Devotional

పూర్ణ, పుష్కలాలు అయ్యప్పస్వామికి భార్యలా?

పూర్ణ, పుష్కలాలు అయ్యప్పస్వామికి భార్యలా?

మహిషి సంహారం కోసం హరిహరసుతుడు భూమిపై అయ్యప్పస్వామిగా అవతరించారు. కారణజన్ముడిగా అవతరించిన అయ్యప్ప బ్రహ్మచారి.
    
మహిషి సంహారం కోసం హరిహరసుతుడు భూమిపై అయ్యప్పస్వామిగా అవతరించారు. కారణజన్ముడిగా అవతరించిన అయ్యప్ప బ్రహ్మచారి.
స్వామి పెళ్లిమాట ఎత్తగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మాలిగాపురత్తమ్మ. తనను వివాహం చేసుకోమని స్వామి వారిని దేవి కోరుతుంది. సవతి తల్లి కోరిక మేరకు స్వామివారు పులిపాలను తీసుకువచ్చేందుకు అడవికి వెళతారు. ఆ సమయంలోనే తాను మహిషిని సంహరించడానికి అవతరించినట్లు నారద మహర్షి ద్వారా తెలుసుకుంటారు. అడవిలో ఆకాశ మార్గాన గర్జిస్తూ వెళుతున్న మహిషి మణికంఠుని మీద దాడిచేస్తుంది. మధించిన మహిషి భీకర గర్జనలు చేస్తూ రాగా, మణికంఠుడు దానిని సంహరిస్తాడు. అయితే చనిపోయిన మహిషి శరీరం కొండలా పెరిగిపోగా, ఆమె కన్నీరే అళుదా నదిగా మారిందని అంటారు. మహిషి కళేబరం పెరిగిపోవడంతో దానిపై రెండు రాళ్లను వేసి అదిమిపట్టి నృత్యం చేశాడు. ఆ నృత్యాన్ని చూడటానికి పార్వతీ పరమేశ్వరులు కైలాసం నుంచి వచ్చి, నందీశ్వరుడిని కాలైకట్టి వద్ద ఉండమని చెప్పి అక్కడ నుంచి అయ్యప్ప నృత్యాన్ని చూసి ఆనందించారు. స్వామివారి పాదస్పర్శతో పునీతురాలైన మహిషి, తనను వివాహం చేసుకోమని కోరింది. ఆమె కోరికను స్వామి సున్నితంగా తిరస్కరించి ఈ అవతారంలో బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నానని, వివాహమాడే ప్రసక్తే లేదని చెబుతారు. ఆమెను ముగురమ్మలకు ప్రతిరూపంగా మాలికాపురత్తమ్మ పేరుతో అందరూ సేవించుకునేట్లుగా వరాన్ని అనుగ్రహిస్తాడు. అయినా ఆమె పట్టువీడకపోవడంతో తనను దర్శించుకునేందుకు ఒక్క కన్నెస్వామి కూడా రాడో ఆ ఏడాది వివాహం చేసుకుంటానని అయ్యప్ప మాట ఇచ్చారు. అందుకే ఎరుమేలి నుంచి కన్నెస్వాములు తెచ్చిన శరాలను తాము వచ్చిన దానికి గుర్తుగా ‘శరంగుత్తి’లో గుచ్చుతారు. ఏటా మాలికాపురత్తమదేవి అంబారీ ఎక్కి శరంగుత్తికి చేరుకుని అక్కడ కన్నెస్వాములు గుచ్చిన శరాలను చూసి నిరాశతో వెనుదిరుగుతుంది.
శబరిగిరీశునికి అయ్యప్ప అవతారంలో పెళ్లి కాలేదు. కానీ, ఆదికాలంలో ధర్మశాస్తా పేరుతో అవతరించిన హరిహరసుతుడికి ‘పూర్ణ’, ‘పుష్కళా’ అనే దేవేరులతో వివాహం జరిగింది. సత్య పూర్ణుడు అనే మహర్షి నేత్రాల నుంచి ఉద్భవించిన పూర్ణ, పుష్కళ అనే ఇద్దరు యువతులు, ధర్మశాస్తాను వివాహమాడాలని నిశ్చయించుకుని, భక్తి ప్రపత్తులతో అందుకు తగిన వ్రతాన్ని చేసి, స్వామిని భర్తగా పొందారనేది పురాణ కథనం.

ధర్మశాస్తా అవతారంలో పూర్ణ, పుష్కళా అనే ఇద్దరు దేవేరులతో పాటు సరస్వతి అంశంతో ప్రభావతి అని ఇంకొక భార్య కూడా ఉందని వారికి ‘సత్యకన్‌’ అనే పుత్రుడు కూడా ఉన్నాడని పురాణాల్లో ఉంది. శబరిమలలో ఆలయంలో ఆలపించే పవళింపు సేవా గానంలోని ‘ప్రణయ సత్యకా స్వామి ప్రాణనాయకం’ అను పదాలే నిదర్శమని పురాణ పండితులు చెబుతారు.

అయితే ఈ విషయంలో వైదిక ధర్మం మరోలా చెబుతోంది. భార్య అన్న శబ్దానికి అర్థం నిజంగా మహిళ పక్కన ఉండటమే భార్యత్వం కాదు. మిమ్మల్ని ఆశ్రయించిన శక్తి మీతో ఉండటాన్ని స్త్రీ రూపంగా సంకేతిస్తారు. ఏ శక్తి రూపాన్ని ఆరాధాన చేసినా ఇదే చెబుతారు. ‘శ్రీ’కారం ఎక్కడ ఉంటే అక్కడ శక్తి పూజ ఉందని అర్థం. పూర్ణ, పుష్కళ అంటే ఆయన భార్యలు కాదు, ఆయనకు ఉన్న శక్తులు. ఆయన వద్ద రెండు గొప్ప శక్తులు ఉన్నాయని అర్థం. అవే పూర్ణత్వమం.. పుష్కళత్వం. పూర్ణత్వమంటే నిండుగా ఉండటం. ఎంతలా అంటే ఎంతమంది వచ్చినా ఇచ్చేంత పుష్కళంగా ఉండటం అని అర్థం. ఇలా ఎంతైనా ఇవ్వగలిగిన రెండు శక్తులు ఉన్న వాడే పూర్ణ, పుష్కళ సమేతుడు.