Politics

ఏపీలో దొంగ ఓట్ల చేర్పులపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు

ఏపీలో దొంగ ఓట్ల చేర్పులపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల చేర్పులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)కి ఫిర్యాదు చేసినట్లు తెదేపా(TDP) రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. తెదేపా ఓట్లే లక్ష్యంగా ఓట్లు తొలగించడంపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అచ్చెన్నాయుడు నేతృత్వంలోని తెదేపా నేతల బృందం మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసింది. కనకమేడల రవీంద్రకుమార్‌, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్‌, నిమ్మల రామానాయుడు, బొండా ఉమా తదితరులు ఈసీని కలిసిన వారిలో ఉన్నారు.

అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ‘‘రాజకీయ ఒత్తిళ్లతో తప్పుడు ఓటర్ల జాబితా తయారు చేస్తున్నట్లు ఈసీకి ఫిర్యాదు చేశాం. ఈసీ ఆదేశాలను అధికారులు పాటించడం లేదు. దేశంలో ఏ ఎన్నికలు వచ్చినా సరే ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకుంటారు. కానీ ఏపీలో సీఎం జగన్‌ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వారి కనుసన్నల్లోనే ఎన్నికలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఈసీకి స్పష్టంగా చెప్పాం. అక్టోబర్‌ 27 వరకు దేశమంతా ఓటరు వెరిఫికేషన్‌ ప్రక్రియ జరిగింది. ఏపీలో ఆ విధానం పూర్తిగా జరగలేదు. దానికి ఆధారాలతో సహా ఈసీకి వివరించాం. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది ఫారమ్‌ 6, ఫారమ్‌ 7, ఫారమ్‌ 8ని అప్లై చేశారు. వీటిపై ఎన్నికల సంఘం దృష్టి సారించలేదు’’ అని అచ్చెన్నాయుడు తెలిపారు.