Movies

ఆరోజు కోసం వేచిచూస్తున్నా

ఆరోజు కోసం వేచిచూస్తున్నా

‘విశ్వరూపం’ సిరీస్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచితమైన తమిళ నాయిక ఆండ్రియా జెర్మియా. తెలుగులో ‘తఢాఖా’ అనే చిత్రంలోనూ నటించింది. కోలీవుడ్‌లో వరుస చిత్రాల్లో నటిస్తున్న ఈ తార గీత రచయితగా పరిచయం కాబోతున్నది. ఆమె తాజాగా ఫ్లేవర్స్‌ అనే మ్యూజిక్‌ ఆల్బమ్‌ తయారుచేసింది. తను రాసిన ఏడు పాటలు ఈ ఆల్బమ్‌లో ఉంటాయి. ప్రేమలో పడటం, ప్రేమ విఫలమై గాయపడటాన్ని ఈ పాటల నేపథ్యంగా తీసుకుంది ఆండ్రియా. సోషల్‌ మీడియాలో తనకు కనిపించే ప్రేమికుల స్పందనే ఈ పాటలు రాసేందుకు స్ఫూర్తిగా నిలిచిందని చెప్పింది.ఆండ్రియా జెర్మియా మాట్లాడుతూ….‘పాటలు రాయడం నాకొక అలవాటు. లాక్‌డౌన్‌ టైమ్‌లో ప్రతి ఒక్కరూ సంగీతాన్ని ఆస్వాదించారు. అప్పటి ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఈ పాటల్లోని ఏడింటిని ఆల్బమ్‌ తయారు చేశాం. ప్రేమలో జయాపజయాలను ఇతివృత్తంగా ఎంచుకుని పాట రాశాను. సినిమా సంగీతంలా ప్రైవేట్‌ మ్యూజిక్‌కూ పేరొచ్చే రోజు కోసం వేచి చూస్తున్నా’ అని చెప్పింది. ప్రస్తుతం ‘కా’, ‘పిసాసు 2’, ‘మాలిగై’ వంటి చిత్రాల్లో నటిస్తున్న ఆండ్రియాకు పలు మ్యూజిక్‌ లేబుల్స్‌ నుంచి ఆల్బమ్స్‌ చేయమంటూ అవకాశాలు వస్తున్నాయి