Politics

చంద్రబాబు నాయుడు మహిళలకు వరాల జల్లు…

చంద్రబాబు నాయుడు మహిళలకు వరాల జల్లు…

ఆంధ్రప్రదేశ్‌లో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని అధికార పార్టీ.. ఈ సారి కచ్చితంగా గెలిచి తీరాలని విపక్షాలు గట్టిగా తీర్మానించుకోవడమే కాక.. ఆ మేరకు కార్యచరణ, ప్రణాళిక రెడీ చేసుకుని.. రంగంలోకి దిగుతున్నాయి. ఇక ఎన్నికలకు ఏడాది ముందు నుంచే టీడీపీ.. ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది. ఇప్పటికే టీడీపీ యువనేత నారా లోకేష్‌ యువగళం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తుండగా.. చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలతో బిజీగా ఉన్నారు. ఇక ఎన్నికల ముందు వచ్చిన మహానాడు కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. పనిలో పనిగా.. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. మహానాడు వేదికగా తొలి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎన్నికల హమీల్లో భాగంగా ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ఆ వివరాలు..

ఈ ఏడాది తెలుగుదేశం పార్టీ మహానాడు చాలా విశిష్టమైంది. పార్టీ వ్యవస్థాపకుడు సీనియర్‌ ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న తరుణంలోనే మహానాడు కూడా రావడంతో.. మరింత ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి మహానాడుకి వేదిక అయ్యింది. ఈ కార్యక్రమం సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. 2024లో తాము అధికారంలోకి వస్తే.. అమలు చేయబోయే 6 ప్రధాన హామీలను మహానాడు వేదిక మీదుగా ప్రకటించారు చంద్రబాబు నాయుడు. బీసీలు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, యువతను ఆకర్షించేలా ఈ 6 హామీలు ఉన్నాయి. ఆ వివరాలు..

మహిళల కోసం మహాశక్తి..టీడీపీ అధికారంలోకి వస్తే.. మహా శక్తి పథకం ద్వారా మహిళల అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని ప్రకటించారు చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో ఉన్న 18 ఏళ్లు నిండిన మహిళలకు “స్త్రీనిధి” కింద నెలకు 1500 రూపాయలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అలానే ‘తల్లికి వందనం’ అనే మరో పథకం ప్రకటించారు చంద్రబాబు నాయుడు. ఈ పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే.. వారందరి పేరు మీద.. ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15 వేలు అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇక “దీపం” పథకం కింద.. ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్నారు. “ఉచిత బస్సు ప్రయాణం” పథకం ద్వారా స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్టులేని ప్రయాణ సౌకర్యం కల్పిస్తామంటూ మహిళలపై చంద్రబాబు వరాల జల్లు కురిపించారు

బీసీల కోసం ప్రత్యేక చట్టం..బీసీల రక్షణ కోసం చట్టం తెచ్చి.. వారికి అన్ని విధాలా అండగా నిలుస్తామని చంద్రబాబు మహానాడు వేదిక మీదుగా ప్రకటించారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఇబ్బందులకు గురైన బీసీలను తాము ఆదుకుంటామని స్పష్టం చేశారు.

ఇంటింటికీ నీరు..తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఇంటింటికీ మంచి నీరు.. పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.

యువగళం నిధి..2024 ఎన్నికల్లో తమను గెలిపిస్తే.. అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తూనే.. ప్రతి నిరుద్యోగికి ‘యువగళం నిధి’ కింద నెలకు 3000 రూపాయలను ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.

అన్నదాతకు అండగా..తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రైతన్నకు అండగా ఉంటామని.. వారిని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. అంతేకాక ప్రతి రైతుకు ఏడాదికి 20 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అన్నదాత పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందించి.. వారికి దన్నుగా ఉంటామని స్పష్టం చేశారు.

పూర్ టు రిచ్..పేదలను సంపన్నులను చేయడానికి తెలుగుదేశం కృషి చేస్తుందని చంద్రబాబు ప్రకటించారు. 5 ఏళ్లలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని.. అందుకు తగ్గట్టు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

చంద్రబాబు ప్రకటించిన ఈ మినీ మేనిఫస్టో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు ఈ హామీలు ప్రకటించారనే చర్చ జరుగుతోంది. చంద్రబాబు ప్రకటించిన ఈ హామీలపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మరి చంద్రబాబు హామీలపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.