NRI-NRT

ఆ నరహంతకుడు శవమై తేలాడు

ఆ నరహంతకుడు శవమై తేలాడు

అమెరికా (USA)లోని మైన్‌ రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న భీకర కాల్పుల ఘటన (Mass Shooting) నిందితుడు రెండు రోజుల తర్వాత శవమై కన్పించాడు. శుక్రవారం రాత్రి అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించి ధ్రువీకరించారు. దీంతో రెండు రోజుల గాలింపు ఆపరేషన్‌ను పోలీసులు ముగించగా.. నిందితుడి మృతితో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

అమెరికా కాలమానం ప్రకారం.. గత బుధవారం రాత్రి మైన్‌ రాష్ట్రంలోని లెవిస్‌టన్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. స్థానికంగా ఓ రెస్టారెంట్లో, ‘టెన్‌ పిన్‌ బౌలింగ్‌’ వేదిక వద్ద ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో కనీసం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 13 మంది గాయపడ్డారు. నిందితుడిని 40 ఏళ్ల రాబర్ట్‌ కార్డ్‌గా గుర్తించారు.

ఘటన తర్వాత రాబర్ట్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. నిందితుడి వద్ద ఆయుధం ఉండటంతో.. మళ్లీ కాల్పులకు తెగబడే అవకాశముందని పోలీసులు అనుమానించారు. లెవిస్‌టన్‌ నుంచి లిస్బన్‌ వరకు ప్రజలు, వ్యాపారులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కాల్పుల సమయంలో నిందితుడి ఫొటోను కూడా విడుదల చేశారు. అందులో అతడు చేతిలో తుపాకీతో కన్పించాడు. దీంతో లెవిస్‌టన్‌, లిస్బన్‌ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. రెండు రోజుల పాటు నిద్రలేని రాత్రులు గడిపారు.

ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి లిస్బన్‌లో ఓ రీసైక్లింగ్‌ సెంటర్‌ సమీపంలోని చెట్ల పొదల్లో ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని రాబర్ట్‌ కార్డ్‌గా గుర్తించారు. బుల్లెట్ గాయంతో అతడు మరణించినట్లు పోలీసులు తెలిపారు. అయితే, రాబర్ట్‌ ఆత్మహత్య చేసుకున్నాడా? అనేదానిపై మాత్రం స్పష్టతనివ్వలేదు. గతంలో కార్డ్‌ ఇదే రీసైక్లింగ్‌ సెంటర్‌లో కొంతకాలం పనిచేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. తాజా పరిణామాలపై మైన్‌ గవర్నర్‌ జానెత్‌ మిల్స్‌ స్పందిస్తూ.. ‘‘రాబర్ట్‌ కార్డ్‌తో ఇక ఎవరికీ ముప్పు ఉండదని తెలిసి మేం ఊపిరి పీల్చుకున్నాం’’ అని అన్నారు.

రాబర్ట్‌ కార్డ్‌ గతంలో ఆర్మీ రిజర్వులో ఒక శిక్షణ కేంద్రంలో ఆయుధ వినియోగ శిక్షకునిగా ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇంతకుముందు గృహహింస కేసులో అరెస్టయి విడుదలయ్యాడని, మానసిక సమస్యలతో వేసవిలో రెండువారాల పాటు చికిత్స పొందాడని తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z