Business

ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్‌-TNI నేటి వాణిజ్య వార్తలు

ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్‌-TNI నేటి వాణిజ్య వార్తలు

80 లక్షల మందికి పన్ను రిఫండు

 ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు గడువు (ఈనెల 31) సమీపిస్తున్న నేపథ్యంలో, ఇప్పటి వరకు 4 కోట్ల మందికి పైగా ఈ ప్రక్రియ పూర్తి చేశారని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఛైర్‌పర్సన్‌ నితిన్‌ గుప్తా వెల్లడించారు. ఇందులో అర్హులైన 80 లక్షల మందికి ఇప్పటికే రిఫండు అందించినట్లు పేర్కొన్నారు. ‘ఐటీ శాఖలో మానవ వనరుల కొరత కారణంగా, అనుకున్న విధంగా ఫలితాలు సాధించలేకపోతున్నాం. ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించి, సిబ్బందిని త్వరగా నియమించేందుకు అనుమతులు ఇవ్వాలి’ అని కోరారు. సోమవారం ఆదాయపు పన్ను శాఖ 164వ వార్షికోత్సవం సందర్భంగా నితిన్‌ గుప్తా మాట్లాడుతూ వ్యక్తిగత, కార్పొరేట్‌ ప్రత్యక్ష పన్నులు కలిపి 2022-23లో రూ.16.61 లక్షల కోట్లు వసూలైనట్లు పేర్కొన్నారు. 2021-22తో పోలిస్తే ఇది 17.67% అధికమన్నారు. సాధ్యమైనంత తొందరగా రిటర్నులు ప్రాసెస్‌ చేసి, రిఫండు అందిస్తున్నామని తెలిపారు. గరిష్ఠంగా 16 రోజుల్లో ఐటీఆర్‌లను ప్రాసెస్‌ చేస్తున్నామని, దాదాపు 42% ఐటీఆర్‌లు ఒక రోజులోనే ప్రాసెస్‌ చేసినట్లు పేర్కొన్నారు.

* 2 వేల నోటుపై కీలక ప్రకటన

2000 రూపాయల నోటును చలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే నెలలో ప్రకటించింది. దీంతో పాటు వాటిని మార్చుకునేందుకు లేదా బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు కూడా సమయం ఇచ్చింది.. ఆర్బీఐ రెండు వేల రూపాయల నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేయడానికి మరియు మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు సమయం ఇచ్చింది. అయితే, ఆ తర్వాత ఆ నోట్లు చలమణిలో ఉండకూడదని గానీ, అవి చెట్లుబాటు కావు అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.. దీంతో, 2 వేల నోటు మార్చుకోవడానికి మరింత సమయం ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగింది.. అయితే, ఇప్పుడు కేంద్రం దీనిపై క్లారిటీ ఇచ్చింది.. సోమవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ రూ. 2,000 నోట్ల మార్పిడి లేదా డిపాజిట్ గడువును సెప్టెంబర్ 30, 2023 తర్వాత పొడిగించే ప్రతిపాదన లేదని స్పష్టం చేసింది.లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు. బ్యాంకుల్లో రూ. 2000 నోట్ల మార్పిడి గడువును సెప్టెంబర్ 30 తర్వాత పొడిగించే ప్రతిపాదన ఉందా అని ప్రశ్నించారు. ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన లేదని మంత్రి తెలిపారు. కాగా, నల్లధనం లేకుండా చేసేందుకు ప్రభుత్వం అధిక విలువ కలిగిన నోట్లను రద్దు చేయాలని యోచిస్తోందా? అని సభలో మరో ప్రశ్న తలెత్తింది. దీనిపై కూడా మంత్రి ధీటుగా సమాధానమిచ్చారు. మే 19న రిజర్వ్ బ్యాంక్ అకస్మాత్తుగా రూ.2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిందని గుర్తుచేశారు. మరోవైపు.. ఆర్బీఐ ప్రకారం, చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్లలో 76 శాతం బ్యాంకుల్లో డిపాజిట్ చేయబడ్డాయి లేదా మార్పిడి చేయబడ్డాయి. చలామణిలో ఉన్న రూ.2000 నోట్లు మే 19న ప్రకటించిన రోజున రూ.3.56 లక్షల కోట్లు ఉండగా జూన్ 30 నాటికి రూ.84,000 కోట్లకు తగ్గాయి. తిరిగి వచ్చిన నోట్లలో 87 శాతం ప్రజల తరపున బ్యాంకు ఖాతాల్లో జమ అయినట్లు ఆర్బీఐ తెలిపింది. మిగిలిన 13 శాతం మార్చారు. కాగా, నరేంద్ర మోడీ సర్కార్‌.. 2000 రూపాయల నోటును నవంబర్ 10, 2016న ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత అప్పట్లో చలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను బ్యాన్‌ చేసింది.. ఆ తర్వాత కొత్త 500 నోటును కూడా తీసుకొచ్చిన విషయం విదితమే.

ఎల్‌ఐసీ పాలసీతో ఆర్థిక భరోసాతో పాటు లోన్‌ ఆఫర్‌

భారతదేశంలో బీమా అంటేనే అందరికీ గుర్తు వచ్చే లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా. ఎందుకంటే ఇందులో పెట్టుబడి పెడితే జీవితానికి భరోసాతో పెట్టుబడికి ప్రభుత్వ భరోసా ఉంటుందని పెట్టుబడిదారుల నమ్మకం. ఎల్‌ఐసీ టర్మ్ ప్లాన్‌లు, ఎండోమెంట్ ప్లాన్‌లు, సీనియర్ వ్యక్తులు, పిల్లలు మొదలైన వాటితో సహా అనేక రకాల బీమాలు అందుబాటులో ఉన్నాయి.లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో పాటు ఎల్‌ఐసీ లేదా ఇతర జీవిత బీమా పాలసీల ద్వారా సెక్యూర్ చేయబడిన రుణాలను అందించే అదనపు రుణదాతలు ఉన్నారు. మీ క్రెడిట్ స్కోర్ వల్ల మీకు రుణం అందించేందుకు వాణిజ్య లేదా ప్రభుత్వ రంగ బ్యాంకులు నిరాకరిస్తే ఎల్‌ఐసీ పాలసీపై రుణం అనేది ఒక సులభమైన ఎంపికగా ఉంటుంది. కాబట్టి ఎల్‌ఐసీ పాలసీదారులు రుణం ఎలా పొందాలి? పైగా వడ్డీ రేటు ఎలా ఉంటుంది? అని విషయాలను తెలుసుకుందాం.ఎల్‌ఐసీ పాలసీ ద్వారా అందించే రుణంపై వడ్డీ రేట్లు దరఖాస్తుదారు ప్రొఫైల్ ద్వారా నిర్ణయిస్తారు. ఎల్‌ఐసీ ఎండోమెంట్ పాలసీల యజమానులు మాత్రమే లోన్‌కు అర్హులు. లోన్ మొత్తం అనేది ప్లాన్ సరెండర్ విలువపై అడ్వాన్స్ అని గుర్తుంచుకోవాలి. ఎల్‌ఐసీ బీమా పాలసీని తాకట్టుగా ఉంచుతుంది. ఫలితంగా దరఖాస్తుదారు అంగీకరించిన విధంగా రుణ చెల్లింపులు చేయడంలో విఫలమైతే బీమా ప్రొవైడర్‌కు కవరేజీని తిరస్కరించే హక్కు ఉంటుంది. రుణ బాధ్యత దాని సరెండర్ విలువ కంటే ఎక్కువగా ఉంటే పాలసీని రద్దు చేసే హక్కును ఎల్‌ఐసీ నిర్వహిస్తుంది. పాలసీదారునికి ప్లాన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పంపిణీ చేసే ముందు రుణం పూర్తిగా తిరిగి చెల్లించేలోపు బీమా పాలసీ మెచ్యూర్ అయితే అవసరమైన మొత్తాన్ని మినహాయించే హక్కు ఎల్‌ఐసీకి ఉంది. 

*  కాగితపు పరిశ్రమ నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకున్నది

 దేశీయ పేపర్‌ ఇండస్ట్రీ.. నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకున్నది. నీటి వాడకాన్ని ఏకంగా 80 శాతం ఆదా చేసినట్టు సోమవారం ఇండియన్‌ పేపర్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ (ఐపీఎంఏ) ఓ ప్రకటనలో తెలియజేసింది. మరింతగా తగ్గించుకొనేందుకే ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించింది. గత కొన్నేండ్లుగా పెట్టిన రూ.25,000 కోట్ల పెట్టుబడులు ఇందుకు దోహదం చేసినట్టు వివరించింది. అంతేగాక ప్రస్తుతం భారతీయ పేపర్‌ పరిశ్రమ.. పర్యావరణహిత నిర్ణయాలు, చర్యలతో ముందుకెళ్తున్నట్టు పేర్కొన్నది. ‘గతంలో పేపర్‌ మిల్లులు టన్ను పేపర్‌ తయారీకి 200 క్యూబిక్‌ మీటర్ల నీరును వాడేవి. ఇప్పుడు 40 క్యూబిక్‌ మీటర్లనే వినియోగిస్తున్నాయి. మున్ముందు దీన్నీ తగ్గిస్తాం’ అని ఐపీఎంఏ అధ్యక్షుడు పవన్‌ అగర్వాల్‌ తెలిపారు. పేపర్‌ మిల్లు యాజమాన్యాలు పరిశ్రమలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నాయని, అందుకే నీరు, విద్యుత్తు ఆదా చేయగలుగుతున్నాయని చెప్పుకొచ్చారు.

వాట్సాప్‌ అకౌంట్లూ హ్యాక్‌

సైబర్‌ నేరగాళ్లు (Cyber fraudsters) ఎప్పటికప్పుడు కొత్త పంథా అనుసరిస్తున్నారు. నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలు సృష్టించి ఫ్రెండ్స్‌ జాబితాలో ఉన్న వారిని డబ్బులు అడగడం ఇటీవల కాలంలో రివాజుగా మారింది. ఇప్పుడు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. వాట్సాప్‌ను (Whatsapp) లక్ష్యంగా చేసుకుని మోసాలకు దిగుతున్నారు. వాట్సాప్‌ అకౌంట్‌ను హ్యాక్‌ చేసి సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. దీనిపై చాలా మంది ఫిర్యాదు చేసినట్లు కోల్‌కతా పోలీసులు తాజాగా వెల్లడించారు. వారు ఎలా హ్యాక్‌ చేస్తున్నారు? దాంతో ఏం చేస్తున్నారు? వంటి వివరాలు పంచుకున్నారు.వాట్సాప్‌ అకౌంట్లను హ్యాక్‌ చేయడానికి సైబర్‌ నేరగాళ్లు ఫేస్‌బుక్‌ను వాడుకుంటున్నారు. ఓ వ్యక్తి పేరిట నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచి.. తద్వారా ఆ వ్యక్తికి చెందిన ఫ్రెండ్స్‌ లిస్ట్‌లో వ్యక్తిగతంగా మెసెంజర్‌ లింక్‌ పంపిస్తున్నారు. దానికి యోగా క్లాసులనో, ఇంకో పేరో పెడుతున్నారు. తర్వాత ఓ లింక్‌ పంపించి ఆ లింక్‌పై క్లిక్‌ చేయాలని, తర్వాత వచ్చే ఆరంకెల ఓటీపీని తమకు తెలియజేయాలని సూచిస్తున్నారు. వాస్తవంగా అది వాట్సాప్‌ వెరిఫికేషన్‌ కోడ్‌. వేరే ఫోన్‌లో లాగిన్‌ అవ్వడానికి వారు ఓటీపీ పంపిస్తున్నారు. ఒకసారి ఆ ఓటీపీ పంపించాక మీ వాట్సాప్‌ అకౌంట్‌ సైబర్‌ నేరగాళ్ల చేతికి వెళుతుందని పోలీసులు తెలిపారు. వాస్తవానికి యోగా తరగతులు అనేవి వారు వెరిఫికేషన్‌ కోడ్‌ పొందేందుకు ఉపయోగిస్తున్న ఓ ఎత్తుగడ మాత్రమే అని చెప్పారు. గత నెల యోగా దినోత్సవం సందర్భంగా ఈ తరహా కేసులు ఎక్కువగా వచ్చాయని, మున్ముందు ఇంకో ఎత్తుగడతో ముందుకొచ్చే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు.

మారుతి కార్లను రీకాల్‌

 కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ 88 వేల కార్లను రీకాల్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. స్టీరింగ్‌ టై రాడ్‌లో సమస్యలు తలెత్తడంతో 87,599 యూనిట్ల ఎస్‌-ప్రెస్సో, ఈకో మాడళ్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు తెలిపింది. జూలై 5, 2021 నుంచి ఫిబ్రవరి 15, 2023 వరకు తయారైన కార్లలో ఉచితంగా విడిభాగాలను రీప్లేస్‌ చేయనున్నట్లు తెలిపింది.

హోటల్ వ్యాపారాన్ని వేరుచేసిన ఐటీసీ

ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ సంస్థ తన హోటల్ వ్యాపారాన్ని విడదీసేందుకు డైరెక్టర్ల బోర్డు సూత్రప్రాయంగా ఆమోదం పొందినట్టు సోమవారం ప్రకటించింది. హోటళ్లు, హాస్పిటాలిటీ వ్యాపారం కోసం కొత్తగా ఏర్పాటైన సంస్థకు ఐటీసీ హోటల్స్‌గా పేరు నిర్ణయించగా, ఇది ఐటీసీ లిమిటెడ్ పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థగా ఉంటుంది. ఐటీసీ హోటల్స్‌లో 40 శాతం వాటాను ఐటీసీ కలిగి ఉంటుంది. మిగిలిన 60 శాతం వాటా కంపెనీ వాటాదారుల వద్ద ఉంటుంది. ఈ ఏడాది ఆగష్టు 14న సమావేశమయ్యే బోర్డు తదుపరి సమావేశంలో ఈ నిర్ణయంపై తుది నిర్ణయం జరుగుతుంది.సెబీ లిస్టింగ్ నిబంధనలు, సంబంధిత చట్టాలకు అనుగుణంగా తదుపరి ప్రకటన ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఐటీసీ హోటల్స్‌కు దేశవ్యాప్తంగా 70కి పైగా ప్రాంతాల్లో 120 హోటళ్లు ఉన్నాయి. కొత్త డీమెర్జర్ నిర్ణయం ద్వారా కంపెనీ పెట్టుబడిదారులను, భాగస్వామ్యాలను ఆకర్షితుందని, ఆతిథ్య రంగంలో కంపెనీ వృద్ధి మెరుగ్గా ఉంటుందని కంపెనీ అభిప్రాయపడింది. సోమవారం కంపెనీ ఐటీసీ హోటల్స్ డీమెర్జర్ ప్రకటనతో ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనబడింది. మార్కెట్లు ముగిసే సమయానికి షేర్ ధర 2 శాతానికి పైగా నష్టపోయి రూ. 479 వద్ద ఉంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై అత్యధిక వడ్డీ అందించే బ్యాంకు ఇదే

సురక్షితమైన పెట్టుబడి పథకాలలో ఫిక్స్ డ్ డిపాజిట్ అత్యంత ప్రజాదరణ పొందింది. అధిక వడ్డీతోపాటు పన్ను రాయితీలు కూడా ఉండటంతో అందరూ వీటిలో పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడతారు. అయితే దీనిలో వడ్డీ బ్యాంకును బట్టి మారుతుంటుంది. అలాగే సాధారణ పౌరులకు, సీనియర్ సిటిజెనులకు మధ్య కూడా వడ్డీరేటు మారుతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్నా పలు ప్రైవేటు ఫైనాన్స్ బ్యాంకులు ఎక్కువ వడ్డీని ఎఫ్ డీ లపై అందిస్తున్నాయి. వాటిల్లో నూ అత్యధిక వడ్డీని అందించేది సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్ఎఫ్బీ) . ఈ బ్యాంకు ఇటీవల రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును అప్‌డేట్ చేసింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సాధారణ ప్రజలకు 4.00% నుంచి 7.25% వరకు 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఎఫ్డీపై వృద్ధులకు 4.50% నుంచి 7.75% వరకు వడ్డీ రేటును ఈ బ్యాంకు ఆఫర్ చేస్తోంది.అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఎఫ్ డీ రేట్లపై వడ్డీలను సవరించడంలో ఈ సూర్యోదయ్ ఎస్ఎఫ్బీ బ్యాంకు కూడా కొత్త రేట్లను ప్రకటించింది. ఐదు సంవత్సరాల కాల పరిమితితో కూడిన ఎఫ్డీ లపై సాధారణ కస్టమర్‌లకు అత్యధిక వడ్డీ రేటు 9.10%, సీనియర్ సిటిజెనులకు 9.60% వడ్డీ రేటును అందిస్తోంది. అంతేకాక సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను ఆదా ప్రయోజనాలను కూడా అందిస్తోంది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, తాజా రేట్లు జూలై 5, 2023 నుంచి అమలులో ఉన్నాయి.

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 29.07 పాయింట్ల నష్టంతో 66,355 వద్ద ముగియగా.. నిఫ్టీ 8.25 పాయింట్లు నష్టపోయి 19,680 దగ్గర స్థిరపడింది. ఎస్బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఎల్ అండ్ టీ, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ షేర్లు నష్టపోగా.. టాటా స్టీల్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ షేర్లు లాభపడ్డాయి.

ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్‌

ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ (Bharti Airtel) తన కస్టమర్ల కోసం కొత్త ప్లాన్‌ ప్రవేశపెట్టింది. కేవలం రూ.148 డేటా వోచర్‌తో 15 జీబీ డేటా, ఎక్స్‌ట్రీమ్‌ ప్లే సబ్‌స్క్రిప్షన్‌ (Xstream Play) అందించనుంది. యాక్టివ్‌ ప్లాన్‌లోనే దీన్ని యాడ్‌ చేసుకోవచ్చు. అయితే, దీంట్లో ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌లకు కూడా అనుమతి లభిస్తుండటం ప్రత్యేకత.ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 15జీబీ డేటా లభిస్తుంది. ఈ డేటా వినియోగానికి రోజు వారీ పరిమితులు ఉండవు. ప్లాన్‌ వ్యాలిడిటీ ముగిసేలోగా మీ అవసరానికి తగినట్లుగా డేటాను ఉపయోగించుకోవచ్చు. దీంతో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే సబ్‌స్క్రిప్షన్‌నూ అందిస్తోంది. సోనీలీవ్ ప్రీమియం, ఎరోస్‌ నౌ, హోయిచోయ్, లయన్స్‌గేట్ ప్లే తో పాటు మొత్తం 15 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీం యాప్‌ ద్వారా మాత్రమే ఓటీటీ (OTT)లకు అనుమతి ఉంటుంది. 28 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌ లభిస్తుంది. అయితే.. దీంతో పాటు రూ.149 రీఛార్జ్‌తో కూడా 28 రోజులపాటు ఈ ఓటీటీల సదుపాయాన్ని ఆనందించొచ్చు.