Agriculture

రైతు చిరుతను బైక్‌కు తాడుతో కట్టి అటవీ కార్యాలయానికి తీసుకెళ్లాడు

రైతు చిరుతను బైక్‌కు తాడుతో కట్టి అటవీ కార్యాలయానికి తీసుకెళ్లాడు

దానిని కోడి అనుకున్నాడో లేదా పిల్లి అనుకున్నాడో ఏకంగా చిరుత పులిని తన బైకు కట్టుకుని తీసుకెళ్లాడో రైతు. కర్ణాటకలోని హసన్‌ జిల్లా బాగివాలు గ్రామానికి చెందిన ముత్తు అనే రైతు తన పొలానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతడికి 9 నెలల వయస్సున్న చిరుత పులి ఎదురుపడింది. మరి అది ఊకుంటుందా.అతడిపై దాడికి దిగింది. అయితే తానేం తక్కువ అనుకున్నాడో ఏమో.దానిపై ఎదురుదాడి చేశాడు.తన వద్ద ఉన్న తాడుతో దానిని బంధించాడు. దాని కాళ్లను తాడుతో కట్టేశాడు. చిరుతను తన బైక్‌కు వెనక కట్టుకుని ఏకంగా అటవీ ఆఫీస్‌కు తీసుకెళ్లాడు.అది చూసి విస్తుపోయిన సిబ్బంది వెంటనే దానిని దవాఖానకు తరలించారు. ముత్తు స్వల్పంగా గాయపడ్డాడని, చిరుత ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. అవగాహన రాహిత్యంతో అతడు అలా చేశాడని చెప్పారు. అతనికి మరో ఉద్దేశం లేదన్నారు. కౌన్సెలింగ్‌ ఇచ్చిన తర్వాత ఆ రైతును వదిలేసినట్లు పేర్కొన్నారు. వన్య ప్రాణులు ఎదురుపడినప్పుడు మరోసారి ఇలాంటివి చేయకూడదని చెప్పినట్లు వెల్లడించారు. కాగా, స్వీయ రక్షణలో భాగంగానే చిరుత పులిని కట్టేశానని ముత్తు తెలిపారు.