DailyDose

మణిపూర్ మృత్యుఘోష

మణిపూర్ మృత్యుఘోష

మణిపూర్ నోనీ జిల్లాలో రైలు మార్గం నిర్మాణం జరుగుతున్న చోట కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో ఎంతోమంది మృత్యుఒడిలోకి వెళ్లిపోయారు.ఇంకా ఎందరో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ప్రమాదం జరిగి ఇప్పటికి నాలుగురోజులైంది.రోజురోజుకూ మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటివరకూ ఈ సంఖ్య 42కు చేరుకుంది.ప్రమాదం జరిగి ఇన్నిరోజులైనా చాలామంది ఆచూకి తెలియడం లేదు.వారంతా మృతి చెంది ఉంటారనే అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సుమారు 25మంది విస్తృతంగా గాలింపుచర్యలు చేపట్టారు. వర్షాల వల్ల గాలింపు చర్యలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. మరణించిన వారిలో మామూలు పౌరులతో పాటు టెరిటోరియల్ అర్మీ సిబ్బంది కూడా ఉన్నారని రక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు.సైనిక బృందాలు, అస్సాం రైఫిల్స్,ఎస్ డీ ఆర్ ఎఫ్, ఎన్ డీ ఆర్ ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలే కొంపముంచాయి. రైలుమార్గం నిర్మాణం చురుకుగా సాగుతోందనుకున్న వేళ ఈ ప్రమాదం జరగడం పెద్ద విషాదం. జిరిబామ్ – ఇంఫాల్ మధ్య
కొత్త రైల్వే లైన్ పనులు జరుగుతున్నాయి.సహజంగానే నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో వర్షాకాలంలో పనులు చేపట్టడం క్షేమదాయకం కాదని ఎరిగి కూడా పనిలోకి దింపడం సరియైన చర్య కాదు. ఒకవేళ ఈ కొండచరియలు పక్కకు ఒరిగితే లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయే ప్రమాదం వుంది. గతంలోనూ ఇటువంటి ప్రమాదాలు ఎన్నోసార్లు జరిగాయి.ఇటువంటి సున్నితమైన ప్రాంతాలు, సహజసిద్ధమైన కొండచరియలు, నదీనదాలు,లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ఉన్నచోట మరింత అప్రమత్తంగా ఉండాలి. గతచేదు అనుభవాల నుంచి కూడా పాఠాలు నేర్చుకోలేదు. మణిపూర్ ముఖ్యమంత్రిగా ఇటీవలే బీరేన్ సింగ్ అధికారాన్ని చేపట్టారు. ఈ రాష్ట్రంలో బిజెపి అధికారంలో ఉంది.గడిచిన పాలనా కాలంలోనూ ఈయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. రెండో దఫా ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన అరుదైన అవకాశం సింగ్ కు లభించింది.

తాజా ఘటన ఆయనను కలచి వేసింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి పరిహారాన్ని ప్రకటించారు.పరిహారంతో ఆ కుటుంబాలకు ఆర్ధికంగా కాస్త ఊరట లభిస్తుంది కానీ, పోగొట్టుకున్న ఆత్మీయులను తిరిగి తెచ్చుకోలేని శాశ్వత వేదన వారికి మిగిలింది.మణిపూర్ దేశానికి ఈశాన్య భాగంలో ఉన్న రాష్ట్రాలలో ఒకటి.ఇక్కడి భౌగోళిక పరిస్థితులు మిగిలిన రాష్ట్రాల కంటే భిన్నంగా ఉంటాయి.లోయలు,పర్వతాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సహజసిద్ధంగా అనేకనదులు, ఉపనదులు ఇక్కడ పారుతూ ఉంటాయి.ఈ నదులకు ప్రవాహశీలత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ వంతు కొండలు కఠినంగా,లోయలు ఇరుకుగా ఉంటాయి.
ఈశాన్య రాష్ట్రలైన మణిపూర్,అస్సాం,మేఘాలయ, త్రిపురలో వర్షాకాలంలో వచ్చే వరదలకు ప్రాణనష్టం జరగడం సహజపరిణామంగా మారిపోయిన విషాదాంశం.ఆ ప్రవాహాల్లో అస్సాంలో సుమారు 150మంది ప్రాణాలు కోల్పోయి,ఎందరో గల్లంతైన గతం మన ఎదురుగానే ఉంది.మణిపూర్ తాజా దుర్ఘటనలో మరో విషాదం దాగి ఉంది. కొండచరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయిన కార్మికులు కొందరు విభిన్న రాష్ట్రాల నుంచి వచ్చారు. వారి గురించి సరైన సమాచారం కూడా అధికారులకు అందుబాటులో లేదు. కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించి శరీరాలను అప్పజెప్పే పరిస్థితులు కనిపించడం లేదు. పనిలోకి తీసుకొనే సమయంలోనే కార్మికులకు సంబంధించిన వివరాలను సేకరించకపోవడం మరో తప్పు.ప్రభుత్వం అందించే పరిహారాన్ని ఈ కుటుంబాలకు ఎలా అందిస్తారన్నది పెద్దప్రశ్న. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా నిర్మాణం చేసింది. మన తెలుగునేత కిషన్ రెడ్డి మంత్రిగా ఇటీవలే ఆ బాధ్యతలను తీసుకున్నారు.

కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయాన్ని సాధిస్తూ ఈ రాష్ట్రాల సర్వోన్నత ప్రగతికి సమగ్రమైన బాటలు వేయాల్సి వుంది.మణిపూర్ మొదలు ఈశాన్య రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో,అనుకున్న ఆశయాలను సాధించడం చాలా సులువైన విషయం. ప్రైవేటు పెట్టుబడులను కూడా పెద్దఎత్తున ఆహ్వానించాల్సి ఉంది. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాల్సివుంది. రవాణా,వంతెనలు,నీటి ప్రాజెక్టులు మరెన్నింటినో చేపట్టాల్సివుంది. ఈ క్రమంలో,ఈశాన్య రాష్ట్రాల్లో తరచూ వచ్చే వరదల ప్రమాదాలకు శాశ్వతమైన పరిష్కార మార్గాలను కనిపెట్టాలి.మణిపూర్ తరహా దుర్ఘటనలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టుల నిర్మాణ దశలోనే ప్రమాదాలు జరుగకుండా, ప్రాణనష్టం జరుగకుండా ఉండేలా ప్రత్యామ్నాయ మార్గాలను వెతికిపట్టుకోవాలి.
మణిపూర్ విషాదం ప్రభుత్వాలకు ఏ మేరకు గుణపాఠాలను నేర్పుతుందో చూద్దాం.