DailyDose

బొమ్మలు గీసి.. బాధ్యత మోసి…

బొమ్మలు గీసి.. బాధ్యత మోసి…

కొందరు జీవితంలో నిర్దిష్ట మైలురాళ్లకు కట్టుబడి ఉంటారు. ఉదాహరణకు బాగా చదువుకోవడం, ఉద్యోగం చేయడం, వివాహం చేసుకోవడం, కుటుంబాన్ని ప్రారంభించడం మొదలైనవి. మరికొందరు కాలాన్ని బట్టి తమను తాము మార్చుకుంటూ వెళతారు. అటువంటి వారి జీవితం, ప్రతిభ, శక్తిసామర్థ్యాలు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తాయి. వారిలో ఒకరే మంజ్రీ వార్దే. పెయింటింగ్స్‌, మోడలింగ్‌, కోడలితో కలసి ఫన్నీ వీడియోలు చేస్తూ విశేష అభిమానులను సంపాదించుకున్న మంజ్రి తాజాగా తన జీవిత చేదు అనుభవాలను వెల్లడించారు.
‘ఇప్పుడు నా వయసు 67 ఏళ్లు. నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో నిర్భయంగా అడుగులు ముందుకు వేయాలి. ఆ మార్గం మిమ్మల్ని మీకు నచ్చేలా జీవింపజేస్తుంది. ఆ మార్పు మీ తరువాతి తరానికి గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుంది. మన తరువాతి తరం మనల్ని చూసి ఏదైనా నేర్చుకోవాలంటే ముందు మనం పాతకాలం మూసధోరణిని వదిలివేయాలి’ అంటున్నారు.

ఇన్‌స్ట్రాగ్రామ్‌ ఫాలోవర్స్‌లో చాలామంది ‘సాసీ సాసు’ వీడియోస్‌ చూడకుండా ఉండరు. కోడలు, నటి సమీరా రెడ్డితో కలసి మంజ్రీ చేసే ఫన్నీ రీల్స్‌, వంట వీడియోలను అభిమానించని వారు లేరు. సొంతంగా అభిమానులను పోగుచేసుకున్న మంజ్రీ ధరించే ట్రెండీ డ్రెస్సింగ్‌ను ఆమెను ప్రత్యేక వ్యక్తిగా నిలిపాయి. ఫ్యాషన్‌గా, మోడల్‌గా ముఖం మీద ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే మంజ్రీ జీవితంలో ఎన్నో ఆటుపోటులు.

కాలేజీ చదివే రోజుల్లో ప్రేమించి పెళ్లిచేసుకున్న మంజ్రీ 27 ఏళ్లకే ఇద్దరు బిడ్డల తల్లైంది. సాఫీగా సాగిపోతున్న ఆమె జీవితంలో భర్తతో విభేదాలు విడాకులకు దారితీశాయి. ‘భర్త నుంచి విడిపోయిన నేను ఆర్థికంగా బలంగా లేకపోవడంతో పిల్లలను తండ్రి దగ్గరే వదిలిపెట్టాల్సి వచ్చింది. నా కాళ్ల మీద నేను నిలబడిన తరువాత పిల్లలను నా దగ్గరకు తెచ్చేసుకోవాలని ఎంతో తపన పడ్డాను. నాకు వచ్చిన చిత్రకళే నా పెట్టుబడి. అంతకుమించి నా దగ్గర సొమ్ము లేదు. బొమ్మలు వేశాక వాటిని అమ్మేందుకు షాపులకు వెళ్లేదాన్ని. నెలల తరబడి అవి అమ్ముడయ్యేవి కావు. మొట్టమొదటి పెయింటింగ్‌ అమ్ముడైనప్పుడు నేను పొందిన సంతోషం మాటల్లో చెప్పలేను. నోటి మాట ద్వారా నా గురించి, నా కళ గురించి చాలామందికి తెలిసింది’ అంటారు ఈ కళాకారిణి. ‘ఒక ఎగ్జిబిషన్‌లో నా కళాఖండాలు చూసిన క్షణం నా జీవితంలో మర్చిపోలేని సంఘటన’ అంటూ ఆనాటి రోజులను గుర్తుచేసుకున్నారు. అప్పటి నుంచి కొన్నేళ్లపాటు కళాఖండాలు చిత్రించడంలోనే ఆమె నిమగమైపోయారు. ‘పిల్లలను పోషించుకోగలనన్న నమ్మకం వచ్చాక వారిని నా దగ్గరకు తెచ్చేసుకున్నాను. నన్ను అర్థం చేసుకున్న నా పిల్లలు నాకు ఎంతో మద్దతుగా నిలిచారు’ అంటున్నప్పుడు ఆమె చెంపలపై కన్నీళ్లు జాలువారాయి.

‘కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్న నేను నా కొడుకు పెళ్లయిన తరువాత నుంచి సెలబ్రిటీగా మారిపోయాను. దీనికంతటికీ నా కోడలు సమీరాయే కారణం. ఆమె వచ్చాక నా జీవితంలో మరో దశ మొదలైంది. ఫన్నీ వీడియోలు చేస్తూ కొత్త కొత్త బ్రాండ్‌ల డ్రస్సులు వేసుకునేదాన్ని. 67 ఏళ్ల వయసులోనూ మోడల్‌గా కనిపించడంలో నాలో దాగున్న కొత్త అభిరుచిని గ్రహించాను. యువత నా డ్రెస్‌ను ఇష్టపడుతూ నాకు పోస్టులు పెడతారు. అప్పుడు భలే సంతోషమేస్తుంది’ అంటున్నారు. 30 ఏళ్ల క్రితం నుంచే నా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అడ్డుగా ఉన్న ప్రతి అడ్డంకినీ దాటుకుని వస్తూ ఎంతో సంతోషంగా జీవించాను’ అంటూ నా జుట్టు తెల్లబడింది కాని నా మనసు ఇంకా యవ్వనంలోనే ఉంది’ అని చిరునవ్వులు చిందిస్తున్నారు.