Business

టీసీఎస్‌ పై కేంద్రానికి ఉద్యోగుల ఫిర్యాదు

టీసీఎస్‌ పై కేంద్రానికి ఉద్యోగుల ఫిర్యాదు

దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. ఇటీవల 2000 మంది ఉద్యోగులను టీసీఎస్ ట్రాన్స్‌ఫర్ చేసింది. బదిలీ చేసిన ప్రాంతానికి వెళ్లి విధుల్లో చేరేందుకు ఉద్యోగులకు 2 వారాల సమయం ఇచ్చింది. ఒక వేళ వారికి కేటాయించిన కొత్త స్థానాలకు వెళ్లని ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

ఇప్పటికే 2 వేల మంది ఉద్యోగులకు టీసీఎస్ ట్రాన్స్‌ఫర్ నోటీసులను ఇచ్చింది. ఈ ఉద్యోగులు వేరేవేరే ప్రాంతాలకు బదిలీ కావడంతో వారికి రెండు వారాలు గడువు ఇచ్చింది. దీంతో పాటు ఉద్యోగులకు ప్రయాణ, వసతి ఖర్చులను కూడా ఇవ్వనుంది. కంపెనీ ఆర్డర్ ప్రకారం ట్రాన్స్‌ఫర్ చేసిన చోటుకు వెళ్లకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఆగస్టు నెలాఖరు నుంచి టీసీఎస్ ఉద్యోగులకు ఈ రీలొకేషన్ నోటీసులు అందాయని మనీ కంట్రోల్ నివేదిక పేర్కొంది.

ఇలా ఆకస్మికంగా బదిలీ చేయడంపై పలువురు ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. దాదాపుగా 180 మంది ఉద్యోగులు ఐటీ ఉద్యోగుల యూనియన్ NITESకి ఫిర్యాదు చేశారు. సరైన నోటీసు లేకుండా, సంప్రదింపులు లేకుండా తనను బదిలీ చేసిన చోటుకు వెళ్లమని కంపెనీ బలవంతం చేస్తుందని ఫిర్యాదు చేశారు. ఇది ఉద్యోగులను, వారి కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగుల తరుపున ఐటీ యూనియన్.. అనైతిక బదిలీ పద్దతులపై టీసీఎస్‌పై కార్మిక-ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది.

కోవిడ్ మహమ్మారి సమయంలో అన్ని టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ సౌకర్యాన్ని కల్పించింది. దాదాపుగా రెండేళ్ల నుంచి ఉద్యోగులు ఇదే విధానంలో పనిచేశారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడటంతో అన్ని సంస్థలు కూడా ఉద్యోగులను ఆఫీసులకు రమ్మంటున్నాయి. కొన్ని కంపెనీలు హైబ్రీడ్ మోడ్‌లో పనిచేయాలని చెబుతున్నాయి. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు భవిష్యత్తు సంఘర్షణలో ఉంది. ఇప్పటికే పలు ప్రపంచ దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో తమ ఉద్యోగులను తొలగించాయి. ఇలాంటి భయాల నేపథ్యంలో ఐటీ ఉద్యోగులను తప్పనిసరిగా ఆఫీసుకు రావాలని, లేకపోతే చర్యలు ఉంటాయని సంస్థలు స్పష్టంగా చెబుతున్నాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z