Business

స్విగ్గీ యూజర్‌కు వింత అనుభవం-వాణిజ్య వార్తలు

స్విగ్గీ యూజర్‌కు వింత అనుభవం-వాణిజ్య వార్తలు

స్విగ్గీ యూజర్‌కు వింత అనుభవం 

ఇంట్లో నిత్యావసర వస్తువులు నిండుకుంటే ఒకప్పుడంటే బయటికెళ్లాల్సి వచ్చేది. గ్రాసరీ డెలివరీ యాప్స్‌ పుట్టుకొచ్చాక ఆర్డర్‌ పెట్టిన కాసేపటికే సరకులు నేరుగా ఇంటికే వచ్చేస్తున్నాయి. ఇలానే ఆర్డర్‌ పెట్టిన ఓ వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది. ఆర్డర్‌ పెట్టడానికి ప్రయత్నించి విఫలమైన అనంతరం.. ఒకటి తర్వాత ఒకటి వరుసగా ఆరు ఆర్డర్లు తలుపు తట్టడంతో ఆశ్చర్యపోవడం అతడి వంతైంది. తనకెదురైన ఈ అనుభవాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. గురుగ్రామ్‌కు చెందిన ప్రణయ్‌ లోయా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో కొన్ని సరకులను ఆర్డర్‌ పెట్టాడు. డబ్బులు కట్‌ అయినప్పటికీ.. ఆర్డర్‌ స్టేటస్‌ క్యాన్సిల్ అని చూపించింది. మరోసారి ఆర్డర్‌ పెట్టినప్పడూ అదే జరిగింది. కొన్ని వస్తువులు తొలగించి క్యాష్‌ ఆన్‌ డెలివరీ పెట్టినా ఫలితం లేకపోయింది. దీంతో తన ప్రయత్నాలు విరమించుకున్నాడు. తర్వాత జెప్టో యాప్‌ ఓపెన్‌ చేసి తనకు కావాల్సిన ఐటెమ్స్‌ను ఆర్డర్‌ పెట్టుకున్నాడు.కట్‌ చేస్తే.. కాసేపటికి ప్రణయ్‌ ఫోన్‌ మోగడం ప్రారంభమైంది. ఒకటి తర్వాత ఒకటిగా కాల్స్‌ వస్తూనే ఉన్నాయి. తీరా డోర్‌ ఓపెన్‌ చేస్తే ఒకరి తర్వాత ఒకరు స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్ డెలివరీ బాయ్స్‌ గుమ్మం ముందు దర్శనమిచ్చారు. కాసేపటికే 20 లీటర్ల పాలు, 6 కేజీల దోశ పిండి, 6 ప్యాకెట్ల పైనాపిల్‌ అతడి చేతికొచ్చాయి. ‘వీటితో నేనేం చేసుకుంటాను’ అంటూ ఎక్స్‌ వేదికగా తనకెదురైన అనుభవాన్ని పోస్ట్‌ చేశాడు. కొన్ని గంటల్లోనే ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. స్విగ్గీలో సాంకేతిక లోపం కారణంగా ఇలా జరిగినట్లు తెలుస్తోంది. ప్రణయ్‌ పెట్టిన పోస్ట్‌పై పలువురు కామెంట్లు పెట్టారు. తనకూ ఓసారి ఇలాంటి అనుభవమే ఎదురైందని ఒకరు కామెంట్‌ పెట్టగా.. వచ్చిన ఫుడ్‌ను పేదలకు పంచిపెట్టండి అంటూ మరొకరు సూచించారు.  ఇంకొకరైతే మొత్తానికి ఒక్క పోస్ట్‌తో ఫేమస్‌ అయ్యావ్‌ అంటూ కామెంట్‌ చేశారు.

సింపుల్ ఎనర్జీ కొత్త ఈవీ స్కూటర్

దేశీయ ఎలక్ట్రిక్ వాహన స్టార్టప్ కంపెనీ సింపుల్ ఎనర్జీ తన రెండవ ఈవీ టూవీలర్ మోడల్ డాట్‌వన్‌ను శుక్రవారం విడుదల చేసింది. ఈ స్కూటర్ ఒక్కసారి చార్జ్ చేస్తే 151 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ విభాగంలో అత్యధిక దూరం ప్రయాణించగల స్కూటర్ ఇదేనని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ కోసం ముందుగా బుక్ చేసుకున్న వినియోగదారులకు డాట్‌వన్‌ రూ. 99,999 ప్రారంభ ధరతో లభిస్తుంది. ఇది ప్రత్యేక ఆఫర్ మాత్రమేనని, స్టాక్ ఉన్నంతవరకేనని కంపెనీ పేర్కొంది. కొత్త ధరను వచ్చే ఏడాది జనవరిలో ప్రకటిస్తామని, ఇప్పటి ధర కంటే కొంత ఎక్కువ ఉంటుందని కంపెనీ వెల్లడించింది.డాట్‌వన్ మోడల్ స్కూటర్ దేశీయంగా తయారైందని, ఇందులో ఫిక్స్‌డ్ బ్యాటరీతో ఒక వేరియంట్‌ను విడుదల చేయనున్నట్టు సింపుల్ఎనర్జీ తెలిపింది. కేవలం 2.77 సెకన్లలో 0-40 కిలోమీటర్ల స్పీడ్ అందుకునే ఈ స్కూటర్ 750 వాట్స్ చార్జర్‌తో వస్తుంది. డెలివరీలు బెంగళూరులో ప్రారంభమవుతాయి. భవిష్యత్తులో ఇతర నగరాల్లోనూ అందించనున్నట్టు కంపెనీ వెల్లడించింది.

* జియోటీవీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో (Jio).. జియోటీవీ (JioTV) ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ప్రారంభించింది. జియో ప్రీపెయిడ్‌ యూజర్లు 14 ఓటీటీ యాప్స్‌ను వినియోగించుకునేలా సింగిల్ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ తీసుకొచ్చింది. ఇందుకోసం మూడు వేర్వేరు ప్రీపెయిడ్‌ ప్లాన్లను సైతం జియో లాంచ్‌ చేసింది. వేర్వేరు సబ్‌స్క్రిప్షన్లతో పనిలేకుండా ఒకే రీఛార్జిపై వివిధ ఓటీటీ సేవలను పొందేందుకు జియోటీవీ ప్రీమియం ప్లాన్‌ ఉపయోగపడనుంది.జియోటీవీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ కోసం 28 రోజులు, 84 రోజులు, 365 రోజుల కాలవ్యవధిపై మూడు ప్రీపెయిడ్‌ ప్లాన్లను జియో తీసుకొచ్చింది. వీటి ధరలను రూ.398, రూ.1198, రూ.4,498గా నిర్ణయించింది. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 2జీబీ డేటా, అపరిమిత కాల్స్‌ ఈ ప్లాన్లలో లభిస్తాయి. జియో సినిమా ప్రీమియం, డిస్నీ+ హాట్‌స్టార్‌, సోనీలివ్‌, జీ5, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (మొబైల్‌ ఎడిషన్‌), సన్‌ నెక్ట్స్‌ వంటి 14 ఓటీటీ యాప్స్‌ను వీక్షించొచ్చు. ఈ ప్లాన్లు కేవలం జియో యూజర్లకు మాత్రమే.ప్లాన్ల వారీగా వివరాలు చూస్తే.. రూ.398 సబ్‌స్క్రిప్షన్‌ కింద 12 ఓటీటీ యాప్స్‌ లభిస్తాయి. అదే రూ.1198,. రూ.4498 ప్లాన్ల కింద అయితే 14 ఓటీటీ యాప్స్‌ వస్తాయి. వార్షిక ప్లాన్‌ తీసుకోవాలనుకుంటే ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. డిసెంబర్‌ 16 నుంచి ప్లాన్స్‌ కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. జియో మొబైల్‌ నంబర్‌తో జియో టీవీ ప్రీమియం ఓటీటీ కంటెంట్‌ను పొందొచ్చు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సబ్‌స్క్రిప్షన్‌ను మైజియో యాప్‌ ద్వారా యాక్సెస్‌ చేయొచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్‌ను వినియోగించాలంటే నేరుగా జియో నంబర్‌తో లాగిన్‌ అవ్వొచ్చు. మై జియో యాప్‌లో కూపన్‌ సెక్షన్‌లోకి వెళ్లి జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ పొందొచ్చు.

కెమెరాతో ‘పోకో’ కొత్త ఫోన్‌

చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ ‘పోకో’ సీ65 (Poco C65) పేరిట మరో కొత్త ఫోన్‌ని లాంచ్‌ చేసింది. 5,000 mAh బ్యాటరీ సదుపాయంతో బడ్జెట్‌ ధరలో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్‌ స్టోరేజీని 128జీబీ నుంచి  మైక్రో ఎస్‌డీ కార్డు సాయంతో 256జీబీ వరకు పెంచుకోవచ్చు. పోకో కొత్త ఫోన్‌ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 4జీబీ+128జీబీ వేరియంట్‌ ధరను రూ.9,499గా కంపెనీ నిర్ణయించింది. 6జీబీ+128 జీబీ వేరియంట్‌ ధరను రూ.10,999గా పేర్కొంది. మ్యాట్‌ బ్లాక్‌, పాస్టెల్ బ్లూ.. వర్ణాల్లో ఈ ఫోన్‌ లభిస్తుంది. పోకో వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌ ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా కొనుగోలు చేయొచ్చని కంపెనీ ప్రకటించింది. ఐసీఐసీఐ డెబిట్‌/క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేసినవారికి రూ.1,000 డిస్కౌంట్‌ అందించనుంది. ఈఎంఐ అవకాశం కూడా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఆండ్రాయిడ్‌ 13 (Android 13) ఎమ్‌ఐయూఐ 14తో పనిచేస్తుంది. 6.74 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌ఈడీ స్క్రీన్‌ ఇస్తున్నారు. 90Hz రిఫ్రెష్‌ రేట్‌, 180Hz టచ్‌ సాంప్లింగ్‌ రేట్‌తో వస్తోంది. మీడియాటెక్‌ హీలియో జీ85 ప్రాసెసర్‌ ఇచ్చారు. వెనకవైపు 50ఎంపీ ప్రధాన కెమెరా, 2ఎంపీ మైక్రో కెమెరా ఇచ్చారు. వీడియో కాల్‌, సెల్ఫీ కోసం ముందుభాగంలో 8ఎంపీ కెమెరా ఇచ్చారు. 5,000 mAh బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్‌ 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. బ్లూటూత్‌ 5.3, జీపీఎస్‌, 3.5 ఎమ్‌ఎమ్ ఆడియో జాక్‌, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌ వంటి సదుపాయాలు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

*   ఐఫోన్లపై ప్రస్తుతం భారీ తగ్గింపు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం యాపిల్‌కు చెందిన ఐఫోన్లపై ప్రస్తుతం భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. యాపిల్ ప్రత్యేకమైన రిటైల్ స్టోర్ ‘ఇమాజిన్’ ద్వారా ఇయర్‌ఎండ్ సేల్‌లో ఐఫోన్లు తక్కువ ధరలో లభిస్తున్నాయి. ఐఫోన్ 14, ఐఫోన్ 15, ఐఫోన్ 15 Plus, ఐఫోన్ 15 Pro వంటి మోడళ్లపై ఇమాజిన్ స్టోర్‌లో డిస్కౌంట్ లభిస్తుంది. కొనుగోలు సమయంలో HDFC బ్యాంక్ కార్డులపై దాదాపు రూ.5000 వరకు తగ్గింపు ఉంది. అదనంగా నో-కాస్ట్ EMI ఆప్షన్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి.ఈ స్టోర్‌లో ఐఫోన్ 15 ని రూ. 72,503 కే కొనుగోలు చేయవచ్చు, దీని అసలు ధర రూ.79,900. కానీ HDFC బ్యాంక్ ద్వారా రూ.5000 తగ్గింపుతో పాటు ఇంకా ‘ఇమాజిన్’ ద్వారా మరింత తగ్గింపు ఉంది. ఐఫోన్ 15 Plus అసలు ధర రూ.89,900. అయితే ఇది రూ.82,203కే లభిస్తుంది. ఐఫోన్ 15 Pro మోడల్ అసలు ధర రూ.1,39,900, కానీ ఇది రూ.1,34,900కే అందుబాటులో ఉంది.ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ధర రూ.1,34,900 కే ఉంది. దీని అసలు ధర రూ.1,39,900. ఐఫోన్ 14 ని కేవలం రూ.62,405 కే కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.79,900. వీటితో పాటు మరిన్ని ఐఫోన్ మోడల్స్, iPad, Mac, AirPodలను Imagine Store ద్వారా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z