WorldWonders

ఎమర్జెన్సీ నంబర్‌కు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 2,700 ఫేక్ కాల్స్

ఎమర్జెన్సీ నంబర్‌కు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 2,700 ఫేక్ కాల్స్

ఒంటరి తనాన్ని ఎదుర్కోవటానికి చాలా మంది అనేక విధాలుగా ప్రయత్నిస్తుంటారు. ఇతరులతో పరిచయాలు పెంచుకోవటం, విహార యాత్రలకు వెళ్లటం.. ఇలా మనసుకు హాయి కలిగించే పనులు చేస్తుంటారు. అయితే ఈ మహిళ మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించింది. తన ఒంటరి తనాన్ని దూరం చేసుకోవాలని ఫేక్‌ ఎమర్జెన్సీ కాల్స్‌ (fake emergency calls) చేయటం మొదలు పెట్టింది. పదుల్లో, వందల్లో కాదు.. దాదాపు మూడేళ్లలో ఏకంగా 2,761 ఎమర్జెన్సీ కాల్స్ చేసింది. చివరకు కటకటాల పాలైంది. ఈ వింత ఘటన జపాన్‌లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జపాన్‌ (Japan) కు చెందిన హిరోకో తగామి (51) అనే ఓ నిరుద్యోగ మహిళ తన ఒంటరి తనాన్ని దూరం చేసుకోవాలనుకుంది. దీని కోసం ఫేక్‌ కాల్స్‌ చేయటం మొదలు పెట్టింది. అగ్నిమాపక విభాగానికి అనేక సార్లు ఫోన్‌ చేసింది. కడుపు నొప్పి, కాళ్ల నొప్పులు, డ్రగ్స్ ఓవర్‌డోస్ అయింది అంటూ అంబులెన్స్‌కు పెద్ద సంఖ్యలో కాల్స్‌ చేసింది. తీరా అంబులెన్స్ ఇంటికి చేరే సమయానికి తాను ఫోన్ చేయలేదని, ఆసుపత్రికి తీసుకెళ్లకండి అని వారించింది. ఇలా దాదాపు మూడేళ్ల పాటు ఫేక్‌ ఎమర్జెన్సీ కాల్స్‌ చేసింది.పోలీసు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది గట్టిగా నిలదీయగా తానే ఆ ఫేక్‌ కాల్స్ చేసినట్లు ఒప్పుకుంది. ‘నేనే ఈ కాల్స్ చేశాను. నేను ఒంటరి మహిళను, ఎవరైనా నా మాటలు వినాలని నా పట్ల శ్రద్ధ చూపించాలని కోరుకున్నాను. అందుకే ఈ ఫేక్‌ కాల్స్‌ చేశాను’ అని తెలిపింది. చివరకు అగ్నిమాపక అధికారుల ఫిర్యాదుతో పోలీసులు అరెస్టు చేశారు. అయితే జపాన్‌లో ఇలాంటి సంఘటనలు జరగటం ఇదేం మొదటి సారి కాదు. 2013లో 44ఏళ్ల మహిళ కూడా ఇలాగే ఆరు నెలల్లోనే 15వేల సార్లు పోలీసులకు కాల్స్ చేసి అరెస్టు అయింది. జపాన్‌లో దాదాపు 15 లక్షల మంది ఇదే రుగ్మతతో బాధపడుతున్నారని ఓ సర్వేలో వెల్లడైంది.