DailyDose

ఏపీ హైకోర్టులో టీడీపీ నేతలకు బిగ్ రిలీఫ్-TNI నేటి తాజా వార్తలు

ఏపీ హైకోర్టులో టీడీపీ నేతలకు బిగ్ రిలీఫ్-TNI నేటి తాజా వార్తలు

*  ఏపీ హైకోర్టులో టీడీపీ నేతలకు బిగ్ రిలీఫ్

చిత్తూరు జిల్లా పుంగనూరు, అన్నమయ్య జిల్లా అంగళ్లులో నమోదైన కేసులలో టీడీపీ నేతలకు ఊరట లభించింది. ఈ కేసుల్లో మాజీ మంత్రి దేవినేని ఉమా , పీలేరు టీడీపీ ఇంఛార్జ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, చంద్రగిరి టీడీపీ ఇంఛార్జ్ పులివర్తి నానిలకు ముందస్తు బెయిల్ మంజూరు అయ్యింది. అలాగే పుంగనూరు టీడీపీ ఇంఛార్జ్ చల్లా బాబు పై నమోదైన 7 కేసుల్లో నాలుగింటిలో ముందస్తు బెయిల్ రాగా.. మరో మూడు కేసుల్లో బెయిల్‌ను హైకోర్టు తిరస్కరించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన ముగ్గురు నేతలు నాలుగు వారాల పాటు అన్నమయ జిల్లాకు వెళ్లకూడదని ఆదేశింది. ప్రతి ఆదివారం కర్నూల్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని షరతులు విధించింది. మరోవైపు పుంగనూరు, అంగళ్లు సంఘటనల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పై కూడా కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాను ముందస్తు బెయిల్‌కు దాఖలు చేసేది లేదని టీడీపీ అధినేత తేల్చి చెప్పారు. తనకి సంబంధం లేకపోయినా తనపై కేసులు నమోదు చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై దాడిచేసి తనపైనే కేసులు నమోదు చేశారని చంద్రబాబు, టీడీపీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాజెక్టుల పర్యటనల్లో భాగంగా చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో పర్యటించారు. ఈ క్రమంలో పుంగనూరు, అంగళ్లులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. పుంగనూరులో పోలీసులపై రాళ్లు రువ్వి, వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలు అయ్యాయి.. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ నేతలు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

అనంతరపురంలో సెల్ టవర్ ఎక్కిన ఆర్ఎంపీ డాక్టర్

 ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో ఓ ఆర్ఎంపీ డాక్టర్ సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. పోలీసులు పట్టించుకోవడం లేదంటే ఆరోపించాడు. విషయం ఏంటంటే.. ఆర్ఎంపీడాక్టర్ సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుున్నాడు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ వారు పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటన అనంతపురంలోని పుట్లూరు మండలం కొండాపూర్ లో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ మీడియాతో ఆసక్తికర విషయాలు

తెలంగాణలో రోజు రోజుకు ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీ నాయకులు తాము ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే విజయం సాధిస్తామనే ధీమాలో ఉంటున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ మీడియాతో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇటీవలే కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో రేఖా నాయక్ పేరు లేకపోవడంతో కాస్త ఆగ్రహానికి గురైంది.ఇప్పటికే రేఖానాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధం అయింది. తాజాగా ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. కచ్చితంగా తాను  కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాను ఎమ్మెల్యే రేఖానాయక్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పదవీ కాలం ముగిసే వరకు బీఆఱ్ఎస్ లో కొనసాగుతాను. కచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాను. బీఆర్ఎస్ నన్ను పక్కకు పెట్టింది. కాంగ్రెస్ నుంచే వచ్చాను.. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నాను. ఇంకా నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను. ఏ పార్టీలోకి వెళ్లలేదని.. ఎమ్మెల్యే పీరియడ్ పూర్తి కాగానే కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ఎమ్మెల్యే రేఖానాయక్ స్పష్టం చేశారు.

తెలంగాణ వ్యాప్తంగా 10 లక్షల బోగస్ ఓట్లు అందులో సగం హైదరాబాద్ లోనే

తెలంగాణ వ్యాప్తంగా 10 లక్షల బోగస్ ఓట్లను ఎన్నికల సంఘం తొలగించగా.. ఇందులో మెజారిటీ ఓట్లు హైదరాబాద్, దాని చుట్టు పక్కల నియోజకవర్గాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. నకిలీ ఓట్లు ఎక్కువగా కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, ఎల్బీ నగర్ నియోజకవర్గాల పరిధిలోనే వెలుగు చూశాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 50వేల దొంగ ఓట్లు బయటపడ్డాయి.హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి, కరీంనగర్, నిజామాబాద్ అర్బన్ లో ఎక్కువ నకిలీ ఓట్లను గుర్తించినట్టు ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ దీనిపై వివరాలు వెల్లడించారు. ‘‘ఎలక్టోరల్ జాబితా నుంచి తొలగించడానికి కొన్ని ప్రధాన అంశాలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. ఒకే పేరుతో ఒకటికి మించిన ఓట్లు, ఒకే పేరు మాదిరిగా ఉండడాన్ని సిస్టమ్ గుర్తించడం లేక వ్యక్తులు, అధికారులు, రాజకీయ పార్టీలు మా దృష్టికి తీసుకువచ్చిన సందర్భాల్లో.. అప్పుడు ఓటరు పేరు, వయసు, జెండర్, చిరునామా ఒకే రకంగా ఉన్నాయా? లేక భిన్నంగా ఉన్నాయా? అన్నది చెక్ చేస్తాం.ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ అయిన ఓటర్లు ఫామ్ 8 రూపంలో బదిలీకి దరఖాస్తు చేసుకోవాలి. కొత్త ప్రాంతంలో ఓటరు పేరు చేర్చినప్పుడే, పాత ప్రాంతంలోనూ వారి పేరు తొలగించడం జరుగుతుంది. నకిలీ ఓట్ల తొలగింపునకు ఒక సరైన విధానాన్ని అనుసరిస్తాం’’అని వికాస్ రాజ్ వివరించారు.

కాంగ్రెస్ పార్టీది ఫ్రస్టేషన్‌ సభ : కేటీఆర్

చేవేళ్లలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది డిక్లరేషన్ సభ కాదు.. ఫ్రస్టేషన్‌ సభ అన్నారు మంత్రి కేటీఆర్. అధికారం రానే రాదనే ఫ్రస్టేషన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆ సభ నిర్వహించిందంటూ ఎద్దేవా చేశారు. కర్నాటకలో కనీసం రేషన్ ఇవ్వలేని కాంగ్రెస్.. తెలంగాణ వచ్చి డిక్లరేషన్ ఇస్తే నమ్మేదెవరు అంటూ ట్వీట్ చేశారు. గాడ్సేనే గెలుస్తాడన్న గ్యారెంటీ లేదు.. మీ 12 గ్యారెంటీలకు విలువ ఎక్కడిదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట విజన్‌లేని కాంగ్రెస్ ఇచ్చిన డజన్ హామీలు గాలిలో దీపాలేనని చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. స్వాతంత్రం వచ్చిన 75ఏళ్ల తర్వాత కూడా ఎస్సీలు, ఎస్టీలు వెనకబడి ఉన్నారంటే దానికి కారణం ప్రధాన దోషి కాంగ్రెస్ పార్టీయేనన్నారు. దళిత, గిరిన బిడ్డలకు కాంగ్రెస్ చేసిన దశాబ్దాల పాపం.. ఆ పార్టీని మరో వందేళ్లయినా శాపంలా వెంటాడుతూనే ఉంటుందని హెచ్చరించారు. కర్నాటకలో నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీకి పాలించే ఎబిలిటీ లేదు.. ప్రజల్లో క్రెడిబిలిటి లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం అంటేనే దేశానికే ఓ పరిపాలనా పాఠం అన్న కేటీఆర్.. ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చని పార్టీ కాంగ్రెస్ అయితే.. ఇవ్వని హామీలెన్నో అమలు చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీది అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణలో బీజేపీకి చరిత్రలేదు, కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదన్నారు. చరిత్ర, భవిష్యత్తు ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనన్నారు మంత్రి కేటీఆర్.

తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో రగడ

తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో రసాభాస చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు ఘర్షణకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాలు.. టీడీపీకి చెందిన కౌన్సిలర్ రాబర్ట్.. ఇటీవల వైసీపీ గూటికి చేరారు. అయితే మున్సిపల్ స్థలాన్ని అక్రమించారని టీడీపీ కౌన్సిలర్లు ఆరోపించారు. ఈ క్రమంలోనే రాబర్ట్‌ను మూడు మీటింగ్‌లకు సస్పెండ్ చేయాలని టీడీపీ ప్రతిపాదించింది. ఇందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అయితే దీనిని రాబర్ట్‌తో పాటు వైసీపీ కౌన్సిలర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే వైసీపీ  కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ పోడియాన్ని ముట్టడించారు. దీంతో వైసీపీ కౌన్సిలర్ల తీరుపై మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

యావత్ తెలంగాణ గుండె చప్పుడు ఒక్కటే: రేవంత్

కాంగ్రెస్‌ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్​పై రాష్ట్రంలో వాడివేడి చర్చ జరుగుతోంది. తాజాగా ఈ డిక్లరేషన్​పై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించిన విషయం తెలిసిందే. డిక్లరేషన్ సభ కాదు.. అధికారం రానే రాదనే ఫ్రస్ట్రేషన్ సభగా కేటీఆర్‌ అభివర్ణించారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్‌…. కాంగ్రెస్‌ డిక్లరేషన్‌పై ట్విటర్‌లో విమర్శించారు. దీనిపై రేవంత్ రెడ్డి రీ ట్వీట్ చేశారు.మా డిక్లరేషన్ దళిత గిరిజన జీవితాలలో గుణాత్మక మార్పునకు కన్ఫర్మేషన్ అంటూ కేటీఆర్ ట్వీట్​కు బదులిచ్చారు. ‘మా డిక్లరేషన్ … దళితుడ్ని సీఎం చేస్తానని మోసం చేయడం లాంటిది కాదు. ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేయడం లాంటిది కాదు. గిరిజన రిజర్వేషన్లు 12 శాతం చొప్పున పెంచుతానని మోసం చేయడం లాంటిది కాదు. మద్ధతు ధర అడిగిన గిరిజన రైతులను బందిపోట్ల కంటే ఘోరంగా బేడీలు వేసి అవమానించడం లాంటిది కాదు. నేరెళ్ళ ఇసుక దోపిడీని ప్రశ్నించిన దళిత – బీసీ బిడ్డల పై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం లాంటిది కాదు. అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.తమ డిక్లరేషన్… దళిత – గిరిజనులకు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన అసైన్డ్ భూములను లాక్కుని రియల్ ఎస్టేట్ మాఫియాకు అమ్ముకోవడం లాంటిది కాదని రేవంత్ స్పష్టం చేశారు అందుకే… యావత్ తెలంగాణ గుండె చప్పుడు ఒక్కటేనని.. అదే “కేసీఆర్ ఖేల్ ఖతం – బీఆర్ఎస్ దుఖాన్ బంద్” అని అన్నారు.

ఎన్టీఆర్ స్మారక నాణెం’ విడుదల చేసిన రాష్ట్రపతికి కృతజ్ఞతలు: చంద్రబాబు 

‘ఎన్టీఆర్ స్మారక నాణెం’ విడుదల చేసిన భారత రాష్ట్రపతికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తెలుగువారందరికీ ఈ కార్యక్రమం ఎంతో గర్వకారణమన్నారు. భిన్నాభిప్రాయాలు, హద్దులు, రాజకీయ అనుబంధాలకు అతీతంగా ఎన్టీఆర్‌ తెలుగువారందరినీ ఏకం చేశారని కొనియాడారు.

కాంగ్రెస్ నేతలకు మర్రి జనార్ధన్ రెడ్డి వార్నింగ్

నాతో పెట్టుకొంటే కాల్చి పడేస్తానని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఓ సభలో ఆయన కాంగ్రెస్ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.తన సంగతి మీకు తెలియదన్నారు. తనకు పిచ్చిలేస్తే కాంగ్రెస్ నేతలను కాల్చిపడేస్తానని వ్యాఖ్యానించారు.తనతో పెట్టుకొంటే మీకే నష్టమని మర్రి జనార్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ నేతలు తనను రెచ్చగొడుతున్నారన్నారు. తనతో పెట్టుకోవద్దు.. తాను అన్ని కట్టెల్లో కాలి వచ్చినోడినన్నారు.తాను పీకిపడేస్తే చెయ్యి వెళ్లిపోతుందని వ్యాఖ్యానించారు.తన కేడర్ కు చెబితే కాంగ్రెస్ నేతలు ఏ ఒక్కరూ కూడ గ్రామాల్లో తిరగనివ్వరని మర్రి జనార్థన్ రెడ్డి చెప్పారు.10 ఏళ్లలో నాగర్ కర్నూల్ లో అభివృద్దిని గ్రామాల్లో వివరిస్తూ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు. రెండు రోజులుగా పాదయాత్ర సాగుతుంది. ఆదివారంనాడు రాత్రి తెలకపల్లి మండలం బొప్పల్లి గ్రామంలో పాదయాత్ర చేరిన సందర్భంగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి ప్రసంగించారు. ఈ సభలో కాంగ్రెస్ నేతలపై ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు చేశారు. తనతో పెట్టుకోవద్దని కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రసంగిస్తూ తనకు పిచ్చిలేస్తే కాంగ్రెస్ నేతలను కాల్చిపడేస్తానని వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి.2014, 2018 ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుండి మర్రి జనార్థన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. మరోసారి ఇదే స్థానం నుండి ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ నెల 21న కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో మర్రి జనార్థన్ రెడ్డికి చోటు దక్కింది. ఇదిలా ఉంటే నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు పోటీ పడుతున్నారు. ఇద్దరు నేతలు కాంగ్రెస్ టిక్కెట్టు కోసం తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గత 10 ఏళ్లలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ది కార్యక్రమాలను వివరించేందుకు పాదయాత్రను రెండు రోజుల క్రితం మర్రి జనార్థన్ రెడ్డి ప్రారంభించారు. నెల రోజుల పాటు ఈ పాదయాత్రను మర్రి జనార్థన్ రెడ్డి నిర్వహించనున్నారు.

వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం భక్తులతో రద్దీగా మారింది. శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకొని స్వామి వారి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. రాజేశ్వరీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి ప్రీతికరమైన ‘కోడె మొక్కు’ నైవేద్యాలు సమర్పించారు. అంచనాలకు విరుద్ధంగా, శ్రావణ మాసం మొదటి రోజున యాత్రికుల రద్దీ సాధారణంగా ఉంది. జులై 29 నుంచి ఆగస్టు 28 వరకు జరిగే ఈ నెల రోజుల ఉత్సవాల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.