Business

బెల్లం వంటలతో కోట్లు గడిస్తున్న సుజాత

బెల్లం వంటలతో కోట్లు గడిస్తున్న సుజాత

టీచర్‌గా తన కెరియర్‌ని మొదలుపెట్టిన సుజాత… వ్యాపారవేత్తగా బలపడటానికి కారణం కొవిడ్‌ అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎన్నో వ్యాపారాలకు గడ్డు రోజులు తెచ్చిన కొవిడ్‌ సుజాతకి మాత్రం విజయాన్ని అందించింది. అదెలాగంటే.. అనకాపల్లి అంటే టక్కున గుర్తుకొచ్చేది రుచికరమైన బెల్లం. అక్కడ తయారైన బెల్లాన్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే కుటుంబాల్లో సుజాత కుటుంబం కూడా ఒకటి. అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో వాళ్లకో దుకాణం ఉంది. చెరకు దిగుబడులు తగ్గడంతో వాళ్ల వ్యాపారం కూడా ఢీలా పడింది. దాంతో ఆరోగ్యప్రియులని ఆకర్షించేందుకు రసాయనాల్లేకుండా సేంద్రియ ఎరువులతో పంట పండించారు సుజాత భర్త. అయినా వ్యాపారంలో పెద్ద మార్పేం రాలేదు. ‘ఆధునిక అవసరాలకు అనుగుణంగా మార్పులు చేస్తే తప్ప వ్యాపారం నిలబడదనుకున్నా. అందుకే బెల్లాన్ని దిమ్మల రూపంలో కాకుండా.. దాన్ని పౌష్టికాహారంగా మార్చి అమ్మాలకున్నా. అప్పటి వరకు ఓ ప్రైవేటు బడిలో టీచర్‌గా పనిచేసేదాన్ని. టీచర్‌గా పిల్లలు, గర్భిణిలు, బాలింతల్లో.. పోషకాహార లోపం గురించి నాక్కొంత అవగాహన ఉంది. అందుకే సేంద్రియ బెల్లంతో వాళ్లు తినేందుకు అవసరం అయిన.. కొబ్బరి ఉండలు, సున్నుండలు, అరిసెలు వంటి చిరుతిళ్లు తయారీ మొదలుపెట్టా. రూ.10 వేల పెట్టుబడితో మార్కెటింగ్‌ మొదలుపెట్టా. వీటిని సూపర్‌ బజార్లు, డిపార్డుమెంటల్‌ స్టోర్లకు తీసుకెళ్తే… చాలామంది ‘వీటినెవరు కొంటారండి?’ అన్నారు మొహంపైనే. కొంతమంది మొహమాటానికి.. స్టాక్‌ తీసుకున్నా వారం తిరక్కుండానే వెనక్కి పంపించేశారు. ఎందుకిలా అవుతోందని ఆరా తీశా. నేనే స్వయంగా వెళ్లి సూపర్‌ బజార్‌, మాల్స్‌ ముందు నిలబడి వచ్చిపోయే వారికి మా ఉత్పత్తులను ఉచితంగా రుచి చూపించి, నచ్చితేనే తీసుకోండనేదాన్ని. నష్టాలు వచ్చినా కొన్నిరోజులు అలానే ప్రచారం చేశా. నా శ్రమ వృథా కాలేదు. వినియోగదారులు మా బ్రాండ్‌ గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. నెమ్మదిగా మాల్స్‌, ఆర్గానిక్‌ స్టోర్లు ఆర్డర్లు పెంచాయి. అది సరిపోదనిపించి.. ఎక్కడ ఫుడ్‌ ఫెస్టివల్స్‌ జరిగినా అక్కడికి వెళ్లి పాల్గొన్నేదాన్ని. డీఆర్‌డీఏ తరఫున ప్రభుత్వ వేడుకల్లో స్టాల్స్‌ పెట్టేదాన్ని. దీంతో పొదుపు సంఘాల ద్వారా వ్యాపార విస్తరణకు రుణం దొరికింది. లోన్‌ తీసుకుని.. ‘క్యూ వన్‌ ఇంటర్నేషనల్‌ ఆగ్రో ఫుడ్స్‌’ పేరిట కుటీర పరిశ్రమను ఏర్పాటుచేసి.. ‘అనకాపల్లి బెల్లం రుచులు’ పేరుతో పప్పుండలు, కొబ్బరి ఉండలు, అరిసెలు, సిమ్మిలి, పాకుండలు, మినప సున్నండలు, రాగి, ఉలవ, అవిశ లడ్డూలు.. ఇలా సేంద్రియ పదార్థాలతో చేసిన 40 రకాల పౌష్టికాహారాలను తయారుచేస్తున్నా. తయారీ, నాణ్యత నా బాధ్యత అయితే మార్కెటింగ్‌ మావారు శ్రీనివాసరావు చూస్తున్నారు’ అంటూ వ్యాపారాన్ని విస్తరించిన విధానం గురించి చెప్పుకొచ్చారు సుజాత.