WorldWonders

తెలంగాణ హైకోర్టు: దత్తత వెళ్తే ఆస్తిలో హక్కులుండవు

తెలంగాణ హైకోర్టు: దత్తత వెళ్తే ఆస్తిలో హక్కులుండవు

దత్తత రూపంలో మరో కుటుంబానికి వెళ్లిన వ్యక్తికి, తాను జన్మనిచ్చిన కుటుంబానికి చెందిన ఆస్తిలో హక్కులు ఉండవని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. ఒకే వ్యక్తి రెండు కుటుంబాల్లో సభ‌్యుడిగా ఉండరని, అలాంటప్పుడు ఆస్తిలో హక్కు కూడా ఉండదని పేర్కొంది.దత్తతకు వెళ్లకముందు ఆస్తి పంపకాలు జరిగి, వాటాల కేటాయింపు జరిగి, దత్తతకు వెళ్లే వారికి కూడా వాటా కేటాయించితే మాత్రమే ఆ ఆస్తిపై మాత్రమే హక్కు ఉంటుందని తెలిపింది. దత్తతకు వెళ్లక ముందు ఎలాంటి కేటాయింపులు లేకపోతే జన్మించిన కుటుంబానికి చెందిన ఆస్తిలో, దత్తత వెళ్లినవారికి ఎలాంటి వాటా ఉండదంటూ కీలక తీర్పు వెలువరించింది.

దత్తత వెళ్లినా, తనకు జన్మించిన కుటుంబం ఆస్తిలో వాటా ఉంటుందంటూ ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలానికి చెందిన ఎ.వి.ఆర్‌.ఎల్‌.నరసింహారావు ఖమ్మం సివిల్‌ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన ఆ కోర్టు నరసింహరావుకు, అతను జన్మించిన కుటుంబంలోని ఆస్తిలో వాటా ఉంటుందంటూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ నరసింహారావు సోదరుడు ఎ.నాగేశ్వరరావు, మిగిలిన కుటుంబ సభ్యులు హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ పి.నవీన్‌రావు, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్‌ నగేశ్‌ భీమపాకలతో కూడిన ఫుల్‌బెంచ్‌ సుదీర్ఘంగా విచారించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఇటీవల తీర్పు వెలువరించారు.

ఒకసారి దత్తతకు వెళ్లినప్పుడు పుట్టిన కుటుంబంతో ఉన్న సంబంధాలన్నింటినీ వారు తెంచుకుంటారని, దత్తత తీసుకున్న కొత్త కుటుంబ బంధాలను పొందుతారని చట్టం చెబుతోందని న్యాయస్థానం తెలిపింది. పుట్టిన కుటుంబంతో ఎలాంటి సంబంధం లేనప్పుడు ఆస్తిలో హక్కును మాత్రం పొందలేరని పేర్కొంది.కోల్‌కతాలోని ‘దాయాభాగ’, తెలుగు రాష్ట్రాల్లో మితాక్షర చట్టం ప్రకారం పుట్టిన వెంటనే ఉమ్మడి కుటుంబం ఆస్తిలో హక్కు పొందుతాడని ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఆ హక్కును చట్టంలో పేర్కొన లేదంది. మితాక్షర ప్రకారం పూర్వీకుల ఆస్తిలో భాగం ఉంటుందని, అయితే పుట్టిన కుటుంబంలోని వారు సంపాదించిన ఆస్తిలో వాటా ఉండదని స్పష్టం చేసింది.

యార్లగడ్డ నాయుడమ్మ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా చట్టప్రకారం సరికాదని అభిప్రాయపడింది. మేన్స్‌ హిందూ చట్టం, ముల్లా సూత్రాలతోపాటు పట్నా, అలహాబాద్‌ హైకోర్టులు, సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకుని.. దత్తతకు ముందు వాటా కేటాయించకపోతే పుట్టిన కుటుంబ ఆస్తిలో హక్కు ఉండదంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.