Sports

రోహన్ బోపన్న సరికొత్త రికార్డు-తాజావార్తలు

రోహన్ బోపన్న సరికొత్త రికార్డు-తాజావార్తలు

* పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాల నుంచి టన్నెల్‌ ద్వారా వెనుకబడిన నల్గొండ జిల్లాకు సాగు, తాగు నీరందించేందుకు రూపకల్పన చేసిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టు పనులకు తొలుత ప్రాధాన్యమిచ్చి గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా వేగంగా పూర్తి చేయాలన్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులు పూర్తయితే దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు నీరందించవచ్చని తెలిపారు.

* తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఉస్మానియా వర్సిటీ, జేఎన్‌టీయూ హైదరాబాద్‌, కాకతీయ, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ, పాలమూరు, అంబేడ్కర్‌, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలకు వీసీల నియామకానికి విద్యా శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఫిబ్రవరి 12న సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

* ఫిబ్రవరి నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న విశేష పర్వదినాల వివరాలను తితిదే ఒక ప్రకటనలో తెలిపింది.
ఫిబ్రవరి 9న శ్రీపురందరదాసుల ఆరాధనోత్సవం.
10న తిరుకచ్చినంబి ఉత్సవం
14న వసంతపంచమి.
16న రథసప్తమి.
19న తిరుకచ్చినంబి శాత్తుమొర.
20న భీష్మ ఏకాదశి.
21న కులశేఖరాళ్వార్‌ వర్ష తిరు నక్షత్రం.
24న కుమారధార తీర్థ ముక్కోటి, మాఘ పౌర్ణమి గరుడసేవ.

* రాయితీ పెండింగ్ చలాన్ల చెల్లింపుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. మొత్తంగా 3.59 కోట్ల పెండింగ్‌ చలాన్లకు గాను ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,52,47,864 (42.38 శాతం) చలాన్లు చెల్లించారు. వీటి ద్వారా రూ. 135 కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.34 కోట్లు, సైబరాబాద్‌ పరిధిలో రూ.25 కోట్లు, రాచకొండ పరిధిలో రూ.16 కోట్లు ఆదాయం వచ్చింది.

* లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేరళకు చెందిన ఓ కాంగ్రెస్‌ ఎంపీ కె.మురళీధరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి వయనాడ్ స్థానం నుంచి పోటీ చేస్తారని తెలిపారు. కన్నూర్ మినహా రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలు మరోసారి బరిలోకి దిగే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు.

* భారత టెన్నిస్‌ స్టార్‌, డబుల్స్‌లో నంబర్‌వన్‌ ర్యాంకర్‌గా నిలిచిన రోహన్ బోపన్న చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్ 2024 డబుల్స్‌ విభాగంలో తన సహచరుడు ఎబ్డెన్‌తో (ఆస్ట్రేలియా) కలిసి ఫైనల్‌లో ఇటలీ జోడీ సిమోన్‌-వావాసోరిపై విజయం సాధించాడు. కెరీర్‌లో తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అతిపెద్ద వయసులో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గిన టెన్నిస్‌ ప్లేయర్‌గానూ రోహన్‌ (43 ఏళ్లు) ఘనత సాధించాడు.

* ఎర్రసముద్రంలో నౌకలపై హౌతీ తిరుగుబాటుదారుల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా గల్ఫ్‌ ఆఫ్ ఎడెన్‌లో ఆయిల్‌ ట్యాంకర్లతో వెళుతున్న మార్లిన్‌ లాండ నౌకపై క్షిపణితో దాడి చేయగా మంటలు చెలరేగాయి. దాంతో ఆ నౌక నుంచి వచ్చిన అత్యవసర సందేశానికి భారత నేవీ స్పందించింది.

* ప్రజలకు మంచి చేసే క్రమంలో నష్టం జరిగితే.. అది తన నుంచే మొదలు కావాలంటున్నారు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి. శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాక కామారెడ్డి పట్టణంలో రోడ్ల విస్తరణపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. రోడ్డు విస్తరణకు తన ఇల్లు అడ్డుగా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఇంటిని ఖాళీ చేసి మరోచోటుకు మారిన వెంకటరమణారెడ్డి.. తన ఇంటి నుంచే రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.

* రష్యా-ఉక్రెయిన్‌ పోరు అంతిమంగా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చనే భయాలు ప్రపంచ దేశాలను వెంటాడుతున్నాయి. అదే జరిగితే రష్యాను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని అమెరికా (USA) యోచిస్తోంది. యూరప్‌లోని నాటో కూటమి దేశాల్లో అణు సామర్థ్యాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే 15 ఏళ్ల తర్వాత యూకే (UK)లో మళ్లీ అణ్వాయుధాలను మోహరించేందుకు అగ్రరాజ్యం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z