Videos

సాధారణంగా ఇలాంటి ఆఫర్లకు పెద్దగా జనాలు ఏం వస్తారులే..?

సాధారణంగా ఇలాంటి ఆఫర్లకు పెద్దగా జనాలు ఏం వస్తారులే..?

వెర్రి వేయి విధాలు అన్నారు పెద్దలు. ఆ సామెతను రుజువు చేయడానికి ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వేలాది వీడియోలే సాక్ష్యం. ఇలాంటిదే జపాన్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతున్నది. జపాన్‌కు చెందిన ఓ హోటల్‌.. తమ వద్దకు వచ్చే కస్టమర్లకు పుష్టిగా తిండి పెట్టడమే కాదు.. రెండు చెంపలు వాయించే సర్వీస్‌ కూడా తీసుకొచ్చింది. అయితే ఇదేం ఉత్త పుణ్యానికే అనుకుంటే మీరు నూడుల్స్‌లో కాలేసినట్టే. చెంపలు ఎర్రబడేలా వాయించినందుకు కూడా అక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారు. జనం కూడా ఇదేదో బాగుందని, డబ్బులిచ్చి మరీ చెంపలు ఎర్రబడేదాకా కొట్టించుకుంటున్నారు.

ప్రపంచంలో ఎక్కడైనా రెస్టారెంట్లు అంటే తమ వద్ద తక్కువ ధరకే ఆఫర్లు ఉన్నాయనో, ఇతర హోటల్స్‌తో పోలిస్తే తాము మంచి ఆహారాన్ని అందిస్తామనో ఆఫర్‌ ఇస్తాయి. కానీ జపాన్‌లోని నగోయా నగరంలో ఉన్న సాచిహోకో-యా ఇకజయా అనే రెస్టారెంట్‌లో మాత్రం టిఫిన్స్‌, మీల్స్‌, స్నాక్స్‌తో పాటు 300 యెన్‌ (2 డాలర్లు) లు చెల్లిస్తే చెంపదెబ్బలు కూడా లభిస్తాయి. అందమైన అమ్మాయిలు వచ్చి కస్టమర్ల రెండు చెంపలూ వాచేదాకా వాయిస్తారని ఆఫర్‌ ఇచ్చింది. ఒకవేళ కస్టమర్లు తమకు ఆ అందమైన నొప్పి ఇంకా కావాలంటే అందుకు అదనంగా చెల్లించాలి.

ఎంజాయ్‌ చేస్తున్న కస్టమర్లు..

సాధారణంగా ఇలాంటి ఆఫర్లకు పెద్దగా జనాలు ఏం వస్తారులే..? అనుకుంటే పొరబడ్డట్టే. ఈ ఆఫర్‌ పెట్టాక రెస్టారెంట్‌కు గిరాకీ బాగా పెరిగిందట. అమ్మాయిల హస్త ముద్రల కోసం కస్టమర్లు ఎగబడుతున్నారట. కొంతమందైతే 500 యెన్‌ (3.40 డాలర్లు) మరీ చెంపలు వాయించుకుంటున్నారని స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఎవరైనా చిన్నగా చేయితో తడిమితేనే అగ్గిమీద గుగ్గిల్లమయ్యే వాళ్లు అమ్మాయిలు అలా కొడుతుంటే మాత్రం తెగ ఎంజాయ్‌ చేస్తున్నారట. పలువురు కస్టమర్లు అయితే తమ బాధలనన్నింటినీ మరిచిపోయి ఈ వాయింపును తెగ ఆస్వాదిస్తున్నారని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z