DailyDose

బోరుమన్న ఓ ఇంజనీర్- నేర వార్తలు

బోరుమన్న ఓ ఇంజనీర్- నేర వార్తలు

* బోరుమన్న ఓ ఇంజనీర్

అరవై ఎనిమిది లక్షల రూపాయలు కోల్పోయానంటూ ఓ ఇంజినీర్‌ గొల్లుమన్నాడు. అతడి పరిస్థితి చూసి జాలి పడాల్సిన నెటిజన్లు మాత్రం ఇంజినీర్‌దే తప్పంటూ మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం తటస్థంగా ఉండిపోతున్నారు. దీంతో, బెంగళూరుకు చెందిన ఈ ఇంజినీర్ ఉదంతం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా (Trending) మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..నగరానికి చెందిన ఆదిష్ ఓఎల్ఎక్స్‌లో తన పాత బెడ్‌ను అమ్మకానికి పెట్టాడు. రూ.15 వేల ధర పేర్కొన్నాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ అనేక వ్యక్తి ఆదిష్‌కు ఫోన్ చేశాడు. ధర విషయంలో వారో నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో డిజిటల్‌ మాధ్యమంలో డబ్బులు చెల్లిస్తానని రోహిత్ చెప్పి ఫోన్ పెట్టేశాడు. కాసేపటి తరువాత మళ్లీ ఫోన్ చేసి యూపీఐతో పేమెంట్ చేయలేకపోతున్నానని సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో తనకు ఆదిష్ రూ.5 పంపిస్తే తను రూ.10 తిరిగి చెల్లిస్తానని అతడితో చెప్పాడు. రోహిత్ చెప్పినట్టే ఆదిష్ చేశాడు (Bengaluru Techie Loses Rs 68 Lakh in One of the Biggest Online Scams).ఇదే విధంగా ఆదిష్ పలుమార్లు చేయగా ప్రతిసారీ రెట్టింపు డబ్బును రోహిత్ పంపించాడు. ఆ తరువాత బ్యాంకింగ్ చెల్లింపుల్లో ఏదో సాంకేతిక లోపం కారణంగా చెల్లింపులు చేయలేకపోతున్నాని రోహిత్ చెప్పాడు. కాబట్టి, తాను పంపించే లింక్‌పై క్లిక్ చేసి, ఆ తరువాత ఓటీపీ కూడా చెబితే డబ్బులు ట్రాన్స్ ఫర్ అవుతాయని పేర్కొన్నాడు. దీంతో, రోహిత్ పంపించిన లింక్‌పై ఆదిష్ క్లిక్ చేయడంతో అతడి అకౌంట్లోంచి కొంత డబ్బు మాయమైంది. ఆ తరువాత రోహిత్ తనకు డబ్బు చేరలేదంటూ మూడు సార్లు లింక్స్ పంపించడం, మళ్లి దానిపై క్లిక్ చేయడంతో విడతల వారీగా మొత్తం రూ.68 లక్షలు పోయాయని ఆదిష్ వాపోయాడు.జాతీయ మీడియాలో కూడా ఈ ఉదంతంపై కథనాలు రావడంతో ఈ వార్త నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. పంపిన డబ్బుకు రెండింతలు పంపిస్తానని నిందితుడు ఆఫర్ చేయడంలో తిరకాసు బాధితుడు ఎందకు గుర్తించలేకపోయాడంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఓ ఇంజినీర్ అయ్యి ఉండి ఇలా ఎలా మోసపోయాడంటూ కొందరు మండిపడ్డారు. దీంతో, ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ప్రభుత్వ అధికారి కొడుకు దారుణం

మ‌హారాష్ట్రకు చెందిన ఓ సీనియ‌ర్ అధికారి కుమారుడు.. త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను చిత్ర హింసల‌కు గురి చేశాడు. మిత్రుల‌తో క‌లిసి ఆమెను కొట్టి.. ఆమెపై డ్రైవ‌ర్‌తో కారెక్కించాడు. తాజాగా ఈ ఘ‌ట‌న థానేలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ మేనిజింగ్ డైరెక్టర్ అనిల్ గైక్వాడ్ కుమారుడు అశ్వజిత్ గైక్వాడ్ దారుణానికి పాల్పడ్డాడు. ఓ వాగ్వాదం వ‌ల్ల అశ్వజిత్ తన గర్ల్ ఫ్రెండ్ ప్రియా సింగ్ (26)‌ను సోమావారం థానేలో ఉన్న ఓ హోటల్ వద్ద ఆమెపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫోటోలు ఆమె ఇన్‌స్టాలో పోస్టు పెట్టింది. అయితే స్నేహితుడితో క‌లిసి భాయ్‌ఫ్రెండ్ త‌న‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడ‌ని, త‌న‌ను తిట్టవ‌ద్దు అని చెప్పినా వినిపించుకోలేద‌ని, త‌నపై చేయి చేసుకున్నాడ‌ని, త‌న గొంతును నొక్కే ప్రయ‌త్నం చేశాడ‌ని తన పోస్టులో తెలిపింది. ఘటనలో తనను రోడ్డుపై పడేసి కారుతో తొక్కించారని ఆమె పేర్కొంది. నొప్పుల‌తోనే అర‌గంట‌కుపైగా రోడ్డుపై ప‌డి ఉన్నాన‌ని, ఆ త‌ర్వాత ఓ వ్యక్తి వ‌చ్చి త‌న‌కు హెల్ప్ చేసిన‌ట్లు ఆమె చెప్పింది. ఈ ఘటనపై ఆమె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.

*   ఓవర్‌ స్పీడ్‌తో ఫల్టీలు కొట్టిన కారు

జాతీయ రహదారిపై ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. మితిమీరిన వేగం కారణంగా డ్రైవర్‌ ఆ కారుపై నియంత్రణ కోల్పోయాడు. అంతే.. అదపుతప్పిన కారు ఫల్టీలు కొట్టుకుంటూ రోడ్డు పక్కన పడిపోయింది. ఇంతలో ఆ కారులోంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ఇద్దరూ డోర్లు తెరుచుకుని వెంటనే బయటికి రావడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు.రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ జిల్లాలో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు ఉదయ్‌పూర్‌ నుంచి అహ్మదాబాద్‌కు వెళ్తుండగా ఖేర్‌వారా పోలీస్‌స్టేషన్‌ దగ్గర ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. కానీ అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది.

హాలీడే ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా? 

ఏడాది ముగింపు దశకు చేరుకుంది. దీంతో చాలా మంది హాలీడే ట్రిప్స్‌ను ప్లాన్ చేస్తున్నారు. క్రిస్మస్‌ సెలవులు కూడా కలసిరావడంతో హాలీడేలను సరదాగా గడపాలనుకుంటున్నారు. దీంతో హోటల్స్‌ను ఆన్‌లైన్‌లో బుక్‌ చేస్తున్నారు. అయితే ఇలాగే ఆన్‌లైన్‌లో హోటల్‌ బుక్‌ చేసుకుందామని ప్రయత్నించిన ఓ మహిళ ఏకంగా రూ. 3 లక్షలు కోల్పోయింది. ఇంతకీ ఏం జరగిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..మహారాష్ట్రలోని వాఘోలికి చెందిన ఓ మహిళ క్రిస్మస్ సెలవుల కోసం హాలీడే ట్రిప్‌ని ప్లాన్‌ చేసింది. ఇందులో భాగంగానే ఆన్‌లైన్‌లో హోటల్‌ను బుక్‌ చేసుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే ఓ హోటల్‌లో రూమ్‌ను బుక్‌ చేసుకోవాలని ప్రయత్నించింది. కొన్ని క్షణాలకే ఆమెకు ఓ ఫోన్‌ వచ్చింది. తాను సదరు హోటల్‌ స్టాఫ్‌ అని పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి, రూమ్‌ బుకింగ్కు సంబంధించి సమస్య తలెత్తినట్లు, పరిష్కరించాల్సిన అవసరం ఉందని మాటల్లో పెట్టాడు.అంతలోనే ఆ మహిళను నమ్మించి.. సదరు మహిళ నుంచి ఆమె బ్యాంక్‌ ఖాతా వివరాలను సేకరించడం ప్రారంభించాడు. అంతలోనే ఫోన్ కట్‌ అయ్యింది. అంతలోనే ఆమె బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి రూ. 3 లక్షలు కట్ అయినట్లు మెసేజ్‌ వచ్చింది. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ప్రస్తుతం దేశంలో ఇలాంటి సైబర్‌ నేరాల భారీగా పెరిగిపోతున్నట్లు సైబర్‌ క్రైమ్‌ నిపుణులు చెబుతున్నారు. రకరకాల మార్గాల్లో ప్రజలను మోసం చేస్తూ, ఖాతాల్లోని డబ్బును దోచేస్తున్నారు. అధికారులు, ప్రభుత్వాలు ఎంత అవగాహన కల్పిస్తోన్నా మోసాలు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి. ఇలాంటి నేరాల బారిన పడకూడదంటే బ్యాంక్‌ ఖాతా వివరాలను ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో పంచుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఓటీపీలను ఎవరితో షేర్‌ చేసోకూడదని చెబుతున్నారు. ఇక ఫోన్‌లో మాట్లాడుతున్న వ్యక్తి పట్ల ఏమాత్రం అనుమానంగా అనిపించినా వెంటనే కాల్‌ కట్ చేయడం ఉత్తమమని చెప్పాలి.

* టైరు పగిలి లారీ బోల్తా

సత్తుపల్లి, తల్లాడ ప్రధాన రహదారిపై శనివారం ఓ లారీ టైరు పలిగి పల్టీ కొట్టింది. తల్లాడ మండల పరిధిలోని మిట్టపల్లి సెంటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బొగ్గు లారీ టైర్ పగలడంతో బోల్తా పడింది. దాంతో ట్రాఫిక్ జామ్ అయింది. తల్లాడ కానిస్టేబుల్ బాలాజీ వెంటనే స్పందించి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. లారీని జేసీబీ సాయంతో తొలగించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సిద్ధిపేట కలెక్టర్‌ గన్‌మెన్‌ ఆత్మహత్య

సిద్ధిపేట కలెక్టర్‌ గన్‌మెన్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, ఇద్దరు పిల్లల్ని చంపిన నరేష్‌.. గన్‌తో కాల్చుకున్నాడు. చిన్నకోడూర్‌ మండలం రామునిపట్లలో ఘటన జరిగింది. విధులు నిర్వహించుకుని ఇంటికి వచ్చే సమయంలో 9 mm పిస్తొల్‌తో భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రీలను కాల్చి,  తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌తో అప్పుల పాలై నరేష్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. తనకున్న ఎకరం భూమిని అమ్మిన అప్పులు తీరకపోవడంతో సూసైడ్‌కు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

కుటుంబ కలహాలతో భార్యాభర్తలిద్ద‌రూ తీవ్ర నిర్ణ‌యం!

కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త మృతిచెందాడు. ఈ ఘటన జాజిరెడ్డిగూడెం మండలంలోని కొమ్మాల గ్రామంలో ఈ నెల 12న తేదీన జరగగా బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమ్మాల గ్రామానికి చెందిన భాషపోలు నవీన్‌(35)ది వ్యవసాయ కుటుంబం. నవీన్‌కు 14 ఏళ్ల కిందట నిర్మలతో వివాహమైంది.వీరికి ఇద్దరు కుమార్తెలు అక్షిత, దీక్షిత ఉన్నారు. నవీన్‌, నిర్మల మధ్యన చిన్న చిన్న మనస్పర్థలు ఏర్పడడంతో గత రెండేళ్ల నుంచి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై పెద్ద మనుషుల వద్ద పంచాయితీ పెట్టగా.. చిన్న చిన్న విషయాలకు ఘర్షణ పడవద్దని ఇద్దరికీ నచ్చజెప్పారు. అయినప్పటికీ అప్పుడప్పుడు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నెల 12న భార్యభర్తలిద్దరు తమ వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి పనులు చేసుకుంటూ అక్కడ కూడా ఘర్షణ పడ్డారు.క్షణికావేశంలో నిర్మల అక్కడే ఉన్న పురుగుల మందు తాగింది. దీంతో తాను కూడా తాగుతానని నవీన్‌ అక్కడే ఉన్న గడ్డి మందును తాగాడు. చుట్టుపక్కల వారు గమనించి ఇద్దరిని సూర్యాపేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. నవీన్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. నిర్మల సూర్యాపేటలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కోలుకుంటుంది. కాగా నవీన్‌ మృతదేహానికి గురువారం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి తండ్రి వీరస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు అర్వపల్లి ఎస్‌ఐ బి. అంజిరెడ్డి తెలిపారు.

అప్రమత్తమైన బీఎస్‌ఎఫ్‌

దాయాది దేశం తన వక్రబుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. మరోసారి సరిహద్దుల నుంచి ఉగ్రవాదులను భారత్‌లోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ మేరకు నిఘావర్గాల హెచ్చరికలతో బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (BSF) అప్రమత్తమైంది. దాదాపు 250 నుంచి 300 మంది ఉగ్రవాదులు పాక్‌ సరిహద్దు నుంచి జమ్మూ కశ్మీర్‌లోకి చొరబడేందుకు ప్రణాళికలు వేస్తున్నారని బీఎస్‌ఎఫ్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఉగ్రవాదులు సరిహద్దుల్లోని లాంచ్‌ప్యాడ్‌లో దాక్కున్నారని పేర్కొన్నారు.ఈ మేరకు భద్రతా బలగాలను అప్రమత్తం చేసినట్లు అధికారి పేర్కొన్నారు. సరిహద్దు చొరబాటు ప్రయత్నాలను బీఎస్‌ఎఫ్‌ భగ్నం చేస్తుందని పేర్కొన్నారు. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో బీఎస్ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ అశోక్‌ యాదవ్‌ లాంచ్‌ప్యాడ్‌ల వద్ద 250-300 మంది ఉగ్రవాదులు ఉన్నారని నిఘావర్గాల నుంచి సమాచారం ఉందన్నారు. సైన్యం సున్నితమైన ప్రాంతాలపై ఆధిపత్యం చెలాయించామన్నారు. బీఎస్‌ఎఫ్‌, ఆర్మీకి చెందిన జవార్లు సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉన్నారని, చొరబాటు ప్రయత్నాలు విజయవంతంగా అడ్డుకుంటామన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z