DailyDose

₹500 కోసం వృద్ధురాలిని హతమార్చిన వృద్ధుడు-నేరవార్తలు

₹500 కోసం వృద్ధురాలిని హతమార్చిన వృద్ధుడు-నేరవార్తలు

* పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక బస్‌స్టాప్‌ వద్ద ఆర్టీసీ బస్సు-ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. 13 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

* అనుమానాస్పద స్థితిలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. ఈ ఉదంతం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో విషాదాన్ని నింపింది. పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం… నంద్యాల వైఎస్సార్‌నగర్‌కు చెందిన బేలిపాటి రవి, చినజమ్మక్క దంపతులు బతుకుదెరువు కోసం జంగారెడ్డిగూడెం వచ్చారు. రామచంద్రపురం ట్యాంకు వద్ద గుడారంలో ఉంటూ.. ద్విచక్ర వాహనాలపై ప్లాస్టిక్‌ సామగ్రి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. రవి, చినజమ్మక్కల కుమారులు రామకృష్ణ (10), విజయ్‌ (6) బుధవారం రాత్రి ఏలూరు రోడ్డులో ఓ బండి వద్ద పానీపూరీ తిని ఇంటికొచ్చారు. అర్ధరాత్రి వారికి కడుపు నొప్పి వచ్చి, వాంతులు కావడంతో స్థానికంగా వేర్వేరు ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్లారు. తర్వాత రామకృష్ణను రాజమహేంద్రవరం, విజయ్‌ను ఏలూరు తరలిస్తుండగా చనిపోయారు. పోలీసులు మృతదేహాల్ని పరీక్షల నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రాంతీయాసుపత్రికి తరలించారు. పానీపూరీ తిని అస్వస్థతకు గురై తమ పిల్లలు చనిపోయారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు. మూడేళ్ల కిందట ఒకరు అనారోగ్యంతో చనిపోయారు.

* కేవలం రూ.500 కోసం ఓ వృద్ధుడు వృద్ధురాలిని హతమార్చాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలంలో గురువారం చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కోబల్‌తండా గ్రామ శివారు మూడుగుడిసెల లైన్‌తండాకు చెందిన తేజావత్‌ ఈరమ్మ (58) తండాలో కూలీ పనులు చేస్తూ ఒంటరిగా నివసిస్తున్నది. ఆమె భర్త చనిపోగా సంతానం లేదు. ఈరమ్మ తన ఇంటి పక్కనే ఉన్న వృద్ధుడు తేజావత్‌ స్వామికి రూ.500లు చేబదులుగా ఇచ్చింది. తన డబ్బు ఇవ్వాలని మూడు రోజులుగా ఈరమ్మ స్వామిని అడుగుతుంది. ఆమెపై కక్ష పెంచుకున్న స్వామి బుధవారం రాత్రి ఈరమ్మను గొంతునులిమి హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. మృతురాలి అక్క కుమారుడి ఫిర్యాదు మేరకు స్వామిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వారు పేర్కొన్నారు.

* అభం శుభం తెలియని నాలుగేండ్ల మైనర్‌ కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డ నేరానికి నిందితుడు దేశగోని ఆనంద్‌గౌడ్‌ (34)కు కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పినిచ్చింది. 25 వేల జరిమానా, బాధిత బాలికకు రూ.12 లక్షల పరిహారం అందజేయాలని న్యాయసేవా సంస్థను ఆదేశిస్తూ రంగారెడ్డి జిల్లా పోక్సో న్యాయస్థానం తీర్పునిచ్చింది. అదనపు పీపీ కోమలత తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం గండిచెరువు గ్రామానికి చెందిన ఆనంద్‌గౌడ్‌ మద్యానికి బానిసై నిత్యం భార్యను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. నిందితుడు ఆనంద్‌ ఇంట్లో ఒంటరిగా ఉండగా 2022 అక్టోబర్‌ 27న తన కూతురితో అసభ్యంగా ప్రవర్తించి లైంగికదాడికి పాల్పడ్డాడని, గతంలో కూడా ఇలాగే చేశాడని బాలిక తన తల్లికి తెలపింది. దీంతో బాలిక తల్లి అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు, సాక్షాధారాలను పరిశీలించిన న్యాయస్థానం శిక్ష విధిస్తూ పైతీర్పునిచ్చింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z