Business

మళ్లీ గోఫస్ట్ విమానాలు

మళ్లీ గోఫస్ట్ విమానాలు

దివాలా ప్రక్రియలో ఉన్న విమానయాన సంస్థ గోఫస్ట్‌, కార్యకలాపాలు పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. డీజీసీఏ ఆమోదం తెలిపితే జులై 1న కార్యకలాపాలు మొదలుపెట్టాలన్నది సంస్థ యోచన. కార్యకలాపాలను పునః ప్రారంభించేందుకు నిధులు అవసరం కనుక, సంస్థ విజ్ఞప్తి మేరకు బ్యాంకులు రూ.400 కోట్ల రుణాలు ఇచ్చే అవకాశం ఉందని ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి. మే 2 నుంచి గోఫస్ట్‌ తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేసిన సంగతి విదితమే. రుణదాతల కమిటీకి (సీఓసీ) గోఫస్ట్‌ పరిష్కార నిపుణుడు(ఆర్‌పీ) శైలేంద్ర అజ్మేరా ఒక వ్యాపార ప్రణాళికను సమర్పించారు. ఇందులో రూ.400 కోట్లకు పైగా నిధులకు విజ్ఞప్తి చేశారు. గోఫస్ట్‌కు రూ.6,500 కోట్లకు పైగా రుణాలిచ్చిన బ్యాంకుల బృందంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, సెంట్రల్‌ బ్యాంక్‌, డాయిష్‌ బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంక్‌ ఉన్నాయి. ఈ విజ్ఞప్తిపై బ్యాంకు ప్రతినిధులు సమావేశమై చర్చించనున్నారని తెలుస్తోంది. తొలి దశలో 22 విమానాలతో 150 రోజువారీ సర్వీసులను నిర్వహించాలని గోఫస్ట్‌ భావిస్తోంది. కార్యకలాపాల పునః ప్రారంభానికి, టికెట్ల విక్రయానికి డీజీసీఏ అనుమతులను సంస్థ పొందాల్సి ఉంది.