Politics

భాజపా నెక్ట్స్ టార్గెట్.. తెలంగాణ, బంగాల్

భాజపా నెక్ట్స్ టార్గెట్.. తెలంగాణ, బంగాల్

హైదరాబాద్ వేదికగా జరుగుతున్న భాజపా కార్యవర్గ సమావేశాల్లో రెండో రోజు తీర్మానాలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రతికూల రాజకీయాలు చేస్తోందని ఆరోపించిన అమిత్ షా ఆ పార్టీ ఎప్పుడూ భ్రమల్లోనే రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. కశ్మీర్‌ సమస్యను అంతర్జాతీయంగా మార్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బంగాల్, తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
హైదరాబాద్ హెచ్‌ఐసీసీ వేదికగా జరుగుతున్న భాజపా కార్యవర్గ సమావేశాల్లో రెండోరోజు పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటక, పుదుచ్చేరి జరిగే ఎన్నికలు, అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు చేశారు. తెలంగాణపై అమిత్ షా, భాజపా అగ్ర నేతలు కీలక ప్రకటన చేయనున్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ ఎంపీలు నియోజకవర్గాల్లోకి వెళ్లాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సూచించారు. సమావేశాల అనంతరం మూడు రోజుల పాటు ఎంపీలు తమ తమ నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా 2 వందల పార్లమెంట్ నియోజకవర్గాలను గుర్తించారు. కేంద్ర మంత్రులు ఈ పార్లమెంట్ నియోజకవర్గాలకు బాధ్యులుగా వ్యవహరించనున్నారు.రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన అమిత్‌షా.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రతికూల రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. కొవిడ్‌, సర్జికల్‌ స్ట్రైక్స్‌ సహా రాహుల్‌గాంధీని ఈడీ ప్రశ్నించినా… రాజకీయమే చేస్తోందన్నారు. విభజనవాదులకు సహరిస్తూ… గందరగోళం సృష్టించాలని చూస్తోందని దుయ్యబట్టారు. కశ్మీర్‌ను అంతర్జాతీయంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలపై అమిత్‌షా విరుచుకుపడ్డారు. అవకాశవాద, అవినీతి రాజకీయాలకి కాంగ్రెస్‌ వేదికగా మారిందని విమర్శించారు. బంగాల్‌, తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.