Politics

చీమను చంపడానికి సుత్తిని తీసుకురాలేము అంటూ కేంద్రాన్ని ప్రశ్నించిన కోర్టు

చీమను చంపడానికి సుత్తిని తీసుకురాలేము అంటూ కేంద్రాన్ని ప్రశ్నించిన కోర్టు

కేంద్రం తీసుకురానున్న ఐటీ చట్ట సవరణపై బాంబే హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. కొత్త చట్టంతో మీడియా స్వేచ్ఛకు అడ్డుకట్ట వేయడానికి ఎందుకంత తొందరని ప్రశ్నించింది. సామాజిక మాధ్యమంలో ప్రభుత్వంపై నకిలీ వార్తల ప్రచారానికి అడ్డుకట్ట వేయడానికి ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) చట్టం సవరణ చేస్తూ ఇటీవలకేంద్రం తీసుకువచ్చిన మార్పులు ‘మితిమీరిన జోక్యం’ కావచ్చునని, చీమను చంపడానికి సుత్తిని ప్రయోగించాల్సిన అవసరం లేదని బాంబే హైకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది.ఇప్పుడు ఐటీ చట్ట నిబంధనలు సవరించాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్ధం కావడం లేదని కేసును విచారించిన జస్టిస్‌లు గౌతమ్‌ పటేల్‌, నీలా గోఖలేలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. వార్తల్లోని అంశాలు ఏవి నకిలీవో, ఏవి అసలైనవో ప్రభుత్వం నియమించిన ఒక అధికారి నిర్ధారించడం కష్టంతో కూడుకున్నదని తెలిపింది. అలాగే కొత్తచట్టంలో భాగంగా ఏర్పాటు చేసే ఫ్యాక్ట్‌ చెకింగ్‌ యూనిట్‌ని ఎవరు తనిఖీ చేస్తారని ప్రశ్నించింది. ఈ చట్టం ప్రవేశపెట్టడం వెనుక ఉన్న ఆతృత ఏమిటని నిలదీసింది. ‘ఒక వ్యక్తి ఒక అంశంపై తన అభిప్రాయాన్ని మీడియాలో వ్యక్తం చేస్తాడు. దానిని కొందరు సమర్థించవచ్చు. కొందరు వ్యతిరేకించవచ్చు. అలాగని వ్యతిరేకించిన వారి ఆలోచనా ధోరణిని పరిగణనలోకి తీసుకుని అందులోని అంశం అబద్ధం, నకిలీ, తప్పుదోవ పట్టించేది అని నిర్ధారించగలమా?’ అని ప్రశ్నించింది.

నకిలీ వార్తల నిర్ధారణకు ఎలాంటి సరిహద్దులు నిర్ణయించారు…మన ప్రజాస్వామ్య ప్రక్రియలో తనకు ఉన్న ప్రాథమిక హక్కు మేరకు ప్రతి పౌరుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, డిమాండ్‌ చేయడం సహజమేనని, వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. మాధ్యమాల్లోని వార్తల్లో ఏవి నకిలీవో, ఏవి అసత్యాలతో కూడినవో, ఏవి తప్పుదోవ పట్టించేవో నిర్ధారించడానికి సవరించిన చట్టంలో ఎలాంటి సరిహద్దులు నిర్ణయించారో చెప్పాలని ప్రశ్నించింది. కేంద్రం రెండు సార్లు సమర్పించిన అఫిడవిట్‌ను తాను పరిశీలించానని, అయితే వారు కొత్త చట్టంలో ఏ అవధులు ప్రతిపాదించారో తనకు అర్థం కాలేదని జస్టిస్‌ పటేల్‌ వ్యాఖ్యానించారు. ఐటీ చట్టంలో సవరణలు చేస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్ర, ఎడిటర్స్‌ గిల్ట్‌ ఆఫ్‌ ఇండియా సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు విచారించింది. పిటిషనర్ల తరఫు వాదనలు శుక్రవారంతో ముగిసినట్టు కోర్టు ప్రకటించింది.