NRI-NRT

H1B దరఖాస్తు ధర $780 – తాజావార్తలు

H1B దరఖాస్తు ధర 0 – తాజావార్తలు

* అమెరికా (USA) వెళ్లే భారతీయులపై ఇక మరింత భారం కానుంది. హెచ్‌-1బీ (H-1B Visa) సహా కొన్ని కేటగిరీల దరఖాస్తు రుసుముల (Application Fee)ను పెంచుతున్నట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. వీసాల అప్లికేషన్‌ ఫీజులను పెంచడం 2016 తర్వాత మళ్లీ ఇప్పుడేనని బైడెన్‌ సర్కారు వెల్లడించింది. తాజా నిర్ణయంతో హెచ్‌-1బీ (H-1B) వీసా దరఖాస్తు ధర 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు పెరిగింది. హెచ్‌-1బీ రిజిస్ట్రేషన్‌ ధరను కూడా 10 డాలర్ల నుంచి 215 డాలర్లకు పెంచారు. అయితే, ఇది వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక, ఎల్‌-1 వీసా దరఖాస్తు రుసుమును 460 డాలర్ల నుంచి 1,385 డాలర్లకు పెంచారు. ఈబీ-5 వీసాల అప్లికేషన్‌ ఫీజులను 3,675 డాలర్ల నుంచి ఏకంగా 11,160 డాలర్లకు పెంచినట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంలాండ్‌ సెక్యూరిటీ తమ ఫెడరల్‌ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

* ఫుడ్‌స్టాల్‌తో హైదరాబాద్ మాదాపూర్ ప్రాంతంలో పాపులర్ అయ్యారు కుమారి. సామాజిక మధ్యమాల ద్వారా ఆ ఫేమ్‌ను మరింత పెంచుకున్నారు. జనాలు ఆమె ఫుడ్‌స్టాల్ వద్ద గుమిగూడటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోందని పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం స్పందించడం తనకు చాలా సంతోషంగా ఉందని కుమారి చెబుతున్నారు.

* కాంగ్రెస్‌ ప్రకటించిన గ్యారంటీలకు సంబంధించి ప్రజా పాలన కార్యక్రమంలో 1,09,01,255 దరఖాస్తులు వచ్చాయి. జనవరి 12 నాటికి వాటి డేటా ఎంట్రీ సైతం పూర్తి అయింది. దీనిపై కేబినెట్‌ సబ్ కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులతో కలిసి సీఎం రేవంత్‌ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. మొత్తం దరఖాస్తుల్లో 2.82 లక్షల నకిలీ అప్లికేషన్లు గుర్తించారు. ఆధార్‌, రేషన్‌ కార్డు నంబర్లు లేకుండా, వివరాలు తప్పుగా రాసిన వాటిని డేటా ఎంట్రీ సమయంలో గుర్తించారు. దరఖాస్తులపై ఆరా తీసిన సీఎం.. అసలైన అబ్ధిదారులు నష్టపోకుండా వాటిని పునఃపరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

* దేశవ్యాప్తంగా కోటి ఇళ్లు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును పొందేందుకు ప్రభుత్వం వీలు కల్పిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ పథకం కింద రూఫ్‌ టాప్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేయడం ద్వారా దీనిని సాకారం చేస్తామని చెప్పారు. ఇందులో భాగంగా బడ్జెట్‌లో సౌర విద్యుత్తు రంగానికి రూ.7,327 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో కేటాయించిన రూ.4,979 కోట్ల కంటే దాదాపు 48 శాతం ఎక్కువ. బడ్జెట్‌ ప్రసంగంలో భాగంగా ‘రూఫ్‌ టాప్‌ సోలార్‌’ పాలసీ వల్ల కలిగే ప్రయోజనాలను కేంద్ర మంత్రి సభకు వివరించారు. సాధారణ, మధ్య తరగతి కుటుంబాలు తమ ఇళ్లపై ఏర్పాటు చేసే సౌర ఫలకాల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తును గృహావసరాలకు వినియోగించుకోవడమే కాకుండా, మిగిలిన విద్యుత్తును డిస్కంలకు విక్రయించుకునే వీలుందని సీతారామన్‌ చెప్పారు. తద్వారా ప్రతి కుటుంబం ఏడాదికి రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు ఆదాయాన్ని పొందొచ్చన్నారు. గత కొంతకాలంగా విద్యుత్తు వాహనాలకు గిరాకీ ఏర్పడటంతో సోలార్‌ పవర్‌తో ఛార్జింగ్‌ పెట్టేలా కొత్త స్టేషన్లు వస్తాయన్నారు. వాటి వల్ల ఉపాధి కల్పన జరుగుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఆత్మనిర్భర్‌ భారత్‌కు అనుగుణంగా ఆర్థిక వృద్ధిని సాధించేందుకు దోహదం చేస్తుందని సీతారామన్‌ అన్నారు.

* ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరానికి (Ayodhya Ram Mandir) భారీగా భక్తజనం పోటెత్తుతున్నారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నుంచి ఈ 11 రోజుల వ్యవధిలో దాదాపు 25లక్షల మంది భక్తులు రామ మందిరాన్ని సందర్శించినట్లు అధికారులు వెల్లడించారు. అదే సమయంలో ఆలయ హుండీకి రూ.11 కోట్ల మేర విరాళాలు అందినట్లు తెలిపారు. ఆలయ ట్రస్టు ఆఫీస్‌ ఇన్‌ఛార్జి ప్రకాశ్‌ గుప్తా మాట్లాడుతూ.. బాలక్‌ రాముడి దర్శన మార్గంలో నాలుగు హుండీలు ఉండగా గత 11 రోజుల్లో రూ.8 కోట్లు నగదు రూపంలో, రూ.3.5కోట్లు మేర చెక్కులు, ఆన్‌లైన్‌ ద్వారా విరాళాలు వచ్చినట్లు వెల్లడించారు. మొత్తం 14 మందితో కూడిన బృందం ఈ హుండీలను లెక్కించిందన్నారు. వీరిలో 11 మంది బ్యాంకు సిబ్బంది, ముగ్గురు ఆలయ ట్రస్టు ఉద్యోగులు ఉంటారని తెలిపారు. అయోధ్య రామయ్యకు భక్తులు కానుకలు సమర్పించడం నుంచి.. వాటిని లెక్కింపు వరకూ అంతా సీసీటీవీ కెమెరాల నిఘా పర్యవేక్షణలోనే జరుగుతుందని గుప్తా వెల్లడించారు.

* జ్ఞానవాపి (Gyanvapi) ప్రార్థనా మందిరంలో భూగర్భ గృహంలోని హిందూ దేవతల విగ్రహాలకు బుధవారం రాత్రి పూజలు చేశారు. దీని కోసం ఓ పూజారి కుటుంబానికి వారణాసి జిల్లా కోర్టు బుధవారం అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలు వెలువడిన గంటల వ్యవధిలోనే సీలు వేసి ఉన్న భూగర్భ గృహం మార్గాన్ని తెరిచే ఏర్పాట్లు చేశారు. భారీ భద్రత నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సుప్రీం కోర్టు న్యాయవాది విష్ణు శంకర్‌ జైన్‌తో పాటు కాశీ విశ్వనాథ్‌ ట్రస్టు ప్రతినిధులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

* కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ను స్వాగతిస్తున్నట్లు జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా 81 కోట్ల మందికి ఉచిత రేషన్‌ ఇవ్వడం గొప్ప విషయమని.. దీన్ని 2029 వరకు పొడిగించడం అభినందనీయమన్నారు. పర్యటక రంగాన్ని ప్రోత్సహించే విధంగా కేంద్రం సహకరిస్తోందన్నారు. ముఖ్య పట్టణాలకు మెట్రో విస్తరించాలని నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాదెండ్ల మాట్లాడారు. ‘‘సీఎం జగన్‌ హయాంలో 2019 నుంచి ఇప్పటివరకు సుమారు 80 నుంచి 90 మంది సలహాదారులు, ఉప సలహాదారులను నియమించారు. వీరంతా ప్రభుత్వానికి ఏ విధంగా సలహాలు ఇస్తున్నారో అర్థం కావడం లేదు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వీరికి అనవసరంగా నిధులు కేటాయిస్తున్నారని గతంలో హైకోర్టులో పిల్‌ వేశాం. న్యాయస్థానం స్పందిస్తూ.. దేని కోసం ఇంతమందిని నియమించారు? ఎలాంటి సలహాలు ఇస్తున్నారు? వాటిని ఎక్కడైనా అమలు చేస్తున్నారా? సలహాదారుల విధానం అనవసరం అని కోర్టు అభిప్రాయపడింది. సలహాదారుల నియామకానికి సంబంధించి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది’’ అని నాదెండ్ల చెప్పారు.

* విశాఖపట్నం రైల్వే జోన్‌ (Visakha Railway Zone) ఏర్పాటుకు 53 ఎకరాల భూమిని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని (Ap Govt) ఇప్పటికే అడిగామని, అయితే ప్రభుత్వం ఇంకా అప్పగించలేదని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) చెప్పారు. జోన్‌ ఏర్పాటుకు డీపీఆర్‌ సిద్ధమైందని, భూమి ఇస్తే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భాజపా అధికారంలోకి రాకముందు 2009 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీలో రైల్వే అభివృద్ధికి రూ.886 కోట్ల నిధులు ఇవ్వగా, ప్రస్తుత బడ్జెట్లో ఒక్క ఏపీకే రూ.9,138 కోట్లు (Union Budget 2024) కేటాయించామని తెలిపారు. ఆంధ్రాలో ఏడాదికి 240 కి.మీ. మేర నూతన ట్రాక్‌ పనులు జరుగుతున్నాయని చెప్పారు. 98 శాతం లైన్ల విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z