DailyDose

కర్పూరం ప్రత్యేకతలు ప్రయోజనాలు ఇవి

కర్పూరం ప్రత్యేకతలు ప్రయోజనాలు ఇవి

కర్పూరం కథ
*

కర్పూరం చంద్ర సంకాశం జ్యోతి స్సూర్య మివోదితం
భక్త్యా దాస్యామి కర్పూర నీరాజన మిదం శివం

అంటూ కర్పూరంతో ఇచ్చే హారతిని నీరాజనం అంటారు. ఇంతే కాక హారతిని నేతిలో నానబెట్టిన దూది వత్తులతో కూడా కొన్ని సందర్భాలలో ఇస్తారు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, పదకొండు, పదహారు, ఇరవై ఒకటి ఇలా వివిధ సంఖ్యల వత్తులతో హారతులిస్తారు. కర్పూరము శ్రేష్ఠమయినది కనుక దాని గురించి కొంచెం క్లుప్తంగా వ్రాస్తాను.

కర్పూరం అనేది మనకి తెలిసినంతవరకు సుగంధంగానూ, కొన్ని వంటకాలలోనూ, హిందువులు తమ పూజాకార్యక్రమాలలో దేవునికి హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తారు. పురాతన కాలంలో స్వల్పంగా దీపాల కాంతి ఉన్నపుడు భగవంతుని రూపం అంత స్పష్టంగా కనిపించేది కాదు. అప్పుడు హారతి ఇస్తే ఆ వెలుగులో చక్కగా స్పష్టంగా భగవంతుని మూర్తిని దర్శించే భాగ్యం భక్తులకు కలిగేది. హారతి సంప్రదాయానికి ఇంత ప్రాముఖ్యత రావడానికి ఇది ఒక కారణం కావచ్చును. అయితే హారతి ఇవ్వడానికి ప్రధాన కారణం దిష్టి తీయడం. ఇదే కాక కర్పూరం వెలిగించినప్పుడు కమ్మని వాసన వస్తుంది. కర్పూర వాయువు గాలిని శుభ్రపరుస్తుంది. హారతిని కళ్లకు అద్దుకునే సమయంలో భక్తులా గాలి పీలుస్తారు. అప్పుడందులోని ఔషధగుణాలు శరీరం లోపలి భాగాల్ని శుద్ధి చేస్తాయి. ఇదే హారతి వెనుకనున్న నిగూఢమయిన రహస్యం.

పుట్టుక: కర్పూరం బహువచనం లేని ఏకవచనం. ఇది మైనములా తెల్లగానూ పారదర్శకంగానూ ఉండే ఒక ఘాటైన వాసన గల పూజా ద్రవ్యము.

కర్పూర పూలు
ఇది రసాయనాలతో కృత్రిమంగా తయారయింది అనుకుంటారు చాలామంది. కానీ, కర్పూరం చెట్టు నుండి ఉత్పత్తి అవుతుంది అన్నది అక్షర సత్యం. నిజమే అండి కర్పూరం కాంఫర్ లారెల్ లేదా Cinnamomum camphora (కుటుంబం: లారేసీ ) అనే చెట్టునుండి లభ్యమవుతుంది. కర్పూరాన్ని ఆ చెట్ల ఆకులు, కొమ్మలనుండి తయారు చేస్తారు. అలాగే కొన్ని రకాలైన తులసి (కర్పూర తులసి) జాతులనుండి కూడా కర్పూరాన్ని తయారుచేస్తారు. కర్పూర చెట్ల కాండంమీద గాట్లు పెడతారు. ఆ గాట్లలోంచి పాలు వస్తాయి. ఆ పాలతో కర్పూరం తయారౌతుంది. కర్పూరం చెట్టు వంద అడుగుల వరకూ పెరిగే సుందరమైన నిత్య హరిత వృక్షం. చక్కని సువాసన కలిగిన పట్ట కలిగి ఉంటుంది. ఆకులు పొడవుగా ఉండి ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాలతాయి . పువ్వులు చిన్నవిగా ఉంటాయి. పండ్లు ముదురు ఆకుపచ్చని రంగులో ఉండి అక్టోబర్‌లో పక్వానికి వస్తాయి. ఈ చెట్లు చైనా, జపాన్ దేశాల్లో విస్తారంగా పెరుగుతాయి. మన దేశంలో దీనిని నీలగిరి కొండల్లో పెంచుతారు. అలాగే మైసూర్‌లోనూ, మలబార్ ప్రాంతంలోనూ కర్పూరం చెట్లు కనిపిస్తాయి.

రకములు : కర్పూరం చాలా రకాలుగా ఉంటాయి. ఒక్కో రకం ఒక్కో విధంగా మనకి ఉపయోగపడుతుంది.

పచ్చకర్పూరం: కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్లలో వేసి మరిగించి, డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరం అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడుకోవచ్చు. దీనిని ఎక్కువగా వంటలలో వాడతారు. కాటుకని ఈ పచ్చ కర్పూరంతోనే చేస్తారు. అంజనం వేయడానికి కూడా దీనినే వాడతారు.

హారతి కర్పూరం
హారతి కర్పూరం: టర్‌పెన్‌టైన్ నుంచి రసాయనిక ప్రక్రియ ద్వారా తయారుచేసే కృత్రిమ కర్పూరాన్ని హారతి కర్పూరం (C10H16O) అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడకూడదు.

రస కర్పూరం: చిన్న పిల్లలకి ఒంట్లో ఉన్న దోషాలు పోవడానికి ఆముదంతో కలిపి కర్పూరం పట్టిస్తారు. దానిని రస కర్పూరం అంటారు.

భీమసేని కర్పూరం
భీమసేని కర్పూరం: సహజముగా మొక్క నించి తయారుగా లభించే కర్పూరాన్ని భీమసేని కర్పూరం లేదా అపక్వ కర్పూరం అంటారు. దీనిని ఔషధ ఉపయోగాలకోసం విరివిగా వాడుతూ ఉంటారు.

సితాభ్ర కర్పూరం
సితాభ్ర కర్పూరం: ఇది తెల్లని మేఘంలాగా కనిపిస్తుంది కనుక దీనికి ఆ పేరు వచ్చింది.

హిమవాలుక కర్పూరం
హిమవాలుక కర్పూరం: ఇది మంచులాంటి రేణువులు కలిగి ఉంటుంది.

ఘనసార కర్పూరం: ఇది మేఘంలాంటి సారం కలిగినది.

హిమ కర్పూరం: ఇది మంచులాగా చల్లగా ఉంటుంది.

ఇవే కాక ఉదయ భాస్కరము, కమ్మ కర్పూరము, ఘటికము, తురు దాహము, హిక్కరి, పోతాశ్రయము, పోతాశము, తారాభ్రము, తుహినము, రాత్రి కరము, విధువు, ముక్తాఫలము, రస కేసరము, ప్రాలేయాంశువు, చంద్ర నామము, గంబూరము, భూతికము, లోక తుషారము, శుభ్ర కరము, సోమ సంజ్ఞ, వర్ణ కర్పూరం, శంకరావాస కర్పూరం, చీనా కర్పూరం అని చాలా రకాల కర్పూరాలున్నాయి.

ఉపయోగాలు: కర్పూరం వలన చాలా రకముల ఉపయోగాలున్నాయి. అవేమిటంటే
స్వభావం-కర్పూరం: మనుషుల స్వభావాలని కర్పూరంతో పోలుస్తారు. ఈ రకం మనుష్యులకి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. ఏది చెప్పినా ఇట్టే గుర్తుండి పోతుంది. అంటే ఏకసంతాగ్రాహులన్నమాట. మంచి విషయాలను వెంటనే ఆచరణలో పెడతారు, కర్పూరం లాంటి స్వభావం కలవారు కనుక ఒక సారి వెలిగిస్తే చాలు, చుట్టూ ఉన్న అందరినీ వెలిగిస్తూ జ్ఞానాన్ని పంచుతారు.

సాహిత్యం-కర్పూరం: మనకి కర్పూరాన్ని ఉదాహరణగా చూపిస్తూ బోలెడు మంచి విషయాలను మన సాహిత్యంలో చెప్పారు. వాటిల్లో మనందరికీ బాగా తెలిసిన రెండు పద్యాలు: