులో దర్యాప్తు జరుగుతుందని.. బాధితురాలిని కేజీహెచ్ తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
*నెల్లూరు జిల్లా బోగోలు మండల పరిధిలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. 15 మంది కూలీలతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఆటోతోపాటు కారు రోడ్డు పక్కన పడిపోయింది. ప్రమాదంలో ఆటోలోని కూలీల్లో 12మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను కావలి ప్రభుత్వ వైద్యశాల, నెల్లూరు వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
*యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. దక్షిణ ఎక్స్‌ప్రెస్‌ రైలు చివరి బోగీలో అర్ధరాత్రి సమయంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి.దీంతో పార్శిల్‌ బోగీలో ఉన్న సరుకు అంతా దగ్ధమయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అయితే ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరుగలేదని అధికారులు వెల్లడించారు. కాగా, పార్శిల్‌ బోగీలు మంటలు అంటుకోవడంతో మిగిలిన బోగీల్లో ఉన్న ప్రయాణికులు రైలు దిగి పరుగులు పెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..
*మతిస్థిమితం లేని యువతిపై ముగ్గురు కామాంధులు కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. విశాఖపట్నం నగర పరిధిలోని గాజువాకలో వెలుగుచూసింది దారుణం.
*కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నం శివారు ఆకులవారి వీధిలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో తల్లీకూతుళ్లు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆకులవారి వీధిలో సాధనాల లింగన్న కుటుంబం నివసిస్తోంది. శుక్రవారం రాత్రి లింగన్న ఒక గదిలో, అతని భార్య మంగాదేవి (42), కుమార్తె జ్యోతి (22) మరో గదిలో నిద్రించారు. శుక్రవారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఇంట్లో మంటలు చెలరేగాయి. లింగన్న ప్రాణాలతో బయటపడగా తల్లీకూతురు సజీవ దహనమయ్యారు. జ్యోతి కొన్ని నెలల క్రితం దైవాలపాలెం గ్రామానికి చెందిన మేడిశెట్టి సురే్‌షను పెద్దలకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం గర్భంతో ఉన్న ఆమెను ఇటీవలే పుట్టింటి వద్ద వదిలివెళ్లిన సురేష్‌ శుక్రవారం రాత్రి వచ్చి వెళ్లాడు. అయితే అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరగడంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆ సమయంలో ఒక యువకుడు, ఒక మహిళ వెళ్లడం చూశామని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అల్లవరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
* అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పల్నాడు జిల్లా నకరికల్లుకు చెందిన యాతం నరసింహారావు (41) పది ఎకరాలు కౌలుకు తీసుకొని గత రెండు సంవత్సరాలుగా సాగు చేస్తున్నాడు. సాగు కలసిరాక రూ.10 లక్షలకు పైగా అప్పులు కావటంతో మనస్తాపానికి గురై శుక్రవారం రాత్రి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
*భద్రాచలంలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు శనివారం 391 కేజీల ఎండు గంజాయి స్వాధీనం చేసుకుని, ఇరువురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా కూరగాయల లోడుతో వస్తున్న ట్రాలీ వాహనాన్ని పరిశీలిం చగా గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని ఎక్సైజ్‌ శాఖ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా 391 కేజీల గంజాయితో పాటు హైదరా బాద్‌కు చెందిన మహ్మద్‌ ఖాన్‌, ఎంబీ అంజద్‌ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో ఖమ్మం, కొత్తగూడెం అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెంట్‌ తిరుపతి, కరంచంద్‌, సీఐలు సర్వేశ్‌, రహీము న్నీసా, వెంకటేశ్వర్లు, ఎస్సైలు అనిల్‌, మురళీకృష్ణ, పున్నయ్య పాల్గొన్నారు.
*ములుగు: జిల్లాలోని వాజేడు మండలం కొంగాల జలపాతం వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. జలపాతం వద్ద రాకేష్ (21) అనే యువకుడు గల్లంతయ్యాడు. తోటి స్నేహితులతో కలిసి జలపాతంలో స్నానం చేస్తుండగా గల్లంతయ్యాడు. వరంగల్ స్తంబంపల్లికి చెందిన రాకేష్‌గా గుర్తించారు. హైదరాబాద్ టీసీఎస్‌లో రాకేష్ పనిచేస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
*తల్లికి క్యాన్సర్‌ అని తెలిసి ఆవేదనతో కుమారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలో ఒక నూలు మిల్లులో జరిగింది. చిలకలూరిపేట రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం గీతనపల్లి గ్రామానికి చెందిన ఎం.వెంకటరమణ(34) అనే యువకుడు బొప్పూడిలోని ఒక నూలుమిల్లులో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతనితో పాటు భార్య, కుమార్తెలు కూడా క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. అతని తల్లికి క్యాన్సర్‌ అని తెలియడంతో ఆమెను శ్రీకాకుళం జిల్లా నుంచి ఇక్కడకు తీసుకు వచ్చి పరీక్షలు చేయించి మందులు సమకూర్చాడు. ఆ దిగులుతో కుటుంబ సభ్యులందరినీ గీతనపల్లి గ్రామంలో వదిలి పెట్టి తిరిగివచ్చాడు. మూడు రోజులుగా అతను కన్పించక పోవటంతో చుట్టు పక్కల వారు అతని క్వార్టర్స్‌ వద్దకు వచ్చి కిటికిలో నుంచి చూడగా ఉరి వేసుకొని కన్పించాడు. చిలకలూరిపేట రూరల్‌ ఎస్‌ఐ రాజేష్‌ సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
* భద్రాచలంలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు శనివారం 391 కేజీల ఎండు గంజాయి స్వాధీనం చేసుకుని, ఇరువురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా కూరగాయల లోడుతో వస్తున్న ట్రాలీ వాహనాన్ని పరిశీలిం చగా గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని ఎక్సైజ్‌ శాఖ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా 391 కేజీల గంజాయితో పాటు హైదరా బాద్‌కు చెందిన మహ్మద్‌ ఖాన్‌, ఎంబీ అంజద్‌ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో ఖమ్మం, కొత్తగూడెం అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెంట్‌ తిరుపతి, కరంచంద్‌, సీఐలు సర్వేశ్‌, రహీము న్నీసా, వెంకటేశ్వర్లు, ఎస్సైలు అనిల్‌, మురళీకృష్ణ, పున్నయ్య పాల్గొన్నారు.
*ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఓ అండర్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ విద్యార్థిని (18) తన హాస్టల్ గదిలో శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన సీనియర్లు తనను ర్యాగింగ్, వేధింపులకు గురి చేస్తున్నారని సూసైడ్ నోట్‌లో ఆమె ఆరోపించినట్లు తెలుస్తోంది.