DailyDose

అరుణాచల్ భారతదేశంలో అంతర్భాగం

అరుణాచల్ భారతదేశంలో అంతర్భాగం

భారత్‌లోని అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రాంతం దక్షిణ టిబెట్‌లో భాగం, అది తమదేనంటూ వాదిస్తున్న చైనాకు మింగుడుపడని పరిణామమిది. అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రం భారత్‌లో అంతర్భాగమంటూ అమెరికా సెనేట్‌ కమిటీ పేర్కొంది. భారత ప్రధాని మోదీ ఇటీవల అమెరికాలో జరిపిన చారిత్రక పర్యటన అనంతరం కంగ్రెషనల్‌ సెనెటోరియల్‌ కమిటీ ఈ మేరకు ఒక తీర్మానం చేయడం గమనార్హం. సెనేటర్లు బిల్‌ హగెర్టీ, టిమ్‌ కైన్, క్రిస్‌ వాన్‌ హోలెన్‌ గురువారం ఈ మేరకు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.చైనాకు, భారత్‌లోని అరుణాచల్‌ ప్రదేశ్‌కు ప్రస్తుతం ఉన్న మెక్‌ మెహన్‌ సరిహద్దు రేఖను అంతర్జాతీయ సరిహద్దుగా అమెరికా గుర్తిస్తోందని ఆ తీర్మానం పునరుద్ఘాటించింది. అరుణాచల్‌ భారత్‌లో విడదీయరాని భాగమని స్పష్టం చేసింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ప్రాంతాలు తమవేనంటూ చైనా అనుసరిస్తున్న దుందుడుకు, విస్తరణవాద విధానాలను తోసిపుచ్చింది. ఈ తీర్మానం సెనేట్‌ ముందుకు ఓటింగ్‌కు రానుంది. ఈ విషయంలో ఇతర భావసారూప్యత కలిగిన ప్రపంచ దేశాలతో కలిసి భారత్‌కు అమెరికా మద్దతు, సాయాన్ని అందజేస్తుందని కంగ్రెషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిషన్‌ ఆన్‌ చైనా కో చైర్‌ సెనేటర్‌ మెర్క్‌లీ చెప్పారు.