Devotional

నేడు నాగుల చవితి ప్రత్యేకత ఇదే

నేడు నాగుల చవితి ప్రత్యేకత ఇదే

_ నాగుల చవితి శుభాకాంక్షలు _

🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉

ఆశ్లేష , ఆరుద్ర , మూల , పూర్వాభాద్ర , పూర్వాషాడ అను ఈ ఐదు నక్షత్రములు సర్ప నక్షత్రములు. సర్పము అనగా కదిలేది , పాకేది.  నాగములో *‘న , అగ’ ఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని ‘నాగము’ అంటారు. అన్నింటికంటే వేగంగా వెళ్ళేది ‘కాలము’ కావున నాగమునకు మరో అర్థం కాలం. అందుకే ‘కాలనాగము’ లేదా ‘కాలనాగు’ అని అంటారు.

జ్యోతిష్యశాస్త్రానుసారం కాలసర్ప దోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడుతాయి.  జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా ‘నాగం’. సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ‘ఉరా’ అంటారు.  కావున సర్పానికి ‘ఉరగము’ అని కూడ పేరు. ఉదరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైన మనమూ కూడా ‘ఉరగముల’ మే. సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవనక్రమంలోని వివాహం , సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరస్తుంది కావున కార్తీక మాసంలో నాగులను ఆరాధిస్తారు. అగ్ని దేవతగా ఉండేది. కార్తీకమాసములోనే. మన జీవనానికి కావాల్సిన ఉత్సాహం , ఉత్తేజం వంటివి తేజస్సు వలన అనగా సూర్యుడు , అగ్ని వలన కలుగుతాయి. శ్రీహరికి శయ్య , శంకరునికి ఆభరణము కూడా సర్పమే.  కావున నాగులను ఆరాధించడం వలన హరిహరులను సేవించిన ఫలం దక్కుతుంది.

కార్తికమాసమంతా ఇంట్లో నాగ ప్రతిమను ఆరాధిస్తూ , నాగస్తుతిని చేస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడు. కార్తీకమాసం నెలరోజులు కాకపోయినా కనీసం కార్తీక శుద్ధ చవితినాడు  నాగులను ఆరాధించాలి. చవితి అంటే నాల్గవది అనగా ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలలో  నాల్గవది మోక్షం కావున ఆనాడు నాగులను ఆరాధిస్తే మోక్షము లభిస్తుంది. అంటే జీవితంలో వచ్చిన కష్టాల నుండి విముక్తులవుతాము. కావున నాగులను చవితినాడు దేవాలయాలలో , గృహములో లేదా పుట్టల వద్ద నాగ దేవతను ఆరాధించాలి.*

ప్రకృతి మానవుని మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును , పుట్టను , రాయిని , రప్పను , కొండను , కోనను , నదిని , పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపంగా చూసుకొంటూ ! పూజిస్తూవస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని హిందువుల పండగల విశిష్టత.

నిశితంగా పరిశీలిస్తే … అందులో భాగంగానే “నాగుపాము” ను కూడా నాగరాజుగా , నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు.

ఈ రోజున ఊరిలో ఉన్న గుళ్ళలో ఉన్న పుట్టలలో కానీ లేదా ఊరి బయట ఉన్న పాము పుట్టలో పాలు పోస్తారు. పుట్టలో పాలు పోయటమనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. సిటీ ప్రాంతంలో నాగుల చవితికి అంత సందడిగా కనిపించదు కానీ గ్రామీణ ప్రాంతాలలో మాత్రం ఎంతో సందడి సందడిగా కనిపిస్తుంది.

దేవాలయాల్లో రాతి విగ్రహా జంట పాముల ప్రతిమలు , రెండు పాములు మెలికలు వేసుకొని రావి , వేప చెట్ల కింద దర్శనం ఇవ్వటం మనము ఎక్కువ గమనిస్తుంటాము. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు , వైవాహిక , దాంపత్య దోషాలు , గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు విశ్వాసంతో పుజిస్తారు. ఎందుకంటే కుజ దోషం , కాలసర్ప దోషానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా మన దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా నాగులచవితిని జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల వారు దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ  జరుపుకుంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు.  ఇవి రైతులకు కూడా ఎంతో మేలును చేకూరుస్తాయిఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి ” నీటిని” ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే  క్రిమికీటకాదులను తింటూ , పరోక్షంగా ” రైతు ” కు పంటనష్టం కలగకుండా చేస్తాయట !.  అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.

భారతీయ సనాతన సంప్రదాయాల్లో జంతు పూజ ఒకటి. ఈశ్వరాంశ ప్రతి ప్రాణిలోనూ వ్యాపించి ఉన్నదని ఉపనిషత్‌ ప్రబోధం. ప్రకృతి పరిరక్షణకు తోడ్పడే సద్భావన అది. వేదంలో నాగ పూజ కనిపించకున్నా –  సంహితల్లో , బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి వస్తుంది. పురాణ , ఇతిహాసాల్లోని గాథల్లో సర్పాలు వివిధ సందర్భాల్లో ప్రత్యక్షమవుతాయి. ఈ రోజునే తక్షకుడు , కర్కోటకుడు , వాసుకి , శేషుడు మొదలైన 100 మంది నాగ ప్రముఖులు జన్మించారని పురాణ కథనం. భూలోకానికి క్రింద ఉన్న అతల , వితల , సుతల , తలాతల , రసాతల , మహాతల , పాతాళ లోకాలల్లో వివిధ జీవరాసులు నివసిస్తాయి. వాటిలో ఐదు రసాతల లోకాల్లో రాక్షసులు నివసిస్తారు. చివరిదైన పాతాళ లోకంలో నాగులు ఉంటాయి. నాగ ప్రముఖులందరూ అక్కడ ఉంటారు. ఈరోజున నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషం సహా మొదలైన దోషాలు తొలగిపోతాయి.