Politics

కర్మ సిద్ధాంతం ప్రకారం వైకాపా గెలిచేది ఐదు స్థానాలే…

కర్మ సిద్ధాంతం ప్రకారం వైకాపా గెలిచేది ఐదు స్థానాలే…

ఆ ఐదు మందిలో జగన్ ఉంటారా?, లేదా?? అన్నది అనుమానమే

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత వై నాట్ పులివెందుల అంటోన్న టిడిపి నేతలు

ఎమ్మెల్యే లకు క్యాంపులు పెట్టాల్సిన దుస్థితి మా సింహానికి రావడం దురదృష్టకరం

ప్రజాస్వామ్య విలువల కోసం ఆరు స్థానాలు వైకాపాకు, ఒక స్థానం ప్రతిపక్ష టిడిపికి దక్కాలి

ఉగాది పండగలు వస్తున్నాయి పోతున్నాయి కానీ లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ళను కేటాయించడం లేదు

ఆస్తి హక్కు వస్తుందని పదివేలు వసూలు చేశారు… ఆ పత్రాలు నాలుక గీక్కోవడానికి కూడా పనిచేయడం లేదు

అసెంబ్లీ లో లేని ప్రతిపక్ష నేతపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలనడం దారుణం

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

గతంలో తెలుగుదేశం పార్టీ ,
అప్పటి ప్రతిపక్ష, ప్రస్తుత అధికార పక్షానికి చెందిన 23 మంది శాసనసభ్యులను తమ పార్టీలో చేర్చుకున్నందుకు ప్రజలు తిరిగి ఆ పార్టీ కి 23 స్థానాలనే కట్టబెట్టారన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కర్మ సిద్ధాంతమే నిజమైతే, రానున్న ఎన్నికల్లో తమ పార్టీకి వచ్చేది ఐదు స్థానాలేనని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అన్నారు.రానున్న ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచే ఐదు స్థానాలలో పులివెందుల ఉంటుందా?, గెలిచే ఎమ్మెల్యేలలో జగన్మోహన్ రెడ్డి ఉంటారా?? అన్నది అనుమానమే. ఎందుకంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఫలితాల అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు వై నాట్ పులివెందుల అని నినాదిస్తున్నారని ఆయన గుర్తు చేశారు.
టిడిపి తరఫున గెలిచిన నలుగురిని, జనసేన తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేను జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీలో చేర్చుకున్నారు. ఐదు మందిని తమ పార్టీలో చేర్చుకున్నట్లు సిగ్గు లేకుండా సాక్షి దినపత్రికలో రాసుకున్నారు. ప్రతిపక్ష ఎంపీలను ఒక్కరిని కూడా తమ పార్టీలోకి తీసుకోలేదని, దాంతో రానున్న ఎన్నికల్లో 25 కు 25 ఎంపీ స్థానాలు ప్రతిపక్ష పార్టీలకే దక్కే అవకాశాలు ఉన్నాయన్నారు . గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… శాసనసభ్యుల కోటా ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం తరుపున పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి
విజయం సాధించాలని తాను కోరుకోకపోయినప్పటికీ, ప్రజాస్వామ్య విలువలు కోసం 23 మంది ఎమ్మెల్యేలున్న తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్న అనురాధ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. అలాగే శాసనసభలో సభ్యులబలం ఆధారంగా తమ పార్టీకి ఆరు స్థానాలు, ప్రతిపక్ష పార్టీకి ఒక స్థానం దక్కుతుందని అంచనా వేస్తున్నాను. శాసనసభలో బలం లేకపోయినప్పటికీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని బరిలోకి దించిందని సాక్షి దినపత్రికలో కథనం రాయడం విడ్డూరంగా ఉంది. టిడిపి తరఫున 23 మంది ఎమ్మెల్యేలు ఎన్నికల్లో విజయం సాధించారు. ఎమ్మెల్సీగా గెలవడానికి ఆ పార్టీకి 22 మంది ఎమ్మెల్యేల మద్దతు చాలు. ఒకవేళ, నలుగురు శాసనసభ్యులు ప్రధాన ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలోకి పార్టీ ఫీరాయించినట్లయితే, ఆ నలుగురు పై శాసనసభాపతి ఎందుకని అనర్హత వేటు వేయలేదని రఘు రామకృష్ణంరాజు ప్రశ్నించారు.

తాను పుట్టాకే విలువలు పుట్టాయన్నట్లుగా బిల్డప్ లు ఎందుకు జగన్?

ఇతర పార్టీల నుంచి తమ పార్టీలో చేరే వారు, పదవులకు రాజీనామా చేయాలని రాజకీయా విలువల గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదేపదే పేర్కొన్న విషయం తెలిసిందేనని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. తాను విలువలకు కట్టుబడి ఉన్నట్లు, విలువల కోసమే బ్రతుకుతున్నట్లు… తాను పుట్టాకే విలువలు పుట్టాయన్నట్లుగా మాట్లాడే జగన్మోహన్ రెడ్డి టిడిపి నుంచి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నలుగురిపై ఎందుకనీ అనర్హత చర్యలకు సిఫార్సు చేయలేదు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 22 మంది ఎమ్మెల్యేలకు ఒక క్యాంపు చొప్పున, ఎమ్మెల్యే లందరికీ మా సింహం
క్యాంపులు నిర్వహించాల్సి రావడం అత్యంత దురదృష్టకరం. కను సైగతో పార్టీ శాసనసభ్యులను శాసిస్తాడనుకునే ముఖ్యమంత్రికి, హతవిధి… ఎంత కష్టం వచ్చిందని రఘు రామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. ఇద్దరూ నుంచి ముగ్గురు మంత్రులకు ముఖ్యమంత్రి క్యాంపు బాధ్యతలను అప్పగించిన తర్వాత కూడా , ఎమ్మెల్యేలను కాచుకోవలసిన దుస్థితి నెలకొందంటే ప్రజల్లో పార్టీ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
వై నాట్ 175 అన్న తమ పార్టీ సిద్ధాంతాన్ని ప్రజలు నమ్మడం లేదు. మన పరిస్థితిని తెలుసుకోవడానికి ప్రత్యేక పంచాంగాలు అవసరం లేదు. మన కథ ముగిసిందని ప్రజలకు అర్థమయ్యిందన్నారు.

రూపాయ చెల్లిస్తే చాలు… ఇంటి రిజిస్ట్రేషన్ చేయిస్తానన్న జగన్

ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి, ఎటువంటి రుణభారం లేకుండా, కేవలం రూపాయి చెల్లిస్తే చాలుటిడ్కో ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తానని లబ్ధిదారులకు చెప్పారని రఘు రామ కృష్ణంరాజు గుర్తు చేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వీడియోను ఆయన మీడియా ప్రతినిధుల ముందు ప్రదర్శించారు. చంద్రబాబు నాయుడు స్కీం అయితే ఏడు లక్షల రూపాయలను 20 ఏళ్ల పాటు లబ్ధిదారులే రుణ మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుందన్న జగన్, తమ ప్రభుత్వం లో మాత్రం సింగిల్ రూపాయ చెల్లిస్తే చాలు… ఎటువంటి రుణభారం లేకుండా ఇంటిని రిజిస్ట్రేషన్ చేసి లబ్దిదారులకు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారన్నారు. నాలుగేళ్లు గడిచిపోయినప్పటికీ, జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు అతి, గతి లేకుండా పోయింది. ఒక్క లబ్ధిదారునికి కూడా ఇంటిని కేటాయించలేదు. రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వలేదు. లబ్ధిదారుల పేరిట రుణాలు పొందడానికి, గతంలో ప్రభుత్వమే బ్యాంకర్లతో చర్చలు జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఆ అప్పులను టిడ్కో ఇళ్ల లబ్ధిదారులే వాయిదాల పద్ధతిలో చెల్లించవలసి ఉంటుందని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు .జగన్మోహన్ రెడ్డి చెప్పిందంత అబద్ధం… పచ్చి మోసమని ఆయన మండిపడ్డారు. లబ్ధిదారులకు ఇళ్లను ఇచ్చాం… రూపాయకే ఇంటిని రిజిస్ట్రేషన్ చేసి ఇళ్లను అందజేశాం… ఇక లబ్ధిదారులు వాయిదాల పద్ధతిలో రుణాలను చెల్లించవలసిన అవసరం లేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు ప్రకటించగలరా? అని ఆయన సవాల్ చేశారు. టిడిపి ప్రభుత్వ హయాంలో 80 నుంచి 90% పూర్తయిన టిడ్కో ఇళ్లను కూడా ఇప్పటివరకు లబ్ధిదారులకు అందజేయలేదు. అమరావతిలో చేపట్టిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా, 900 ఎకరాలలో గుడిసెలు వేసుకునేందుకు పేదలకు అవకాశం ఇస్తామని చెప్పడం జగన్మోహన్ రెడ్డి నీచ, కుటిల సంస్కారానికి నిదర్శనం. ప్రజలన్నీ అర్థం చేసుకుంటున్నారు. మీరు చెప్పిన అబద్ధాలను, చేసిన మోసాలను గ్రహించారని రఘురామకృష్ణం రాజు అన్నారు.

25 లక్షల ఇళ్ల పంపిణీ ఏమయింది?

25 లక్షల ఇళ్లను ఉగాది నాటికి పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రకటించారు. నాలుగు ఉగాది పండగలు ఇప్పటికే పోయాయి. ఏ ఉగాది పండగ నాటికి పేదలకు ఇళ్లను ఇస్తారో తెలియని అయోమయ పరిస్థితి. త్వరలోనే ఐదవ ఉగాది కూడా రానుంది. ఆరవ ఉగాది నాటికి అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఉండరు. 25 లక్షల ఇళ్లను పంపిణీ చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటివరకు ఐదు ఇళ్లను మాత్రమే నిర్మించినట్టుగా పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి తెలియజేశారని రఘురామకృష్ణంరాజు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత మద్యనిషేధం అమలు చేస్తామని చెప్పి మోసం చేయడమే కాకుండా, లబ్ధిదారులకు ఒక్క రూపాయికి ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని చెప్పి మహిళలను పచ్చి మోసం చేశారు. పేదల కోసం ఉన్నానని, పెత్తందారులతో పోరాటం చేస్తున్నానని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి… రూపాయికి ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తానని చెప్పి, చేయకపొతే మోసగించినట్లు కాదా అని ప్రశ్నించారు.

పార్టీ సభ్యులుగా మాకు అసహ్యం కలుగుతోంది

రూపాయకే ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించి లబ్ధిదారులకు అందజేస్తామని ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ, ఆయనకు అవగాహన లేకుండా చెప్పి ఉంటారని సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అంటారేమోనని రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు .
అధికారంలోకి వచ్చిన వారం రోజుల వ్యవధిలో ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పగా, అవగాహన లేకుండా జగన్మోహన్ రెడ్డి చెప్పారని గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే. పరదలా చాటున, ప్రజలకు దూరంగా ఉండే ముఖ్యమంత్రిని, ప్రజలతో సంబంధం లేని సజ్జల రామకృష్ణారెడ్డిని ఎవరు ప్రశ్నించకపోయినప్పటికీ, పార్టీ సభ్యులుగా తమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు . ముఖ్యమంత్రిని ఎవరూ ప్రశ్నించలేరని, ఒకవేళ ప్రశ్నిస్తే డీజీపీ హోదా కలిగిన పోలీసు అధికారి సునీల్ కుమార్, వారిని చిత్రహింసలకు గురి చేస్తారు. మాట తప్పితే, కాలర్ పట్టుకుని నిలదీయమని గతంలో ముఖ్యమంత్రే సలహా ఇచ్చారు . ప్రజలు ఎక్కడ
కాలర్ పట్టుకుని నిలదీస్తారేమోనని కాబోలు… పరదాల చాటున ముఖ్యమంత్రి ప్రజలకు దూరంగా ఉంటున్నట్లు ఉంది. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదు?, రూపాయకే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారా??, బ్యాంకు బాకీలను ప్రభుత్వమే చెల్లిస్తుందా???, జగన్ మాట ఇస్తే తప్పడని నిరూపించండి అంటూ రఘురామకృష్ణంరాజు సూచించారు. ప్రజలకు ఆస్తి హక్కు కల్పిస్తామని చెప్పి గతంలో ఒక్కొక్క కుటుంబం నుంచి పదివేల రూపాయలు వసూలు చేశారు. ఆస్తి హక్కు కలిపిస్తూ ప్రభుత్వం ఇచ్చిన పత్రం నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావడం లేదు. ఆస్తి హక్కు పత్రంపై ఏ ఒక్కరికి కూడా అప్పు పుట్టలేదు. పదివేల రూపాయలిచ్చి మోసపోయామని ప్రజలు ఇప్పటికే గ్రహించారని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.

ఉగాది నాడు గుడికి వెళ్ళారా… సెట్టింగ్ ఖర్చు ప్రజలదే కదా?

ఉగాది పండుగ పర్వ దినోత్సవం నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుడికి వెళ్లకుండా, ఇంటి పక్కనే దేవాలయ సెట్టింగ్ వేయించుకోవడం ఆశ్చర్యం కలిగించిందని రఘురామకృష్ణం రాజు అన్నారు. పండుగనాడు ఎవరైనా దేవాలయానికి వెళ్లి దేవుడికి దండం పెట్టుకుంటారు. కానీ విచిత్రంగా ముఖ్యమంత్రి మాత్రం, తన ఇంటి పక్కనే దేవాలయ సెట్టింగ్ వేయించుకున్నారు. దేవాలయ సెట్టింగు ఖర్చు ఎవరిది?. ప్రజల సొమ్మే కదా అని ప్రశ్నించారు. ప్రజలకు ఎన్నో అబద్ధాలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నటనకు ఆస్కార్ లో ఏదో ఒక కేటగిరిలో అవార్డు లభిస్తుందని అపహస్యం చేశారు. టిడిపి జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఫైల్ ఫోటోను ప్రచురించినందుకు గతంలో ఆ సంస్థ చైర్మన్ రామోజీరావు ను అసెంబ్లీకి పిలిపించాలని కొంతమంది మంత్రులు అన్నారు. అసెంబ్లీలో స్పీకర్ పై దాడి ఘటన అంటూ అసెంబ్లీలోనే లేని ఆదిరెడ్డి భవాని ఫోటోను సాక్షి దినపత్రికలో ప్రచురించారు. మరి ఇప్పుడు సాక్షి దినపత్రిక చైర్మన్ వైయస్ భారతీ రెడ్డి ని అసెంబ్లీకి పిలిపిస్తారా?, పిలిపించాలని మంత్రులు అడుగుతారా??, వైయస్ భారతి రెడ్డిని కాకపోతే, తెరచాటున పెట్టుబడులు సమకూర్చిన జగన్మోహన్ రెడ్డి ని పిలిపించాలని డిమాండ్ చేస్తారా అంటూ రఘురామకృష్ణంరాజు శరపరంపరంగా ప్రశ్నస్త్రాలు సంధించారు.

అసెంబ్లీ పుటెజ్ ను ప్రజల ముందు పెట్టండి

అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ దళిత శాసనసభ్యుడు బాల వీరాంజనేయులు పై దాడి చేసి, తిరిగి స్పీకర్ పైనే టిడిపి ఎమ్మెల్యేలు దాడి చేశారంటూ సాక్షి దినపత్రికలో వార్తా కథనాన్ని ప్రచురించడం విడ్డూరంగా ఉందని రఘు రామకృష్ణంరాజు మండిపడ్డారు. దాడి ఘటనలో అధికార పార్టీ శాసనసభ్యులు ఎటువంటి తప్పు చేయకపోతే, అసెంబ్లీ ఫుటేజ్ ను ముఖ్యమంత్రి విడుదల చేసి ప్రజలకు నిజానిజాలు తెలుసుకునే అవకాశాన్ని కల్పించాలి. ఇక ఆ సమయంలో అసెంబ్లీలోనే లేని టిడిపి అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయాలని మంత్రులు, శాసనసభ్యులు కోరడం హాస్యాస్పదంగా ఉంది. నైపుణ్య శిక్షణ తరగతుల నిర్వహణలోనూ కుంభకోణం జరిగిందని, చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఖాయమంటూ మరి కొంతమంది మంత్రులు వ్యాఖ్యానించడం విడ్డూరం. నైపుణ్య శిక్షణ తరగతుల నిర్వహణలో ఎటువంటి అవినీతి జరగలేదు. ఎటువంటి అవినీతి జరగనిదానికే కేసులు నమోదు చేస్తామంటే, అన్నింట్లోనూ అవినీతికి పాల్పడ్డ మనపై ఎన్ని కేసులు నమోదు చేయాలి. ఎదుటివారి విజయాన్ని తక్కువ చేసేందుకు వెకిలి చేష్టలు చేస్తే, ప్రజలు వారిని మరింతగా ఆదరిస్తారు. ప్రజల్లో వారిని ఎంతగా అప్రతిష్టపాలు చేయాలనుకుంటే, వారి ప్రతిష్ట అంతగా పెరుగుతుందని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

సివి రాజును అభినందించకపోవడం దురదృష్టకరం

ఏటికొప్పాక కళాకారులను ఎంతో ప్రోత్సహించిన , పద్మశ్రీ అవార్డును అందుకున్న సివి రాజును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, స్థానిక మంత్రి, ఎమ్మెల్యే కనీసం అభినందించకపోవడం శోచనీయమని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. సివి రాజు గొప్పతనం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, హర్యానా గవర్నర్, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుతో సహా తాను కూడా ఆయన్ని అభినందించి సన్మానించాను. కానీ, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరం. పెద్దలను గౌరవించాలని సంస్కారాన్ని ఈ ప్రభుత్వ పెద్దలకు ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లుగా రఘురామ కృష్ణంరాజు తెలిపారు. సోషలిస్ట్ నాయకుడు రామ్ మనోహర్ లోహియా తో పాటు, విప్లవ వీరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లకు ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు .