Movies

కాస్త మసాలా దట్టించాలి

Auto Draft

టాలీవుడ్‌లో ఐదారేళ్లు ఓ వెలుగు వెలిగింది పంజాబీ సుందరి రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ఈ మధ్య బాలీవుడ్‌ వెళ్లి అక్కడ స్టార్‌లతో సినిమాలు చేస్తున్నది. ఆమె అక్షయ్‌ కుమార్‌తో కలిసి నటించిన ‘కట్‌పుత్లీ’ సినిమా ఇటీవలే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్‌ నటించిన ‘రాక్షసుడు’ సినిమా హిందీ రీమేక్‌ ఇది. ఈ చిత్ర కథా నేపథ్యం సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ కాగా..ఇందులో రొమాంటిక్‌ అంశాలనూ చేర్చారు. దీనిపై కొందరు ప్రేక్షకులు సోషల్‌ మీడియా ద్వారా ప్రశ్నించడం మొదలు పెట్టారు. మాతృకలో ఉన్న కథాంశానికి బాగా రొమాన్స్‌ చేర్చారన్న విమర్శలు ప్రధానంగా వచ్చాయి.ఈ విమర్శలపై స్పందించింది రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ఆమె మాట్లాడుతూ…‘కథలో మిగతా బలమైన అంశాలతో పాటు కాస్త రొమాన్స్‌, పాటలు చేర్చితే సినిమాకు అదనపు ఆకర్షణ చేకూరుతుంది. మన ప్రేక్షకులకు ఇలా పాటలు, రొమాన్స్‌ చూడటం ఇష్టమే. అందుకే మన చిత్రాల్లో కాస్త మసాలా దట్టిస్తుంటాం. ఇవాళ తెలుగు సినిమాలు ఇంతగా ఆదరణ పొందుతున్నాయంటే అందులోని మసాలానే కారణం. సినిమాల ఎంపికలో కొన్నిసార్లు నా క్యారెక్టర్‌ వరకు బాగుంటే చాలనుకుంటా, మరికొన్ని సార్లు పూర్తి కథ ఆకట్టుకుని, నా పాత్ర కాస్త అటూ ఇటూ ఉన్నా ఫర్వాలేదు ఒప్పుకుంటా. ఇంకొన్ని సార్లు మనకు నచ్చిన దర్శకులు, హీరోలతో కలిసి పనిచేసేందుకు సినిమాలు అంగీకరిస్తా’ అని చెప్పింది. రకుల్‌ ప్రస్తుతం అజయ్‌ దేవగణ్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రాలతో కలిసి ‘థాంక్‌ గాడ్‌’ అనే చిత్రంలో నటిస్తున్నది