NRI-NRT

ఖతర్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయులకు ఊరట

ఖతర్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయులకు ఊరట

గూఢచర్యం ఆరోపణలకు సంబంధించిన కేసులో భారత్‌కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారుల (Former Indian Navy personnel)కు ఖతర్‌ (Qatar)లో మరణశిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఖతర్‌ కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. మరణశిక్ష (Death Sentence)ను రద్దు చేస్తూ వారికి ఊరట కల్పించింది. వారికి శిక్షను తగ్గించి జైలు శిక్ష విధిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఖతర్‌ కోర్టు తీర్పును భారత విదేశాంగ శాఖ (MEA) ఓ ప్రకటనలో వెల్లడించింది.

అయితే, వారికి ఎన్నేళ్ల శిక్ష విధించారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. తీర్పునకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని, దీనిపై ఖతర్‌ అధికారులతో చర్చిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ కేసులో తదుపరి చర్యలు చేపట్టేందుకు న్యాయ బృందంతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది.

కేసు నేపథ్యమిదీ..
భారత్‌కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారులు అల్‌ దహ్రా సంస్థ (Al Dahra company)లో పనిచేస్తున్నారు. ఖతర్‌ సాయుధ దళాలకు శిక్షణ, ఇతర సేవలు అందించే ఈ సంస్థను ఒమన్‌కు చెందిన ఓ మాజీ వైమానిక దళ అధికారి నిర్వహిస్తున్నారు. అయితే, భారత్‌కు చెందిన ఈ ఎనిమిది మందిని ఖతర్‌ అధికారులు 2022 ఆగస్టులో నిర్బంధంలోకి తీసుకున్నారు. సబ్‌మెరైన్‌ కార్యక్రమాల్లో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో వీరిని నిర్బంధించారు.

అనంతరం ఈ కేసులో విచారణ జరిపిన అక్కడి న్యాయస్థానం.. ఆ 8 మందికి మరణ శిక్ష విధిస్తూ ఈ ఏడాది అక్టోబరులో తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై భారత విదేశాంగ శాఖ దోహాలో అప్పీలు దాఖలు చేసింది. ఈ అప్పీల్‌ను పరిగణనలోకి తీసుకుని వారి మరణశిక్షను రద్దుచేసి జైలుశిక్ష విధించింది. మరణశిక్ష పడిన వారిలో కెప్టెన్లు సౌరభ్‌ వశిష్ఠ్‌, నవతేజ్‌ గిల్‌, కమాండర్లు బీరేంద్ర కుమార్‌ వర్మ, పూర్ణేందు తివారీ, సుగుణాకర్‌ పాకాల, సంజీవ్‌ గుప్తా, అమిత్‌ నాగ్‌పాల్‌, సెయిలర్‌ రాగేశ్ ఉన్నారు. వీరిలో సుగుణాకర్‌ పాకాల విశాఖ వాసి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z