NRI-NRT

ప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు మెజార్టీ.. కలిసి పనిచేస్తామంటున్న జో బిడెన్‌

ప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు మెజార్టీ.. కలిసి పనిచేస్తామంటున్న జో బిడెన్‌

అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ పార్టీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నది. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు సత్తా చాటారు. హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్‌ (లోయర్‌ హౌస్‌) కు జరిగిన ఎన్నికల్లో 218 సీట్లను గెలుచుకున్నారు. మెజార్టీ రావడంతో దిగువ సభ పూర్తిగా రిపబ్లికన్ల నియంత్రణలో ఉండనున్నది. ఎన్నికల్లో మెజార్టీ సాధించిన రిపబ్లికన్లను అభినందించిన అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌.. ట్రంప్‌ పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు.

యూఎస్‌ మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ పార్టీ రిపబ్లికన్ బుధవారం యూఎస్ లోయర్‌ హౌస్‌ను కైవసం చేసుకున్నది. ఇందుకు అవసరమైన మెజారిటీ సంఖ్యను సాధించడం ద్వారా రిపబ్లికన్లు వాషింగ్టన్‌లో తిరిగి అధికారంలోకి వచ్చారు. అయితే, ఈ మెజార్టీ సంఖ్య అధ్యక్షుడు జో బిడెన్‌కు అనేక సవాళ్లను తీసుకురానున్నది. అలాగే పాలనాపరమైన సామర్థ్యాన్ని క్లిష్టతరం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఎన్నికలు జరిగిన వారం తర్వాత ఫలితాలు ఇప్పుడిప్పుడే వెలువడుతున్నాయి. లోయర్‌ హౌస్‌పై పూర్తి పట్టును సాధించేందుకు అవసరమైన మెజార్టీ సంఖ్య 218 ని రిపబ్లికన్‌ పార్టీ అందుకున్నది. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతున్నందున మరికొన్ని రోజుల వరకు పూర్తి మెజార్టీపై స్పష్టత అందకపోవచ్చు.

ప్రతినిధుల సభలో మెజార్టీ కోల్పోవడంతో జో బిడెన్‌ బలహీనంగా మారిపోయాడు. ప్రతి ప్రధాన నిర్ణయం తీసుకోవడానికి ట్రంప్‌ పార్టీ ప్రతినిధులపై ఆధారపడాల్సి వస్తుంది. లోయర్‌ హౌస్‌లో ఆధిపత్యం ఉన్న పార్టీ మాత్రమే పార్టమెంట్‌లో చట్టాలు చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇదే సమయంలో బిడెన్‌ తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, ప్రతినిధుల సభలో జో బిడెన్ డెమొక్రటిక్ పార్టీ 211 సీట్లు గెలుచుకుంది. మధ్యంతర ఎన్నికల ఫలితాలు 2024 లో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అభ్యర్థిత్వాన్ని నిర్ణయిస్తాయి.