DailyDose

ఆపరేషన్ చేసి పొట్టలో దూది మరిచిన డాక్టర్లు-TNI నేటి నేర వార్తలు

ఆపరేషన్ చేసి పొట్టలో దూది మరిచిన డాక్టర్లు-TNI నేటి నేర వార్తలు

ఆపరేషన్ చేసి పొట్టలో దూది మరిచిన డాక్టర్లు

వైద్యుల నిర్లక్ష్యం ఓ బాలింత ప్రాణాల పోయేలా చేసింది. ప్రసవం చేయించుకునేందుకు హాస్పిటల్ కు వచ్చిన గర్భిణీకి డాక్టర్లు సిజేరియన్ చేశారు. మగ బిడ్డ జన్మించాడు. అనంతరం డాక్టర్లు ఆమెకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా చేశారు. అయితే పొరపాటున కడుపులోనే దూది ఉంచి, దానిని తొలగించడం మర్చిపోయారు. తరువాత కుట్లు వేశారు. వారం రోజుల తరువాత ఆ బాలింత తీవ్ర నొప్పితో మరణించింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని దర్శన్ తాండాకు చెందిన రోజా అనే గర్భిణికి పొద్దులు నిండాయి. పురిటి నొప్పులు రావడంతో ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి అచ్చంపేటలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కు ఈ నెల 15వ తేదీన వెళ్లింది. ఆమెను పరీక్షించి, అడ్మిట్ చేసుకున్నారు. అదే రోజు ఆమెకు సిజేరియన్ చేయడంతో పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. కాగా.. అదే రోజు ఆమెకు డాక్టర్లు కుటుంబ నియంత్రణ ఆపరేష్ కూడా చేశారు. కానీ పొరపాటున కడుపులో దూది ఉంచారు. దానిని తీయడం మర్చిపోయారు. తరువాత అలాగే కుట్లు వేసేశారు. అనంతరం బాలింతను డిశ్చార్జ్ చేసి, ఇంటికి పంపిచారు.అయితే వారం రోజుల వరకు బాగానే ఉన్న బాలింతకు తరువాత రక్తస్రావం కావడం మొదలుపెట్టింది. దీంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. వెంటనే మంగళవారం ఆమెను ప్రసవం జరిగిన అదే గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకొని వెళ్లారు. అయితే డాక్టర్లు ఆమెను పరీక్షించారు. సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తీసుకొని వెళ్లాలని సూచించారు. అక్కడి డాక్టర్లు ఆమెను పరీక్షించారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. వెంటనే హైదరాబాద్ కు తీసుకొని వెళ్లాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు బాలింతను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకొని వెళ్లారు. అక్కడ ఆమె అడ్మిట్ అయ్యింది. కానీ అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించి, అదే రోజు రాత్రి సమయంలో మరణించింది. దీంతో డెడ్ బాడీని కుటుంబ సభ్యులు బుధవారం అచ్చంపేటకు తీసుకొని వచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. 

ఢిల్లీ విమానాశ్ర‌యంలో త‌ప్పిన పెను ప్ర‌మాదం

ఢిల్లీ విమానాశ్ర‌యం(Delhi Airport)లో పెను ప్ర‌మాదం తృటిలో త‌ప్పింది. రెండు విమానాల‌కు ఒకేసారి టేకాఫ్‌, ల్యాండింగ్‌కు అనుమ‌తి ఇచ్చారు. అయితే చివ‌రి క్ష‌ణాల్లో టేకాఫ్‌ను ర‌ద్దు చేశారు. ఏటీసీ ఇచ్చిన ఆదేశాల‌తో టేకాఫ్‌ను నిలిపివేశారు. దీంతో పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. విస్తారా ఎయిర్‌లైన్స్ సంస్థ‌కు చెందిన ఆ రెండు విమానాల్లో ఒక‌టి టేకాఫ్ తీసుకోనుండ‌గా, మ‌రొకటి ల్యాండింగ్‌కు సిద్ద‌మైంది.ఢిల్లీ నుంచి బెంగాల్‌లోని బ‌గ్‌దోరాకు వెళ్తున్న ఫ్ల‌యిట్ యూకే725 టేకాఫ్ తీసుకోనుండ‌గా, అహ్మాదాబాద్ నుంచి ఢిల్లీ వ‌స్తున్న విమానం ల్యాండింగ్ కానున్న‌ది. అయితే ఒకేసారి రెండింటికి సిగ్న‌ల్స్ ఇవ్వ‌డంతో.. ర‌న్‌వేపై ఆ రెండు విమానాలు ఢీకొనే ప‌రిస్థితి ఏర్ప‌డింది. కానీ ఏటీసీ చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో ఆ ప్ర‌మాదం త‌ప్పింది. అబార్ట్ సంకేతాలు ఇవ్వ‌డంతో బ‌గ్‌దోరా విమానం.. రన్‌వే నుంచి పార్కింగ్ బేకు వెళ్లిపోయింది. ఈ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టి వ‌ర‌కు విస్తారా ఎయిర్‌లైన్స్ సంస్థ ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

* హైదరాబాద్‌లో పోలీసుల సీక్రెట్‌ ఆపరేషన్‌

గంజాయి రవాణా విక్రయం పై పోలీసులు ఎన్ని చర్యలు చేపడుతున్న హైదరాబాద్ నగరంలోకి ఏదో దారిలో గంజాయి వస్తూనే ఉంది. హైదరాబాద్ లోని పాతబస్తీ దూల్పేట్ లాంటి ప్రాంతాల్లో నే కాకుండా నానక్ రామ్ గూడకు సైతం ఈ దందా పాకింది. చాటుమాటుగా కాకుండా కిరాణా దుకాణాల్లోనే ఏకంగా క్యూఆర్ కోడ్ స్కానర్లు పెట్టి మరి డబ్బులు స్వీకరిస్తున్నారు.గోల్కొండ పోలీసులు, నార్కోటిక్ బృందం సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించిన ఆపరేషన్ ల్ గంజాయి విక్రయిస్తున్న గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ గ్యాంగ్ లో పదిమంది వరకు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికీ నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు తెలంగాణ స్టేట్ నార్కోటిక్ బ్యూరో ఎస్పి గుమ్మి చక్రవర్తి తెలిపారు. అరెస్ట్ అయినా వారిలో ఇద్దరు మహిళలు కాగా.. ఒక జువైనల్ కూడా ఉన్నాడు. ఈ కేసులో గౌతమ్ సింగ్ అనే వ్యక్తి కీలకంగా ఉన్నాడు. అతని తల్లి నీతూ భాయి, అత్త మధు భాయి ఈ కేసులో భాగస్వాములుగా ఉన్నారు. వీరంతా నానక్ రామ్ గుడా లో కిరాణా షాప్ నడుపుతూ అందులోనే గంజాయి అమ్ముతున్నారు.అయితే 2019 లో గౌతమ్ సింగ్ ఎన్డీపీఎస్ కేసు ఉన్నట్లు పోలీసులు అన్నారు. 2018 నుంచి నీతూ భాయి పై కేసులు ఉన్నాయి ఉండగా, నీతూ భాయి పై 2021 లో పిడి యాక్ట్ నమోదు అయింది. జైలు నుండి వచ్చిన తీరు మార్చుకొని నీతూ భాయిఈ దందా కు కొనసాగించింది. నిందితులు అంతా కూడా కుటుంబ సభ్యులే కాగా నిందితుల వాడిన 16 బ్యాంక్ ఖాతాలలోని 1.53 కోట్ల నగద్ను ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు. గంజాయి అమ్మకం ద్వారా వచ్చిన 40.30 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు. వీరి వద్ద నుంచి 23.4 కిలోల గంజాయి, గంజాయి తరలింపుకు వినియోగించిన కారు సీజ్ చేసారు..రెండు ద్విచక్ర వాహనాలు, ఫోన్ పే స్కానర్లు,అరు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నాం.

* బిర్యానీ కోసం నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య

మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. ఎంతో ఈజీగా మర్డర్లు చేస్తున్నారు. మనుషుల్లో పట్టరాని కోపం, అసహనం పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే మంచి నీళ్లు తాగినంత ఈజీగా హత్యలు చేస్తున్నారు. మారణాయుధాలు వెంట పెట్టుకుని తిరుగుతూ ప్రాణాలు తీసేస్తున్నారు. తాజాగా చెన్నైలో అలాంటి దారుణం ఒకటి జరిగింది. బిర్యానీ కోసం జరిగిన ఘర్షణ ఓ యువకుడి ప్రాణం తీసింది. తాగుబోతుల చేతిలో హతమయ్యాడు. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.చెన్నైలో ఆదివారం రాత్రి దారుణం జరిగింది. బాలాజీ(22) అనే యువకుడు తన స్నేహితులతో కలిసి బిర్యానీ తినేందుకు మన్నూరుపేటకు వెళ్లాడు. షాపులో బిర్యానీ ఆర్డర్ చేశాడు. అదే సమయంలో కొందరు తాగుబోతులు అక్కడికి వచ్చారు. వారు కూడా బిర్యానీ ఆర్డర్ చేశారు. ఈ క్రమంలో వారు బాలాజీతో గొడవపడ్డారు. అసలే ఫుల్లుగా తాగున్నారు. మద్యం మత్తులో వారు రెచ్చిపోయారు. బాలాజీపై దాడి చేశారు. వేటకొడవళ్లతో నరికి చంపారు.నడిరోడ్డుపై దారుణం జరుగుతున్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. వాహనదారులు తమకేమీ పట్టనట్లు సినిమా చూసినట్లు చూసుకుంటూ వెళ్లిపోయారు. ఒక్కరు కూడా అడ్డుకునే సాహసం చెయ్యలేకపోయారు. అసలే తాగుబోతులు, పైగా వేటకొడవలి చేతిలో ఉంది. దీంతో ఎవరు కూడా ధైర్యం చేసి ముందుకు రాలేకపోయారు.ఈ దారుణ హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ”మృతుడి పేరు బాలాజీ. వయసు 22 సంవత్సరాలు. ముగ్గురు వ్యక్తులు అతడిని హత్య చేశారు. చెన్నై మన్నూర్ పేట్ బస్టాప్ దగ్గర ఈ ఘటన జరిగింది. బిర్యానీ ఆర్డర్ చేసే విషయంమై గొడవ జరిగింది. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలాజీని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కానీ, అతడు అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దాడికి పాల్పడ్డ వారిని శంకర్, అజిత్, వెంకట్ గా గుర్తించాము. ఆ ముగ్గురిని అరెస్ట్ చేశాం” అని అంబత్తూర్ పోలీసులు తెలిపారు.

ప్రియుడితో కలిసి భర్త హత్య

ప్రియుడితో కలిసి ఓ మహిళ దారుణాకి పాల్పడింది. తన భర్తను దారుణంగా హతమార్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఈ ఘటనకు పాల్పడింది. అయితే దీనిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఆమె ప్రయత్నించింది. కానీ పోలీసుల దర్యాప్తులో అది ప్రమాదం కాదని, హత్యా అని తేలింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.  నర్సీపట్నం ఏఎస్పీ అధిరాజ్‌సింగ్‌ రాణా తెలిపిన వివరాల ప్రకారం.. గొలుగొండ మండలం కొత్తమల్లంపేట గ్రామంలో 33 ఏళ్ల గుడివాడ అప్పలనాయుడు, 24 ఏళ్ల జానకి దంపతులు నివసిస్తున్నారు. అయితే జానకికి ఓ తాపిమేస్త్రిగా పని చేసే చింతల రాముతో కొంత కాలం కిందట పరిచయం ఏర్పడింది. అతడు పాతకృష్ణదేవిపేట చెందిన వ్యక్తి. అయితే వారి మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. జానకీ, ఆ తాపిమేస్త్రితో తరచూ ఫోన్ లో మాట్లాడటాన్ని అప్పలనాయుడు గమనించాడు. ఆమెను మందలించి, పనికి వెళ్లనివ్వడం లేదు. ఇది భార్యకు కోపం తెప్పించింది. తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా వస్తున్నాడని ఆమె భావించింది. అందుకే అతడిని అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. దీని కోసం ప్రియుడి కలిసి భర్తను హతమార్చడానికి ప్లాన్ వేసింది. అందులో భాగంగానే ఈ నెల 20వ తేదీన అప్పలనాయుడుకు ఏదో ఒక కారణం చెప్పి పాములవాకలో ఉన్న పట్టాలమ్మ తల్లి ఆలయానికి తీసుకొని వెళ్లింది. తరువాత దంపతులు ఇద్దరు బైక్ పై స్వగ్రామానికి ప్రయాణం మొదలుపెట్టారు. అయితే తాండవ నది గట్టు దగ్గరికి చేరుకున్న తరువాత.. బహిర్బూమికి వెళ్లాలని అనిపిస్తోందని భర్తకు చెప్పింది. దీంతో అతడు బైక్ ఆపాడు. భర్తను కూడా రోడ్డుకు పక్కన ఉన్న జీడితోటలోకి తీసుకొని వెళ్లింది. కొంత సమయం తోటలోనే కూర్చుందామని భర్తను కోరింది. దానికి అతడు అంగీకరించాడు. ఈ క్రమంలో జానకీ తన భర్త ఒడిలో తలపెట్టుకొని పడుకుంది. 

*  పెళ్లయి రెండేళ్లు అవుతున్నా.. పిల్లలు కలగడం లేదని ఆవేదనతో ఒక వివాహిత ఆత్మహత్య

 పెళ్లయి రెండేళ్లు అవుతున్నా.. తనకు పిల్లలు కలగడం లేదన్న ఆవేదనతో ఒక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. నెట్టుకాడు గ్రామానికి చెందిన సౌందర్య(21) అనే యువతికి చెన్నవరం గ్రామానికి చెందిన గణేషన్‌తో రెండేళ్ల క్రితం పెళ్లయ్యింది. పెళ్లైన కొత్తలో సౌందర్య ఎన్నో కలలు కంది. తన దాంపత్య జీవితం సాఫీగా సాగుతుందని, పిల్లలు పుడితే తల్లిగా వారిని పోషిస్తూ సంతోషంగా గడుపుదామని భావించింది. కానీ.. ఆమె మొదటి కోరిక తీరింది కానీ, రెండోదే పూర్తవ్వలేదు. పెళ్లయి రెండేళ్లయినా.. పిల్లలు కలగలేదని ఆమె ఆందోళన చెందింది. అత్తారింటోళ్లు కూడా ఆమెని పిల్లలు పుట్టడం లేదని సూటిపోటి మాట్లతో వేధించారు.ఏం చేయాలో తెలీక సౌందర్య ఈనెల 13వ తేదీన తన తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. తనకు పిల్లలు లేకపోవడంతో, అందరి వద్ద మాటపడాల్సి వస్తోందని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. అనంతరం ఫోన్ కట్ చేసి.. అదే రోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడింది. సౌందర్య తల్లిదండ్రులకు అనుమానం వచ్చి, వెంటనే అత్తారింటికి వెళ్లారు. అక్కడికి వెళ్లి చూడగా.. అపస్మారక స్థితిలో ఉన్న కుమార్తెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చిక్సిత కోసం చైన్నెలోని హాస్పిటల్‌కు తరలించారు. అయితే.. అక్కడ సౌందర్య చిక్సిత పొందుతూ సోమవారం మృతి చెందింది. దీంతో కన్నీరుమున్నీరైన సౌందర్య తల్లిదండ్రులు.. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. వాళ్లు కేసు నమోదు చేసి, దర్యాప్టు చేపట్టారు.

హైదరాబాద్‌లో తుపాకి మిస్‌ఫైర్

తుపాకి మిస్‌ఫైర్ అయి హెడ్‌కానిస్టేబుల్ మరణించిన ఘటన హైదరాబాద్‌లోని హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కబుతర్ఖానా ప్రాంతంలో రాత్రి విధులు ముగించుకుని వచ్చిన హెడ్‌కానిస్టేబుల్ భూపతి శ్రీకాంత్ నిద్రించే సమయంలో అతడి చేతిలోని తుపాకి మిస్‌ఫైర్ అయింది. తూటాలు శరీరంలోకి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్ చందానగర్ లో విషాదం

హైదరాబాద్ చందానగర్ లో విషాదం ఘటన చోటు చేసుకుంది. పాపిరెడ్డి కాలనీలో పాత ఇల్లు కూలుస్తుండగా ప్రమాదం జరిగింది. గోడ కూలుస్తుండగా ఒక్కసారిగా మీద పడి మృతి చెందాడు. ఇద్దరు కార్మికులు పాత ఇల్లు కూల్చడానికి వచ్చారు. ఒకరు కర్రతో గోడను కొడుతుండగా.. మరొకరు పక్కనే నిలుచున్నారు. గోడ ఒక్కసారిగా కూలడంతో.. గోడను కర్రతో కొట్టిన వ్యక్తి తప్పించుకున్నాడు. కానీ పక్కనే ఉన్న మరో కార్మికుడు తప్పించుకోలేకపోవడంతో.. గోడ శకలాలు మీదపడి మృతి చెందాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

భర్తను ఫంక్షన్‌కు పంపించి ప్రియుడితో భార్య జంప్

 తన భర్తను ఫంక్షన్‌ను పంపించి, ప్రియుడితో భార్య పారిపోయిన సంఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ప్రశాంత్, తేజస్వినీలకు 2020 నవంబర్‌లో పెళ్లయ్యింది. ఈ జంట రహమత్‌నగర్‌లో ఉంటోంది. ప్రశాంత్‌ కొరియర్‌ బాయ్‌గా పని చేస్తుండగా.. భార్య ఇంట్లోనే ఉంటుంది. కట్ చేస్తే.. వృత్తిలో భాగంగా ప్రశాంత్‌కి కిరణ్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. వీరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో.. కిరణ్ తరచూ ప్రశాంత్ ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలోనే తేజస్విని, కిరణ్‌కి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే.. ఈ విషయం ప్రశాంత్ ముందు తేజస్వినిని కిరణ్ ‘అక్క’ అని పిలిచేవాడు. దీంతో.. వారి మధ్య ఉన్న బంధాన్ని అతడు పసిగట్టలేకపోయాడు.కట్ చేస్తే.. ఈనెల 20వ తేదీన ప్రశాంత్ బంధువుల ఇంట్లో ఓ ఫంక్షన్ ఉండటంతో, భార్యతో కలిసి వెళ్లాలని అతడు అనుకున్నాడు. కానీ.. తేజస్విని మాత్రం రాలేనని చెప్పింది. ‘నువ్వు వెళ్లిరా’ అని చెప్పి, భర్తను అందంగా ముస్తాబు చేసి, ఫంక్షన్‌కు పంపించింది. ప్రశాంత్ ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి రాగా.. ఇంట్లో భార్య కనిపించలేదు. ఆమె దుస్తులు, నగదు, ఇతర వస్తువులు కూడా కనిపించలేదు. ఇదే సమయంలో కిరణ్ కూడా అదృశ్యమయ్యాడని తెలిసింది. దీంతో.. తనని మభ్యపెట్టి కిరణ్, తేజస్విని వెళ్లిపోయారన్న సంగతిని ప్రశాంత్ గ్రహించాడు. వెంటనే అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కిరణ్ మాయమాటలు చెప్పి తన భార్యను తీసుకెళ్లి ఉండొచ్చని ప్రశాంత్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు

*  విశ్రాంత ఆర్మీ ఉద్యోగిపై కత్తులతో వైసిపి నేతల దాడి

 విశాఖ జిల్లాలోని పద్మనాభం మండలం రేవిడిలో విశ్రాంత ఆర్మీ ఉద్యోగి ఆదినారాయణపై వైసిపి నాయకులు కత్తులు, రాడ్లతో దాడి చేశారు. సర్పంచ్‌ కోనసూరమ్మ అనుచరులే దాడి చేశారని బాధితుడు ఆరోపించారు. సర్పంచ్‌ కుమారుడి భూ ఆక్రమణలపై స్పందనలో ఫిర్యాదు చేసినందునే తనపై దాడి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడిన ఆదినారాయణ తగరపువలస ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.