Business

గూగుల్ మాజీ రిక్రూటర్ చెప్పిన రహస్యాలు

గూగుల్ మాజీ రిక్రూటర్ చెప్పిన  రహస్యాలు

ఏదైనా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు చాలా మంది గాబరా పడిపోతుంటారు. ఎలాంటి ప్రశ్నలు అడుగుతారోనని ఆందోళన చెందుతుంటారు. అందుకోసం యూట్యూబ్‌లో వీడియోలు చూస్తుంటారు. కొన్ని సాధారణ ప్రశ్నలకు ఎలా సమాధానం ఇవ్వాలో ముందే సన్నద్ధమవుతారు. అయితే, ఇంటర్వ్యూకి (Job Interview) సిద్ధమయ్యేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కీలక విషయాలను గూగుల్‌ మాజీ రిక్రూటర్‌, కంటిన్యూవమ్‌ సీఈఓ నోలన్‌ చర్చ్‌ ఇటీవల ఓ కార్యక్రమంలో వెల్లడించారు.

చాలా మంది పెద్దగా హోమ్‌వర్క్‌ చేయకుండానే ఇంటర్వ్యూకి (Job Interview) వచ్చేస్తుంటారని నోలన్‌ చెప్పారు. కంపెనీ వివరాలు, ఉద్యోగంలో వారు నిర్వర్తించాల్సిన పాత్రపై లోతైన అవగాహన లేకుండానే వస్తుంటారని తెలిపారు. ఇది ఉద్యోగానికి ఎంపిక కావడానికి పెద్ద అడ్డంకి అని వెల్లడించారు. ఏ కంపెనీలోనైనా కొన్ని సాధారణ ప్రశ్నలు ఉంటాయని తెలిపారు. ‘ఈ ఉద్యోగంలో మీకు ఎదురయ్యే సవాళ్లేంటో చెప్పగలరా?’ వంటి ప్రశ్నలు చాలా సాధారణం అన్నారు. ఇది కూడా చెప్పలేకపోతే ఉద్యోగంలో వారికుండే అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, సవాళ్లను అధిగమించడానికి వారు సన్నద్ధంగా లేరనే విషయం స్పష్టమవుతుందని వివరించారు.

మరోవైపు కొంతమంది ఇంటర్వ్యూలో (Job Interview) ఏదో చెబుతున్నట్లు నమ్మించే ప్రయత్నం చేస్తుంటారని నోలన్‌ చెప్పారు. ఏ ప్రశ్న అడిగినా అవే సమాధానాలను పునరావృతం చేస్తుంటారని వివరించారు. చాలా మాటలు చెబుతారని.. కానీ, దాంట్లో ఎలాంటి అర్థం ఉండదని తెలిపారు. ఇది కూడా అభ్యర్థులకు ఉద్యోగానికి ఎంపిక కావడానికి పెద్ద అవాంతరంగా నిలుస్తుందని పేర్కొన్నారు. నిరంతరం కొత్త విషయం నేర్చుకోగలమనే నమ్మకం కలిగించిన వారే తమ దృష్టిలో ఎంపిక చేయడానికి సరైన అభ్యర్థులని అభిప్రాయపడ్డారు.

ఈ క్రమంలో తన అనుభవంలోని ఓ సంఘటనను నోలన్‌ గుర్తు చేసుకున్నారు. ఓసారి కంపెనీ ‘చీఫ్‌ రెవెన్యూ ఆఫీసర్‌’ ఉద్యోగానికి ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చిందని తెలిపారు. వచ్చిన అభ్యర్థిని.. తమ కంపెనీని ‘బిజినెస్‌-టు-బిజినెస్‌’, ‘సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌’ సంస్థగా తీర్చిదిద్దడానికి ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తారని అడిగినట్లు వెల్లడించారు. దీనికి అభ్యర్థి ఒక సమగ్రమైన వ్యూహాన్ని తమ ముందు ఉంచినట్లు తెలిపారు. అది తమకు ఒక పెద్ద మాస్టర్‌క్లాస్‌లా అనిపించిందని పేర్కొన్నారు. అలాంటి వారినే తాము ఆశిస్తామని తెలిపారు.

ఏదైనా ఇంటర్వ్యూకి (Job Interview) వెళ్లేటప్పుడు ఒకసారి ఆ కంపెనీ వెబ్‌సైట్‌, లింక్డిన్‌ పేజీని పరిశీలించాలని నోలన్‌ సూచించారు. అలాగే కంపెనీ గమ్యం, లక్ష్యాలను తెలుసుకోవాలన్నారు. ఉద్యోగంలో నిర్వర్తించాల్సిన పాత్ర, కావాల్సిన నైపుణ్యాలపై కూడా అవగాహన ఉండాలన్నారు. వీలైతే ఇంటర్వ్యూలో ‘మీ లింక్డిన్‌ ప్రొఫైల్‌ చూసినప్పుడు’.. ‘మీరు గతంలో వీటిని ఉపయోగించారని..’ వంటి వాక్యాలతో ప్రశ్నలు అడగానికి కూడా సన్నద్ధమవ్వాలని తెలిపారు. ఫలితంగా కంపెనీపై పూర్తి అవగాహనతో ఉన్నారనే విషయం అర్థమవుతుందని వివరించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z