Politics

వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తా

వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తా

బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా ‘మిగ్‌జాం (Michaung Cyclone)’ బలపడింది. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లతో సీఎం జగన్‌ (CM Jagan) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యలపై కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. ఎస్పీలు, కలెక్టర్లకు ఇది ఒక సవాలు లాంటిదని, ఎక్కడా ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అత్యవసర పనుల కోసం జిల్లాకు రూ.2 కోట్లు విడుదల చేయాలని కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

రైతులకు అండగా నిలబడాలి
రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా అండగా నిలబడాలని అధికారులకు జగన్‌ సూచించారు. పంట కోయని చోట్ల అలాగే ఉంచేలా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే కోసినట్లయితే ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఆదివారం ఒక్కరోజే 97 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, ఇప్పటి వరకు 6.5 లక్షల టన్నుల ధాన్యాన్ని భద్రపరిచామని అధికారులు సీఎంకి వివరించారు. వర్షాలకు ఇళ్లు, గుడిసెలు దెబ్బతింటే రూ.10 వేలు ఆర్థిక సాయం అందించాలని సీఎం ఆదేశించారు. తుపాను తగ్గిన తర్వాత పంట నష్టం అంచనాలు రూపొందించి పరిహారం ఇవ్వాలని సూచించారు.

తుపాను ప్రభావం తగ్గిన తర్వాత వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని జగన్‌ తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వేగంగా తరలించాలని, ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ సేవలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామ సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థను సమర్థంగా వినియోగించుకోవాలన్నారు. క్యాంపుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా బాధితులకు సదుపాయాలు కల్పించాలని, క్యాంప్‌లకు వచ్చిన వారికి ఒక్కొక్కరికి రూ.వెయ్యి, కుటుంబానికికైతే రూ.2,500 చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. బాధితులకు బియ్యం సహా కూరగాయలు, సరకులు అందించాలని అధికారులకు జగన్‌ దిశానిర్దేశం చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z