DailyDose

అమెరికాలోని అన్ని నగరాల్లో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు సన్నాహాలు

అమెరికాలోని అన్ని నగరాల్లో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు సన్నాహాలు

ఈ నెల 18వ తేదీన ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని టీడీపీ ఎన్ఆర్ఐ యూఎస్ కోఆర్డినేటర్ జయరాం కోమటి కోరారు. యూఎస్ లోని తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం అన్ని నగరాల పార్టీ కమిటీ సభ్యులు, ఎన్టీఆర్ అభిమానులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ.. నందమూరి తారక రామారావు శతజయంతి సంబరాలు ఒకవైపు అంబరాన్ని అంటుతూ ఉంటే.. మరోవైపు ఆయన 27వ వర్థంతి కార్యక్రమాలు అమెరికాలోని అన్ని నగరాల్లో జరపాలన్నారు. తెలుగుజాతి ఉన్నంత వరకు తరతరాలుగా గుర్తుండుపోయే మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. ప్రజాజీవితంలో, రాష్ట్ర రాజకీయాల్లో ప్రమాణాలు, ఉన్నత విలువల గురించి చెప్పుకున్నప్పుడు ప్రప్రథమంగా గుర్తుకువచ్చే వ్యక్తి ఎన్టీఆర్. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ఒక మహానాయకుడిగా, ఒక మహానటుడిగా ఎదిగారు. ఆనాటి సాంఘీక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక చారిత్రక అవసరంగా తెలుగు ప్రజలు భావించి ఆయనకు పట్టం కట్టారు. భారత రాజకీయ చరిత్రలో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. రాజ్యాధికారం బడుగు, బలహీన వర్గాలకు అందించారు. సరికొత్త తరాన్ని, వినూత్న సేవా సంస్కృతిని రాజకీయాల్లో ప్రవేశపెట్టిన భారత ప్రజాస్వామ్య దిక్సూచి ఎన్టీఆర్ అని అన్నారు. ప్రజానాయకుడిగా చరిత్రలో, ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ స్థానం సుస్థిరం. నిర్వీర్యమై, నిస్తేజమై, చేష్టలుడిగి, చేవచచ్చిన తెలుగుజాతికి ప్రాణం పోసిన ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పిద్దాం.

మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ… అన్ని వర్గాలకు, యువతరానికి చెందిన, సామాన్యులకు, విద్యావంతులకు, మహిళలకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించారు ఎన్టీఆర్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లని తలచి సంక్షేమ రాజ్యం సృష్టించి, సమసమాజ నిర్మాతగా, లౌకిక వాదిగా పేరు ప్రఖ్యాతలు పొందారు. జాతి నిర్మాణం వైపు ప్రజలను జాగృతం చేసి తన ఆలోచనలు, ఆవేశంతో నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచారు. రాజకీయాల్లో ఉన్నది పుష్కర కాలమే అయినా ప్రజల మదిలో చెరగని ముద్రవేసిన ఎన్టీఆర్ ఖ్యాతిని, ఛరిష్మాను ఆంగ్ల ప్రసార మాధ్యమాలు కూడా కొనియాడాయి.

ఈ కార్యక్రమంలో భరత్ శర్మ ముప్పిరాల, వెంకయ్య చౌదరి జెట్టి, హరి ఎమ్, భాస్కర్ రావు మన్నవ తదితరులు పాల్గొన్నారు.