WorldWonders

పెంటగాన్‌ను దాటేసిన సూరత్ కార్యాలయం

పెంటగాన్‌ను దాటేసిన సూరత్ కార్యాలయం

ప్రపంచంలో అతిపెద్ద కార్యాలయం అమెరికాలోని పెంటగాన్‌ అని మనకు తెలుసు. కానీ.. దీన్ని మించిన పెద్ద కార్యాలయం మరొకటి ఉంది. ఇంతకీ అది ఎక్కడుందో తెలుసా..! ప్రపంచ వజ్రాల రాజధానిగా గుర్తింపు పొందిన గుజరాత్‌లోని సూరత్‌లో దీన్ని నిర్మించారు.ప్రపంచంలో 90 శాతం వజ్రాలు సూరత్‌ (surat)లోనే తయారు చేస్తారు. నిత్యం వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారస్థులు ఇక్కడకు వస్తుంటారు. వ్యాపారం సులువుగా సాగేందుకు డైమండ్‌ బర్స్‌ సంస్థ దీని నిర్మాణం చేపట్టింది. సుమారు నాలుగేళ్ల పాటు దీని నిర్మాణం సాగింది. నవంబరులో ప్రధాని నరేంద్రమోదీ దీన్ని ప్రారంభించనున్నారు. భారతీయ ఆర్కిటెక్చర్ సంస్థ మోర్ఫోజెనిసిస్ ఈ భవనాన్ని రూపొందించింది. ఈ నూతన కట్టడంలో సూరత్‌ డైమండ్‌ బర్స్‌లో కట్టర్లు, పాలిషర్లు, వ్యాపారస్థులు సహా 65,000 మంది ఇక్కడ వ్యాపారం చేసుకునేందుకు వీలుగా దీన్ని నిర్మించారు. 35 ఎకరాల స్థలంలో తొమ్మిది దీర్ఘచతురస్రాకారంలో 15 అంతస్థుల భవనాలను నిర్మించారు. ఈ భవనాలన్నింటికి మధ్యలో మరో భవనం అనుసంధానంగా ఉంటుంది. దీన్ని ఈ కార్యాలయానికి వెన్నెముకగా చెప్పవచ్చు.

ఈ కాంప్లెక్స్‌లో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రిక్రియేషన్‌ జోన్‌తో పాటు పార్కింగ్‌ కేటాయించారు. ‘‘వేలాది మంది వ్యాపారం కోసం ముంబయి వంటి ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. అలాంటి వారి భద్రత కోసం, వారి ప్రయోజనం కోసం దీన్ని నిర్మించాం. ప్రతిరోజు రైలులో ప్రయాణించే దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు సులభంగా ఇక్కడే వ్యాపారం చేసుకోవచ్చు. నిర్మాణానికి ముందే దీనిలో అన్ని కార్యాలయాలను డైమండ్‌ కంపెనీలు కొనుగోలు చేశాయి. ’’అని ప్రాజెక్టు CEO మహేష్ గాధవి తెలిపారు. ఈ కార్యాలయాన్ని లాభాల కోసం ఏర్పాటు చేసింది కాదని SDB(సూరత్‌ డైమండ్‌ బర్స్‌) తెలిపింది.80 ఏళ్లుగా పెంటగాన్‌ ప్రపంచంంలోనే అతి పెద్ద కార్యాలయంగా పేరొందింది. ప్రస్తుతం ఆ టైటిల్‌ను సూరత్‌ డైమండ్‌ బర్స్‌ సొంతం చేసుకుంది.