DailyDose

TNI – నేటి తాజా వార్తలు

TNI  – నేటి  తాజా వార్తలు

*వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీజేపీ నేత విజయశాంతి డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతాంగం పడుతున్న బాధలను ఆమె ఏకరవు పెట్టారు. ‘‘రాష్ట్రంలో పత్తి పంట సాగు చేసిన వేలాది మంది రైతులు వరుస వర్షాలతో పరేషాన్ అవుతున్నరు. వానాకాలం సీజన్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 7లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతోందని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేశారు. అయితే సంగారెడ్డి జిల్లాలో మాత్రమే దాదాపు పూర్తి స్థాయిలో పత్తి సాగు చేయగా… జులై మూడో వారంలో భారీ వర్షాలు కురవడంతో సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో దాదాపు 50 శాతం వరకు మాత్రమే పత్తి సాగైంది. అయితే ఇందులో వేలాది ఎకరాల పంట ఇటీవల కురిసిన వర్షాలకు పాడైంది. పంట ఎదుగుదల ఆగిపోయింది. తెగుళ్ల సమస్య కూడా ఉంది. నీళ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండడంతో మొలకలు మురిగిపోతున్నయి. ముసురు కారణంగా కలుపు తీయలేని పరిస్థితి ఉండటంతో వేలాది ఎకరాలు బీడు భూముల్ని తలపిస్తున్నయి. మళ్లీ గత నాలుగు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని ముసురుతో పత్తి పంటపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నరు. ఒక్క ఉమ్మడి మెదక్ జిల్లాలోనే కాదు… తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి ఉంది. తమని ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నప్పటికీ…. కేసీఆర్ (KCR) సర్కార్ నుంచి కనీస స్పందన కరువైంది. ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపై స్పందించి అన్నదాతలను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నం.

*నల్లగొండ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు రూ.233.82 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో 44 జారీచేసింది. ఈ నిధులతో పానగల్లు, పచ్చల సోమేశ్వర దేవాలయాలకు మహర్దశ రానుంది. నల్లగొండ ఐటీ పార్కు నుంచి ఉదయ సముద్రానికి అప్రోచ్‌ రోడ్డు నిర్మించనున్నారు.

*ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం(Srisailam) ఆలయానికి భక్తులు పోటెత్తారు. శని, ఆది, సోమవారం సెలవు రోజులు రావడంతో రద్దీ పెరిగింది. స్వామి అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. రద్దీ కారణంగా ఆలయ అధికారులు స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, వీఐపీ బ్రేక్ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. స్వామి దర్శనానికి సుమారు 4 గంటలు సమయం పడుతోంది.

*స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం చేపట్టిన ఫ్రీడం ర్యాలీ అట్టహాసంగా సాగింది. నెహ్రూ పార్క్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీ చౌక్, రాష్ట్రపతి రోడ్, బస్టాండు మీదుగా కలెక్టరేట్ వరకు కొనసాగింది.

*రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) వివరాలను ప్రభుత్వం మరోసారి సేకరిస్తోంది. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ 22 వేల మందికిపైగా వీఆర్‌ఏలు 19 రోజులుగా సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ వివరాలను సేకరించాలని నిర్ణయించడం గమనార్హం. వీఆర్‌ఏల ప్రధాన డిమాండ్‌ అయిన పేస్కేల్‌ అంశాన్ని తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలోనే యుద్ధప్రాతిపదికన వారి వివరాలను పంపాలని తహసీల్దార్లకు సీసీఎల్‌ఏ నుంచి ఆదేశం వచ్చిందని, అందుకే ఈ వివరాలను సేకరిస్తోందని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

*కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(75) మళ్లీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ ఎంపీ, కాంగ్రెస్‌ కమ్యూనికేషన్స్‌ ఇంచార్జ్‌ జైరామ్‌ రమేశ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని, ప్రొటోకాల్‌ ప్రకారం హోం ఐసోలేషన్‌లో ఉన్నారని జైరామ్‌ వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్‌ అధికారిక ట్విటర్‌ పేజీ సైతం ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఆమె త్వరగా కోలుకోవాలని ట్వీట్‌ చేసింది.

*ములుగు: జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం రేపుతోంది. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఏటూరు నాగారం — మహదేవపూర్ ఏరియా కమిటి కార్యదర్శి సబిత పేరుతో లేఖ విడుదల అయ్యింది. సాగు భూముల జోలికి వస్తే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని లేఖలో హెచ్చరించారు. పెద్దపళ్లి జడ్పీ చైర్పర్సన్ పుట్ట మధు అతని అనుచరులు మరి కొంతమంది కబ్జాదారులు.. ఆదివాసులు సాగు చేసుకునే భూముల జోలికి వస్తున్నారని మావోయిస్టులు పేర్కొన్నారు. ఆదివాసుల భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేసి అధికారులకు మామూలు ముట్టజెప్పి, పట్టాలు చేసుకుని రైతుబంధు పొందుతున్నారని మావోయిస్టులు లేఖలో ఆరోపించారు.

*స్వాతంత్ర్య ఉద్యమంలో తెలుగు వారు కీతక పాత్ర పోషించారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ భవన్‌లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా జాతీయ పతాకాన్ని టీడీపీ అధినేత ఆవిష్కరించారు. దేశం నాకేమిచ్చింది అని కాదు.. దేశానికి నేనేమిచ్చాను.. అనే విధంగా ఆలోచన చేయాలని పిలుపు నిచ్చారు. దేశంలో సంస్కరణలు తెచ్చిన పీవీ నరసింహారావు తెలుగు బిడ్డ కావటం గర్వకారణమని అన్నారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య ను యువత గుర్తు చేసుకోవాలని చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ (NTR) తీసుకొచ్చిన పాలసీలు దేశానికి మార్గదర్శకంగా నిలిచాయన్నారు.

*సంగారెడ్డిలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంత్రి హరీష్ రావు వజ్రోత్సవాల్లో పాల్గోని ర్యాలీని ప్రారంభించారు. 75 అడుగుల మువ్వెన్నల‌ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, యువత భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. సంగారెడ్డి పట్టణం త్రివర్ణ పతాకాల మయమైంది. బతుకమ్మలు, బోనాలు, డప్పు‌ వాయిద్యాలతో ర్యాలీలో ‌సందడి నెలకొంది. ఎంపీలు బీబీ పాఠిల్ కొత్త ప్రభాకర్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ , డీసీఎంఎస్‌ ఛైర్మన్ శివ కుమార్ ర్యాలీలో ‌పాల్గొన్నారు.

*టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఎన్టీఆర్ భవన్‌కు చేరుకున్నారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఉదయం 10:30 గంటలకు ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’’ వేడుకలను టీడీపీ అధినేత ప్రారంభించనున్నారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయులు హాజరుకానున్నారు.

*హైదరాబాద్: నగరంలోని గోపాలపురంలో పోలీసులు తిరంగ ర్యాలీ నిర్వహించనున్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని తిరంగ ర్యాలీని ఏర్పాటు చేశారు. చిలకలగూడ ఎక్స్ రోడ్స్ నుంచి రైల్ నిలయం – ఆర్‌ఆర్‌సీ గ్రౌండ్ వరకు ర్యాలీ కొనసాగనుంది. తిరంగా ర్యాలీలో నాలుగు వేల మంది వరకు పాల్గొనే అవకాశం ఉంది. భిన్నత్వంలో ఏకత్వం నినాదాన్ని పాటిస్తూ అన్ని మతాల వారు ర్యాలీలో పాల్గొనేలా ఏర్పాట్లు జరిగాయి. జాతీయ జెండాలు, మూడు రంగుల బెలూన్లతో 2 కిలోమీటర్ల మేర ర్యాలీ జరుగనుంది. ర్యాలీలో 750 మీటర్ల జెండాను పోలీసులు, విద్యార్థులు ప్రదర్శించనున్నారు. సికింద్రాబాద్‌ ఆర్‌ఆర్‌సీ గ్రౌండ్‌లో పోలీసులు పెద్దసంఖ్యలో బెలూన్లు వదలనున్నారు.

* నాగార్జునసాగర్ ప్రాజెక్టు కు భారీ వరద కొనసాగుతోంది. అధికారులు ప్రాజెక్ట్ 26 క్రస్ట్ గేట్లు 10 ఫీట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్‌లో ఇన్ ఫ్లో 4,39,987 క్యూసెక్కులు మేర వచ్చి చేరుతోంది. అలాగే ఔట్ ఫ్లో 4,11,376 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను… ప్రస్తుత నీటి మట్టం 586.50 అడుగులకు చేరింది. పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 312.0405 టీఎంసీలు కాగా… ప్రస్తుత నీటి నిల్వ 302.9125 టీఎంసీలకు చేరింది.

*రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల ను బదిలీ చేస్తూ శనివారం ఉదయం ఉత్తర్వులు జారీ అయ్యాయి. సాంకేతిక విద్యా శాఖ డైరెక్టరుగా నాగరాణి ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాంకేతిక విద్యా శాఖ డైరెక్టర్ బాధ్యతల నుంచి పొల భాస్కర్ ను రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. జౌళి, చేనేత శాఖ కమిషనర్ గా ఎం. ఎం నాయక్‌ నియమితులయ్యారు. అలాగే ఎం. ఎం నాయక్‌కు ఆప్కో సీఎండీ, ఖాదీ విలేజ్ బోర్డు సీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి కి సాంఘీక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశించారు.

*తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర శనివారం ప్రారంభమైంది. కేంద్ర మాజీ మంత్రులు టీ.సుబ్బిరామిరెడ్డి చింతా మోహన్పా దయాత్రలో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ భవన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ…. టీటీడీ పరిపాలను ప్రస్తుతం చాలా బాగుందన్నారు. టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి , ఈఓ ధర్మారెడ్డి నేతృత్వంలో మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. అన్యాయానికి అవకాశం లేకుండా భక్తులకు సేవ చేస్తున్నారన్నారు. ఎంత మంచి పాలన ఉన్నా దానిపై రాళ్లు వేయడం మామూలే అన్నారు. రెండుసార్లు టీటీడీ చైర్మన్‌గా చేసిన వ్యక్తిగా టీటీడీ పాలనను ప్రశంసిస్తున్నట్లు సుబ్బిరామిరెడ్డి తెలిపారు.

* ఓటరు జాబితాలోని అవకతవకలను సరిచేయాలంటూ ఎన్నికల కమిషన్‌ (EC)కు మాజీ మంత్రి దేవినేని ఉమా ఫిర్యాదు చేశారు. గత నాలుగు రోజులుగా గొల్లపూడి 265 బూత్ పరిధిలో దేవినేని ఉమా పర్యటిస్తున్నారు. ఓటు జాబితాలో తన దృష్టికి వచ్చిన అవకతవకలను మాజీ మంత్రి మంత్రి లేఖలో పొందుపరచారు. విజయవాడ రూరల్ మండలం, గొల్లపూడి సచివాలయం -2లో లేఖను అందజేసిన నేతలు… గోడ వద్ద లేఖ ప్రతిని అంటించారు. ఎన్నికల కమిషన్‌, కలెక్టర్, ఈఆర్వో వెంటనే స్పందించి ఓటరు జాబితాలోని అవకతవకలను సరిచేయవలసిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేయమని దేవినే ఉమా విజ్ఞప్తి చేశారు.

*తెలంగాణ కాంగ్రెస్‌లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యవహారం కాక పుట్టిస్తోంది. ట్విటర్‌ హిస్టరీ వెంకట్‌రెడ్డి మార్చారు. ‘‘నాలుగుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి, ప్రస్తుతం ఎంపీగా ఉన్నాను. 3 దశాబ్దాలుగా పార్టీకి హోంగార్డుగా పనిచేస్తున్నాను’’ అని ట్విటర్‌ ప్రొఫైల్‌లో వెంకటరెడ్డి పేర్కొన్నారు. కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీపై వెంకటరెడ్డి అలకబూనారు. మునుగోడు ఉప ఎన్నిక ల ప్రచారానికి తనను పిలవలేదని, అందుకే ఆ ఉప ఎన్నికకు పూర్తిగా దూరంగా ఉంటున్నానని ఆయన తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి నిర్వహించిన సమావేశాలకు పార్టీ నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. తన నివాసంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఏ మీటింగ్‌ జరిగినా నాకు సమాచారం ఇవ్వడం లేదు. సమావేశానికి రావాలని ఆహ్వానించకపోతే ఎలా వెళ్లాలి? చండూరులో జరిగిన బహిరంగ సభలో నన్ను అసభ్యంగా తూలనాడారు. హోం గార్డుతో పోల్చారు. దీని వెనక ఎవరున్నారో అందరికీ తెలుసు. పార్టీ నుంచి నన్ను బయటకు వెళ్లగొట్టే ప్రయత్నం జరుగుతోంది. అవమానిస్తే పార్టీ నుంచి నా అంతట నేనే వెళ్లిపోతానని అనుకుంటున్నారు. నన్ను వెళ్లగొట్టి కాంగ్రెస్‌ను ఖాళీ చేద్దామనుకుంటున్నారు’’ అని ఆరోపించారు. జరుగుతున్న విషయాలన్నింటినీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, నాయకుడు రాహుల్‌ గాంధీ కి వివరిస్తానన్నారు.

*ఆర్థికంగా వెనుకబడినవారు ఏదైనా మతానికి చెందినవారు కాకపోయినప్పటికీ, వారికి అర్హతగల ప్రభుత్వ పథకాలను నిరాకరించరాదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. తమకు మతం లేదని ప్రకటించినవారికి కమ్యూనిటీ సర్టిఫికేట్లను జారీ చేయడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొందరు నాన్ రెలిజియస్ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసింది.

* రాజస్థాన్‌లోని పాఠశాల విద్యార్థులు ప్రపంచ రికార్డు సృష్టించారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా దాదాపు కోటి మంది పాఠశాల విద్యార్థులు శుక్రవారం దేశభక్తి గీతాలను ఆలపించి ఈ రికార్డును నెలకొల్పారు. ఇందులో భాగంగా ‘వందే మాతరం’, ‘సారే జహాసే అచ్చా’, జాతీయ గీతం ‘జనగణమన’ వంటి గీతాలను దాదాపు 25 నిమిషాలపాటు ఆలపించారు. ఈ సందర్భంగా సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ఘనత సాధించిన విద్యార్థులను అభినందించారు.

*అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే కేపీపీ భాస్కర్‌ ఆదాయానికి మించి అక్రమాస్తులు సంపాదించారనే ఆరోపణలపై చేపట్టిన దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఆయన నివాసగృహాలు, బంధువులు, కుటుంబీకుల నివాసగృహాల్లో అవినీతి నిరోధక విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కేపీపీ భాస్కర్‌ నామక్కల్‌ నియోజకవర్గం నుంచి 2011, 2016 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. గత శాసనసభ ఎన్నికల్లో మూడోసారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

*యువతను దేశ సంపదగా పరిగణిస్తారు. యువత కారణంగానే దేశం ప్రగతిపథంలో, విజయపథంలో నడుస్తుంది. విద్య, నైపుణ్యం, క్రమశిక్షణ కలిగిన యువత దేశంలో ఉంటే ఆ దేశం అన్ని రంగాలలో ఉన్నతిని చవిచూస్తుంది. ఆచార్య చాణక్యుడు చాణక్య నీతి ద్వారా ఈ విషయాన్ని వివరించడానికి ప్రయత్నించాడు. చాణక్య నీతి ప్రకారం మార్పుకు, ప్రగతికి బాటలు వేసేది యువతే. బద్ధకం, ఆలోచనా రాహిత్యం, నిరక్షరాశ్యత, క్రమశిక్షణ లేని యువత రాష్ట్రాన్ని, దేశాన్ని, కుటుంబాన్ని అంధకారంలోకి నెట్టివేస్తుంది.

*భారీ వరదలతో చిగురుటాకులా వణికిపోయిన కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు డ్యామ్‌ సేఫ్టీ యాక్ట్‌లో భాగంగా ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం ప్రాజెక్టు తనిఖీ చేపట్టాలని స్టేట్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ (ఎస్‌డీఎస్‌వో) నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు ఇప్పటికే డ్యామ్‌ రిహాబిలిటేషన్‌ ఇంప్లిమెంటేషన్‌ ప్రాజెక్టు (డ్రిప్‌)లో ఉంది. డ్రిప్‌లో భాగంగా డ్యామ్‌ సేఫ్టీ రివ్యూ ప్యానల్‌తో ప్రాజెక్టును తనిఖీ చేయాల్సి ఉన్నా.. ఆలస్యమయింది. తాజాగా డ్యామ్‌ సేఫ్టీ యాక్ట్‌ అమల్లోకి రావడంతో ఇందులో భాగంగా భాగంగా నీటిపారుదల శాఖ ఏర్పాటు చేసిన ఎస్‌డీఎస్‌వో రంగంలోకి దిగనుంది. కడెం ప్రాజెక్టును పరిశీలించి.. జరిగిన నష్టాన్ని అంచనా వేసి, రక్షణపై తగిన సిఫారసులు చేయాలని సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌(సీడీవో) చీఫ్‌ ఇంజనీర్‌కు ఈఎన్‌సీ(జనరల్‌) మురళీధర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఎస్‌డీఎస్‌వో ఇన్‌చార్జి కూడా ఈఎన్‌సీయే కావడంతో ఈయన కింద ఉన్న ఈ విభాగం త్వరలోనే కడెం ప్రాజెక్టు వద్ద అడుగు పెట్టనుంది. గోదావరి బేసిన్‌లో ప్రతి సీజన్‌లోనూ నిండే ప్రాజెక్టుల్లో కడెం ప్రాజెక్టు ఒకటి. ఆకస్మిక వరదలతో ఈ ప్రాజెక్టు ఏటా ఆటుపోట్లకు గురవుతూనే ఉంది.

* అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన మిస్‌ ఇండియా యూఎ్‌సఏ-2022 పోటీల్లో పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ఇలపర్రుకు చెందిన చేకూరి పేర్రాజు, కృష్ణవేణి దంపతుల మనవరాలు సంజన రన్నర్‌పగా నిలిచారు. ఆమె తల్లిదండ్రులు రంగరాజు, మధు ఇరవై ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. సంజన ఎంఎస్‌ చదువుతోంది.

*రైలు సికింద్రాబాద్‌ – పుణే శతాబ్ది ఎక్స్‌ప్రె్‌సకు దీన్ని ఏర్పాటు చేశారు. కరోనా కారణంగా నిలిపివేసిన ఈ రైలును బుధవారం నుంచి పునఃప్రారంభించారు. అదనపు ఆకర్షణగా విస్టాడోమ్‌ కోచ్‌ ఏర్పాటు చేశారు. పైకప్పు సహా మొత్తం బోగీని గాజుతో నిర్మించారు. పెద్ద కిటికీలు ఏర్పాటు చేశారు. దాంతో సికింద్రాబాద్‌ – పుణే మార్గ మద్యంలో ఉండే ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశం ప్రయాణికులకు కలిగింది.

*స్వాత్రంత్య్ర అమృతోత్సవాల్లో భాగంగా ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నియోజకవర్గానికి 75 మందిని ఎంపికచేసి రక్తాన్ని సేకరించనున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఎమ్‌ అండ్‌ హెచ్‌వోలకు ఆదేశాలు జారీచేశారు. మానిటరింగ్‌ ఆఫీసర్లుగా డీఎమ్‌హెచ్‌ఓలు వ్యవహరించనున్నారు. తప్పనిసరిగా రక్తదాన శిబిరాలు విజయవంతం కావాలని సీఎస్‌ సోమే్‌షకుమార్‌ పిలుపునిచ్చారు. ఈమేరకు అన్ని జిల్లాల్లో ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభమైంది.

* దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఐదుగురు పోలీసులకు కేంద్ర హోం మంత్రి మెడల్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఇన్వెస్టిగేషన్‌ – 2022 అవార్డు లభించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర హోం శాఖ జాబితాను విడుదల చేసింది. డీఎస్పీ బీ సీతారామయ్య, ఏసీపీ శ్రీనివాసరావు కొల్లి, ఇన్స్‌పెక్టర్లు కన్నుజు వాసు, సత్యనారాయణ ముత్యాల, ఎస్‌ఐ ఖాదర్‌ బాషాకు మెడల్‌ లభించింది. కాగా, సీబీఐ, ఎన్‌ఐఏ, ఎన్‌సీబీ వంటి దర్యాప్తు సంస్థల్లో పనిచేస్తున్న అధికారులతో సహా వివిధ రాష్ట్రాల్లోని పోలీసు అధికారులకు కలిపి మొత్తం 151 మందికి కేంద్రం ఈ మెడల్‌ను ప్రకటించింది. ఆగస్టు 15న ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. నేర పరిశోధనలో అత్యుత్తమ ప్రమాణాలతో పరిశోధన చేసినందుకు కేంద్ర హోం శాఖ 2018 నుంచి ఈ అవార్డులను ఇస్తోంది.

*వివిధ బ్యాంకుల్లో రుణ ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత సుజనా చౌదరి శుక్రవారం చెన్నైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కోర్టుకు హాజరయ్యారు. రుణ ఎగవేత ఆరోపణలపై సీబీఐ గతంలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. వాటి ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ సైతం కేసులు పెట్టింది. వాటి విచారణకు సంబంధించి సుజనా చౌదరి చెన్నైలోని ఈడీ కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణ ఈ నెల 26కి వాయిదా పడింది.

* ప్రభుత్వ సాంఘిక సంక్షేమశాఖ కళాశాల హాస్టల్స్‌లో విధులు నిర్వహిస్తున్న కుక్‌లు, హెల్పర్లు, కాపలాదారులకు వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సంక్షేమ శాఖల నాల్గవ తరగతి ఉద్యోగుల, ఔట్‌సోర్సింగ్‌ అండ్‌ డైలీవేజ్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

*విజయవాడలో అక్టోబరు 14 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే సీపీఐ జాతీయ మహాసభలకు ప్రత్యేక లోగోను రూపొందించారు. ఈ లోగోను రూపొందించడానికి పార్టీ నేతలు జూలై నెలలో 15 రోజులపాటు పోటీలు నిర్వహించారు. ఇందులో ఎడ్ల సేతిన్‌.. కృష్ణవేణి విగ్రహంతోపాటు ప్రకాశం బ్యారేజ్‌ ఉన్న ఫొటోతో రూపొందించిన లోగోను నేతలు ఎంపిక చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ రూ.20 వేల బహుమతిని విజయవాడలో సేతిన్‌కు శుక్రవారం అందజేశారు.

* జగన్‌ ప్రభుత్వ వేధింపులకు నిరసనగా ఈ నెల 17న విజయవాడలో వ్యాపారులు సమర భేరి మోగించనున్నట్లు తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం వెల్లడించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఆధ్వర్యంలో ఆ రోజు వ్యాపారుల సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలు, వేధింపులపై చర్చిస్తామని వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండీ రాకేశ్‌ తెలిపారు.

*ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా వారసత్వపు కట్టడాలు, పురాతన మసీదులు, చర్చిల వద్ద శుక్రవారం జెండా పండుగ నిర్వహించినట్టు రాష్ట్ర మైనార్టీశాఖ కార్యదర్శి ఇంతియాజ్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న జెండా మహోత్సవంలో భాగంగా సీఎం జగన్‌ పిలుపు మేరకు ముస్లింలు, క్రైస్తవులు.. శుక్రవారం ప్రార్థనల అనంతరం జాతీయ జెండాలు చేబూని ర్యాలీలు నిర్వహించినట్లు ఒక ప్రటనలో పేర్కొన్నారు. విజయనగరంలోని జామియా మసీదు అతిపురాతనమైనదిగా పేరొందిందని ఆ మసీదు ఇమామ్‌, మౌజమ్‌ నిర్వహణా కమిటీ సభ్యులు ఇతర ముస్లింలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారని చెప్పారు. ఏలూరులోని మదరసాలో విద్యార్థులు జాతీయ జెండా ఎగురవేస్తూ ర్యాలీలు నిర్వహించారన్నారు. గుంటూరు, కృష్ణా, కర్నూలు తదితర జిల్లాల్లో జాతీయ జెండాలతో ముస్లింలు, క్రైస్తవులు ర్యాలీ తీసి జాతీయ భావాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు.

*ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ మేరకు శుక్రవారం విజయవాడలోని సీఎస్‌ క్యాంపు కార్యాలయం నుంచి ఆయన అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటిపైనా, భవనంపైన జాతీయ జెండా ఎగరాలని చెప్పారు. గత వారం రోజులుగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను సీఎస్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా రజత్‌భార్గవ 12 నుంచి 15వ తేదీ వరకూ చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. కాగా, ఈ నెల 15న విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని సమీర్‌శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రొటోకాల్‌ విభాగం సంచాలకులు సుబ్రహ్మణ్యంరెడ్డి మాట్లాడుతూ.. వివిధ శాఖల వారీగా చేస్తున్న ఏర్పాట్లను వివరించారు.

*సింగరేణిలో కల్తీ డీజిల్ సరఫరా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రామగుండం రీజియన్ వన్ పరిధిలో బొగ్గు గనులకు డీజిల్ సరఫరా చేస్తారు. జీడీకే 11A ఇంక్లైన్ గనికి సరఫరా చేస్తున్న డీజిల్లో నీరు కనిపించింది. సిబ్బంది ట్యాంకర్ నుంచి డీజిల్ను బకెట్లో బయటకు తీయగా.. డీజిల్కు బదులు నీరు ఉండటంతో సిబ్బంది షాకయ్యారు. డీజిల్ శాంపిల్స్ను ల్యాబ్కు పంపారు.

*దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఐదుగురు పోలీసులకు కేంద్ర హోం మంత్రి మెడల్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఇన్వెస్టిగేషన్‌ – 2022 అవార్డు లభించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర హోం శాఖ జాబితాను విడుదల చేసింది. డీఎస్పీ బీ సీతారామయ్య, ఏసీపీ శ్రీనివాసరావు కొల్లి, ఇన్స్‌పెక్టర్లు కన్నుజు వాసు, సత్యనారాయణ ముత్యాల, ఎస్‌ఐ ఖాదర్‌ బాషాకు మెడల్‌ లభించింది. కాగా, సీబీఐ, ఎన్‌ఐఏ, ఎన్‌సీబీ వంటి దర్యాప్తు సంస్థల్లో పనిచేస్తున్న అధికారులతో సహా వివిధ రాష్ట్రాల్లోని పోలీసు అధికారులకు కలిపి మొత్తం 151 మందికి కేంద్రం ఈ మెడల్‌ను ప్రకటించింది. ఆగస్టు 15న ఈ అవార్డులను ప్రదానం చేస్తారు.

*తన కారు మాజీ డ్రైవర్‌, దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్యకేసులో నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును శుక్రవారం రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి కేసును ఈ నెల 16కి వాయిదా వేశారు. రిమాండ్‌ను 26వ తేదీ వరకూ పొడిగించారు. అనంతరం బాధిత కుటుంబం తరఫున పోరాడుతున్న న్యాయవాది, ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు విలేకరులతో మాట్లాడారు. ‘‘అనంతబాబుకు బెయిల్‌ రావడానికి వీలుగా పోలీసులు సహకరిస్తున్నారు. సాధారణంగా 90 రోజుల్లోపు చార్జిషీట్‌ వేయకపోతే బెయిల్‌ వస్తుంది. ఈ నెల 20కి 90 రోజులు పూర్తవుతాయి. కేవలం బెయిల్‌ ఇవ్వడం కోసమే చార్జిషీట్‌ దాఖలు చేయడం లేదు. ఇప్పటికీ నేర స్థలం గుర్తించలేదు. ఇతర నేరస్తులను కూడా గుర్తించలేదు. చట్టబద్ధ విధులను పాటించని పోలీసులపై ఇప్పటికే మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు ఉంది. అనంతబాబుపై గతలో రౌడీషీట్‌ నంబరు 22 ఉంది. కానీ కోరినా పోలీసులు సక్రమంగా సమాచారం ఇవ్వడం లేదు. సెంట్రల్‌ జైలులో అతనికి అధికారులు చేస్తున్న రాచమర్యాదలను ప్రత్యక్ష సాక్ష్యాలతో బయటపెడతాం. గవర్నర్‌, ప్రభుత్వం, డీజీపీ వంటి వారు స్పందించకపోవడం వల్లే బాధితులు హైకోర్టును ఆశ్రయించారు’’ అని ముప్పాళ్ల తెలిపారు.

*సీఎం జగన్‌ (CM Jagan) క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠ్యపుస్తకాల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని స్కూళ్లకు ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పిస్తూ.. దశలవారీగా డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. భద్రత, ఆరోగ్యం తదితర అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించాలని, విద్యార్థినుల సమస్యలపై మహిళా టీచర్ ద్వారా కౌన్సెలింగ్ ఇప్పించాలని ఆదేశించారు. స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు.

* సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సచివాలయ నిర్మాణ పనులను మంత్రి ప్రశాంత్‌రెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. నిర్మాణ ప్రాంగణమంతా కలియతిరుగుతూ పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. వేగంగా జరుగుతున్న పనుల పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి విధించిన గడువులోగా నిర్మాణ పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

*స్వాత్రంత్య్ర అమృతోత్సవాల్లో భాగంగా ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నియోజకవర్గానికి 75 మందిని ఎంపికచేసి రక్తాన్ని సేకరించనున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఎమ్‌ అండ్‌ హెచ్‌వోలకు ఆదేశాలు జారీచేశారు. మానిటరింగ్‌ ఆఫీసర్లుగా డీఎమ్‌హెచ్‌ఓలు వ్యవహరించనున్నారు. తప్పనిసరిగా రక్తదాన శిబిరాలు విజయవంతం కావాలని సీఎస్‌ సోమే్‌షకుమార్‌ పిలుపునిచ్చారు. ఈమేరకు అన్ని జిల్లాల్లో ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభమైంది

*స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 16న రాష్ట్రంలోని 33 జిల్లాల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలిస్తూ కవి సమ్మేళనాలు జరగనున్నాయని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ గౌరీశంకర్‌ తెలిపారు. శుక్రవారం జిల్లాల డీపీఆర్వోలతో సమాచార శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ కె.నాగయ్య ఆధ్వర్యంలో రవీంద్రభారతి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించినట్టు చెప్పారు. ‘‘స్వాతంత్య్ర స్ఫూర్తి-వజ్రోత్సవ దీప్తి’’ కవితా వస్తువుగా కవులు తమ కవితాగానం చేస్తారన్నారు.

*పోలీస్‌ శాఖలో వివిధ కేటగిరీల్లో ఎస్సై పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్ష ‘కీ’ విడుదలైంది. 554 ఎస్సై పోస్టులకు ఆగస్టు 7న ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించారు. ఆ పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ‘కీ’ని నియామక బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో శుక్రవారం నుంచి అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ‘కీ’లో ఏవైనా అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తేవాలని పోలీస్‌ నియామక బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివా్‌సరావు తెలిపారు. అభ్యంతరాలకు సంబంధించి రెఫరెన్స్‌ మెటీరియల్‌ను పీడీఎఫ్‌, జేపీఈజీ ఫార్మాట్‌లో అందజేయాలన్నారు.

*తెలంగాణ భవిష్యత్తు మార్పునకు రెఫరెండంగా మునుగోడు ఉప ఎన్నిక జరగనుందని తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. ‘‘ప్రజా సమస్యల పరిష్కారం కోసం మూడున్నరేళ్లుగా చేసిన పోరాటాలు ఫలించలేదు. దీంతో నా పదవి త్యాగం చేశాను. ఇన్నాళ్లుగా ప్రతిపక్ష ఎమ్మెల్యే నియోజకవర్గమని కక్షగట్టిన సీఎం కేసీఆర్‌ నా రాజీనామాతో వెంటనే అభివృద్ధికి నిధులు కేటాయించేందుకు దిగివస్తున్నాడు’’ అని విమర్శించారు. మునుగోడులో శుక్రవారం ఆయన విలేకరులతో మట్లాడారు. తన రాజీనామా వెనక ఎలాంటి స్వార్థం లేదన్నారు. ఇన్నాళ్లుగా నిలిపేసిన అభివృద్ధి నిధులు తన రాజీనామా తర్వాత మంజూరవుతున్నాయని తెలిపారు. ‘‘చేనేత కార్మికులకు నేతన్న బీమా పథకం అమల్లోకి వచ్చింది. గట్టుప్పల్‌ మండలం ఏర్పాటైంది. వృద్ధాప్య పింఛన్ల మంజూరు వంటి పథకాల అమలు నా వల్లే’’అని చెప్పుకొచ్చారు.

*నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన జంట టవర్ల కూల్చివేతకు ఈ నెల 28వ తేదీని గడువుగా నిర్ణయిస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఏవైనా సాంకేతికపరమైన ఇబ్బందులు, వాతారణపరమైన సమస్యలు తలెత్తితే ఆ గడువును సెప్టెంబరు 4 వరకు పొడిగిస్తూ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎ.ఎ్‌స.బోపన్నల ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. నోయిడాలో ఎమరాల్డ్‌ ప్రాజెక్టులో సూపర్‌టెక్‌ నిర్మించిన 40 అంతస్తుల టవర్లు నిబంధనలకు అనుగుణంగా లేవని గత ఏడాది ఆగస్టు 31న సుప్రీంకోర్టు తెలిపింది. వాటిని ఈ నెల 21లోగా కూల్చివేయాలని తొలుత ఆదేశించింది. అయితే నిపుణుల సలహా మేరకు ఆ గడువును ఈ నెల 28 వరకు పెంచింది. కూల్చివేత బాధ్యతలను ఎడిఫైస్‌ ఇంజినీరింగ్‌ సంస్థ చేపట్టనుంది.

* దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. శుక్ర‌వారం నాడు కొత్త‌గా 2,136 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 10 మంది మ‌ర‌ణించారు. క‌రోనాతో ఒకే రోజు 10 మంది మ‌ర‌ణించ‌డంతో ఢిల్లీ ఆరోగ్య శాఖ అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఇక ఢిల్లీలో గ‌త ప‌ది రోజుల నుంచి వ‌రుస‌గా 2 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదవుతున్నాయి. ప్ర‌స్తుతం పాజిటివిటీ రేటు 15.02 శాతంగా ఉంది. గురువారం రోజు ఆరుగురు మ‌ర‌ణించ‌గా, 2,726 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

* స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 1932లో నిజాం స్టేట్‌ రైల్‌ అండ్‌ రోడ్డు ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌ నడిపిన బస్‌ నుంచి ప్రస్తుతం టీఎస్‌ఆర్టీసీ నడుపుతున్న గరుడ, ఒలెక్ట్రా ఏసీ బస్సులతో ప్రభుత్వం పరేడ్‌ ఏర్పాటుచేస్తోంది. ‘గ్రాండ్‌ బస్‌ పరేడ్‌’ పేరిట శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ట్యాంక్‌బండ్‌పై ఈ కార్యక్రమం నిర్వహించనుంది. ఇందులో 7వ నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ప్రయాణించిన ‘అల్బేనియం’ బస్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. డీజిల్‌తో నడిచే ఈ వాహనాన్ని రోడ్డెక్కించేందుకు ఉప్పల్‌ ఆర్టీసీ వర్క్‌ షాప్‌లో సిద్ధం చేస్తున్నారు.
* ఎస్సై ప్రాథమిక రాత పరీక్ష ప్రశ్నపత్రంలో ఏకంగా 8 తప్పులు దొర్లాయి. మరో 6 ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు సరైనవేనని గుర్తించారు. రాష్ట్ర పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఆధ్వర్యంలో 554 పోస్టులకు ఈ నెల 7న నిర్వహించిన పరీక్ష ‘కీ’ని శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా తప్పుల విషయం వెల్లడైంది. ఇంగ్లీష్‌-తెలుగు వెర్షన్‌లోని ‘ఎ’ బుక్‌లెట్‌లో 43, 111, 146, 173, 180, 184, 195, 199 ప్రశ్నల్లో తప్పులు దొర్లాయి. ఈ నేపథ్యంలో ప్రతి అభ్యర్థికి 8 మార్కులు కలపాలని మండలి ఉన్నతాధికారులు నిర్ణయించారు. మొత్తం 200 ప్రశ్నలకు 60 మార్కులను (30%) అర్హతగా నిర్ణయించిన సంగతి విదితమే. తాజా నిర్ణయం నేపథ్యంలో 52 మార్కులొచ్చిన అభ్యర్థి సైతం పరీక్షలో గట్టెక్కినట్లే. ఆయా అభ్యర్థులు తదుపరి శారీరక సామర్థ్య పరీక్షలకు అర్హత సాధించినట్లవుతుంది. మరో ఆరు ప్రశ్నలకు ఒకటికంటే ఎక్కువ సమాధానాలు సరైనవేనని గుర్తించారు. ‘ఎ’ బుక్‌లెట్‌లో 54వ ప్రశ్నకు 3 సరైన సమాధానాలుండగా.. 114, 183, 186, 192, 197 ప్రశ్నలకు రెండేసి సరైన సమాధానాలున్నాయి. వీటిలో దేనికి బబ్లింగ్‌ చేసినా మార్కులిచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకటికంటే ఎక్కువ సమాధానాలున్న ప్రశ్నలకు సైతం మార్కులు కలపాలనే వాదన వినిపిస్తోంది. ‘తప్పు సమాధానాలకు నెగెటివ్‌ మార్కులున్నందున పలువురు అభ్యర్థులు వాటిని వదిలేసే అవకాశముంది. దీంతో బహుళ సమాధానాలున్న ప్రశ్నలకూ మార్కులు కలపాలి’ అని అక్షర సర్కిల్‌ నిర్వాహకుడు విష్ణువర్ధన్‌ డిమాండ్‌ చేశారు.

*మహారాష్ట్రలో భారీ వర్షాలకు కురుస్తున్నాయి. ప్రాణహిత నదికి వరద నీరు పోటెత్తుతున్నది. దీంతో భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద వరద ఉధృతి పెరిగింది. పుష్కరఘాట్లను వరద నీరు ముంచెత్తింది. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద నీటిమట్టం 12.9 మీటర్లకు చేరింది. అలాగే మేడిగడ్డ బ్యారేజ్‌కు ఇన్‌ఫ్లో 11.37లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. 85గేట్లను ఎత్తివేసి అంతే మొత్తం అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. అన్నారం బ్యారేజీకి ఇన్‌ఫ్లో 35,861 క్యూసెక్కులు ఉండగా.. బరాజ్‌ 66గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

*ఇంద్రకీలాద్రి పై పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయి. మూడ్రోజుల పాటు ఘనంగా అమ్మవారి పవిత్రోత్సవాలు కొనసాగాయి. ఏడాదిలో తెలిసీ తెలియక చేసిన తప్పిదాలకు ప్రాయశ్చిత్తంగా.. అమ్మవారి పవిత్రోత్సవాలు నిర్వహించామని ప్రధాన అర్చకుడు దుర్గాప్రసాద్ తెలిపారు. ఆలయంలోని దేవతామూర్తులకు ధరింప చేసిన పవిత్రాలను ప్రజలు ధరిస్తే మంచి జరుగుతుందని నమ్మకమని దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో వేదోక్తంగా గురువారం పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజున ఈవో డి.భ్రమరాంబ ఆధ్వర్యంలో దేవస్థానం స్థానాచార్యుడు విష్ణుభట్ల శివప్రసాద్‌ శర్మ, ప్రధాన అర్చకుడు లింగంబొట్ల దుర్గాప్రసాద్‌, ఆర్‌.శ్రీనివాసశాస్త్రి తదితరులు ఊరేగింపుగా పవిత్రాలను తీసుకువచ్చారు. ఈఈలు కోటేశ్వరరావు, రమాదేవి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం పవిత్రాల పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు.