DailyDose

పవన్‌ను నమ్ముకుని ఎన్నికలకు వెళ్లడమా- తాజా వార్తలు

పవన్‌ను నమ్ముకుని ఎన్నికలకు వెళ్లడమా- తాజా వార్తలు

* మోదీపై నారాయణ సంచలన ఆరోపణలు

గ్రాఫ్ పడిపోతుందనే అయోధ్య రామాలయ నిర్మాణానికి అద్వానీని మోడీ పిలవడం లేదని సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముగ్దుమ్ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్‌పై దాడిని బీజేపీ ఉద్దేశ్యపూర్వక డ్రామా చేసిందని నారాయణ ఆరోపించారు. జనవరి 22న అయోధ్యను ప్రారంభించి ఓట్లు దండుకోవాలన్నదే బీజేపీ ప్లాన్ అని చెప్పారు. అద్వానీ లేకుండా బాబ్రీ కూల్చలేదా..? అని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా అద్వానీని రామ మందిరం ప్రారంభోత్సవానికి రావద్దని చెప్పారని తెలిపారు. మోడీ గ్రాఫ్ తగ్గ కూడదని.. అద్వానీని పిలవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీపై ఈగ వాలినా మోడీ, అమిత్ షాకి నష్టం అని చెప్పారు. అందుకే ఆదానీని కాపాడే పనిలో ఉన్నారని వ్యాఖ్యానించారు. దేవుణ్ణి.. క్రిమినల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళను కేంద్రం పక్కన పెట్టుకోవాలని చూస్తుందన్నారు. ఏపీలో చంద్రబాబుతో కలిసి పోటీ చేయాలని బీజేపీ చూస్తుందని తెలిపారు. ఇండియా కూటమిని బలపరిచేలా తాము రాజకీయాలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని సీపీఐ నేత నారాయణ వెల్లడించారు.కేసీఆర్ లెక్కనే.. జగన్ పోవాలని ప్రజలు భావిస్తున్నారని నారాయణ తెలిపారు. షర్మిలను ఏపీ కాంగ్రెస్‌లోకి తీసుకుని జగన్‌ని భయపెట్టారన్నారు. జగన్ ఆయన కొంపలో ఆయనే నిప్పు పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్, జగన్ భేటీ వ్యూహంలో భాగమేనన్నారు. పోలింగ్ డే రోజు తెలంగాణతో గొడవ పెట్టుకుంటారా? అని ప్రశ్నించారు. అప్పుడు ‘నీకు సహకారం చేశా. ఇప్పుడు మీరు సహకారం చేయండి’ అని చెప్పడానికే కేసీఆర్ వద్దకు జగన్ వెళ్లారని చెప్పారు. మొన్న ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం కలిసి పని చేయాలని అనుకున్నామన్నారు. నిచ్చితార్థం వరకు అయ్యిందని..కానీ పెళ్లి దగ్గర ఆగిపోయిందన్నారు. రామ మందిరం ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం వచ్చిందని, అయినా వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రధాని హోదాలో రిలీజియన్ వ్యవహారాల్లో పాల్గొనకూడదని, కానీ మోడీ వెళ్తున్నారని నారాయణ పేర్కొన్నారు.

* పవన్‌ను నమ్ముకుని ఎన్నికలకు వెళ్లడమా?

పవన్‌ను నమ్ముకుని ఎన్నికలకు వెళ్లడమా? బాబోయ్‌.. అనుకుంటోంది ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ. తాజాగా కోర్‌ కమిటీ సమావేశంలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తాడేపల్లిలో దాదాపు అయిదు గంటలపాటు కొనసాగిన ఈ సమావేశంలో ఎన్నికల సన్నద్దత, పొత్తుల అంశాలపై కీలకంగా చర్చించారు. వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఎలా సన్నద్దమవ్వాలనే దానిపై జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివ ప్రకాష్ జీ అభిప్రాయాలను సేకరించారు. పొత్తులపై నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు.అయితే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీలో ఉండాలని పలువురు నేతలు తమ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఒంటరిగా పోటీ చేస్తే ఓట్ల శాతం పెరుగుతుందని నేతలు చెప్పినట్లు సమాచారం. ఈ భేటీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తీరుపైనా బీజేపీ నేతలు చర్చించగా.. పవన్‌ను నమ్ముకుంటే బీజేపీకి ఎదురుదెబ్బేనని పలువురు అభిప్రాయపడినట్లు వినికిడి. టీడీపీ-జనసేన పొత్తుపై చర్చించారు. ఈ సందర్భంగా గతంలో చంద్రబాబుతో కలిసి ప్రయాణం చేసి భంగపడిన అనుభవాలను నేతలు గుర్తుచేసుకున్నారట. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయగలమా? అనే అంశంపైనా అభిప్రాయ సేకరణ జరిపారు. టీడీపీతో పొత్తు అంశాన్ని అధిష్టానానికి వదిలేయాలని నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఏయే సీట్లల్లో బీజేపీ పోటీ చేయడానికి ఆస్కారం ఉందనే అంశంపైనా చర్చించినట్లు సమాచారం. ఏపీలో ఈ నెలలో అమిత్ షా పర్యటించనున్న విషయం తెలిసిందే. దీంతో కేంద్రమంత్రి పర్యటన సమయంలోనే పొత్తులపై క్లారిటీ ఇవ్వాలని నేతలు కోరారట.

* ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజే రెండు హామీలు అమలు చేశాం

ఓటమిపాలైనప్పటికీ భారాస నేతల వైఖరిలో మార్పు రాలేదని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. గురువారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సీతక్కతో కలిసి ఆయన మాట్లాడారు. ‘‘మార్పు కావాలని ప్రజలు తీర్పు ఇచ్చారు. డిసెంబరు 7వ తేదీన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజే రెండు హామీలు అమలు చేశాం. కేసీఆర్‌ రెండోసారి గెలిచాక రెండు నెలల వరకు మంత్రులు కూడా లేరు. మంత్రులు లేకుండా రెండు నెలలపాటు పాలించారు. భారాస ప్రభుత్వం 3,500 రోజులు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించింది. ప్రజలను అవమానిస్తూ కేసీఆర్‌ పాలన సాగించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఇప్పటికే 6.50 కోట్ల జీరో టికెట్లు జారీ అయ్యాయి. రాజీవ్‌ ఆరోగ్యశ్రీని రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచాం. నవ్విపోదురుగాక.. నాకేంటి అన్నట్టుగా భారాస నేతల వైఖరి ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన 20 రోజులకే కేటీఆర్‌ అక్కసు వెళ్లగక్కుతున్నారు’’ అని శ్రీధర్‌బాబు విమర్శించారు.

* సీఎంకు తులసిరెడ్డి కౌంటర్

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ వనవాసం ముగిసిందని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి వెల్లడించారు. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్.. నిన్న తెలంగాణలో కాంగ్రెస్ .. రేపు ఏపీలో కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వై నాట్ ఏపీ కాంగ్రెస్ అనేది మా నినాదమని ఆయన స్పష్టం చేశారు.పొత్తుల కోసం మా కుటుంబాన్ని చీలుస్తున్నారంటూ సీఎం జగన్ చేసిన వాఖ్యలకు తులసిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. షర్మిలకు ఆస్తి, పదవి, ఇవ్వొద్దని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ నేతలు చెప్పారా అంటూ ఆయన ప్రశ్నించారు. డా. సునీత పై కేసు పెట్టమని ఎవరు చెప్పారు.. రిలయన్స్ పరిమళ్ నత్వానికి పదవి ఇవ్వమని మేము చెప్పామా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు నా కుటుంబంలో కుట్ర చేస్తున్నారని సీఎం వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అంగన్వాడీల సమ్మె న్యాయమైనదన్నారు. తల్లి, డాక్టర్ , టీచర్ , నర్స్ పాత్ర అంగన్వాడీలు నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా తులసిరెడ్డి అన్నారు.

* షర్మిళ చేరికతో కాంగ్రెస్ ఏపీలో బలోపేతమవుతోంది

వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిళ ఇవాళ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సమక్షంలో, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో వైఎస్ఆర్‌టీపీ కాంగ్రెస్ పార్టీలో లాంఛనంగా విలీనమైంది. ఈ సందర్భంగా ఏఐసీసీ నేత మాణిక్కం ఠాగూర్ మాట్లాడుతూ.. వైఎస్ షర్మిళ చేరికతో కాంగ్రెస్ ఏపీలో బలోపేతమవుతోందని అన్నారు. నాయకుల చేరికతో ఆంధ్రప్రదేశ్‌లో పార్టీకి పునరుజ్జీవం లభించిందని ఆయన అన్నారు. అయితే, పార్టీలో చేరిన షర్మిళకు ఏ పదవి కట్టబెట్టాలో త్వరలో అధిష్టానమే నిర్ణయిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామంలో కాంగ్రెస్ ఏపీ మిషన్ ప్రారంభమైందని అన్నారు. ఏపీలో బీజేపీకి ప్రాంతీయ పార్టీలనీ అనుకూలమేనని ఆరోపించారు. రాష్ట్రానికి బీజేపీ తీరని ద్రోహం చేసిందన్నారు.

* మరోసారి పవన్‌ కల్యాణ్‌కు సవాల్‌

కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మార్పులు చేర్పులు చేస్తుండగా.. కాకినాడ అసెంబ్లీ సీటు వ్యవహారం తేలాల్సి ఉంది.. అయితే, మరోసారి పవన్‌ కల్యాణ్‌కు సవాల్‌ చేశారు ఎమ్మెల్యే ద్వారంపూడి.. కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాకినాడ నుంచి నాపై పోటీ చేయమని గతంలోనే పవన్ కి సవాలు చేశాను.. కనీసం గ్లాస్ గుర్తు అయినా నా మీద పోటీ పెట్టమని కోరుతున్నాను అన్నారు. ఇక, పవన్‌ కల్యాణ్‌ ఎన్ని రివ్యూలు చేసుకున్న ఓడిస్తానంటూ ఓపెన్‌ ఛాలెంజ్‌ చేశారు. నా మీద గాజు గ్లాస్ పోటీ ఉంటుందని అనుకుంటున్నాను.. అలా లేకపోతే గతంలో పవన్ కల్యాణ్‌ చేసిన తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని సూచించారు. గత పర్యటనలో మూడు రోజులు ఉండి నేను చేసిన సవాల్‌కు స్పందించలేదన్నారు. మరోవైపు.. టికెట్ వచ్చినా.. రాకపోయినా జగన్ కోసమే పని చేస్తాను.. ఆ కుటుంబానికి ఎప్పుడు విధేయతతో ఉంటాం అన్నారు. ఇక, నా సీటును త్వరలోనే ప్రకటిస్తారు అని తెలిపారు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి.కాగా, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కాకినాడపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టారు.. ఈ మధ్యే కాకినాడలో పర్యటించిన ఆయన.. నాలుగు రోజుల పాటు వరుస సమీక్షా సమావేశాలు నిర్వహించారు.. ముఖ్యంగా కాకినాడ సిటీ సీటుపై ఆయన దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.. అందులో భాగంగా.. వివిధ డివిజన్ల నేతలతో ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహిస్తూ వచ్చారు పవన్‌ కల్యాణ్‌.. గతంలో.. సవాల్‌ చేసినట్టుగానే కాకినాడ నుంచి పోటీచేసేందుకు ఆయన సిద్ధం అవుతున్నారనే చర్చ సాగుతుండగా.. మరోసారి హాట్‌ కామెంట్లు చేశారు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి.

* మళ్లీ కాంగ్రెస్‌తో పొత్తు

వచ్చే పార్లమెంట్ ఎన్నికలో ఖమ్మం, వరంగల్, పెద్దపల్లి, నల్గొండ , భువనగిరి స్థానాలపై ఫోకస్ చేశామని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని తెలిపారు. ఈ స్థానాల్లో పార్టీ బలంగా ఉందని ఆయన తెలిపారు. ప్రాథమికంగా ఒక సీటు ఇవ్వాలని కాంగ్రెస్‌ని అడిగామని కూనంనేని తెలిపారు. ముగ్దుమ్ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.కార్మిక సంఘాల్లో బలంగా ఉన్నామని, కానీ బలానికి అనుకూలంగా ఓట్ల రూపంలో రాబట్టలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. ఆ దిశగా పార్టీని వృద్ధిలోకి తీసుకరావాలని నిర్ణయించామన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తామన్నారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఉండాలన్నారు. పార్లమెంట్‌లో ఒక సీటు ఇవ్వాలని కాంగ్రెస్‌ని అడుగుతున్నామని కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z