Politics

వాలంటీర్లకు చంద్రబాబు విన్నపం-NewsRoundup-Mar 04 2024

వాలంటీర్లకు చంద్రబాబు విన్నపం-NewsRoundup-Mar 04 2024

* ప్రభుత్వ పాఠశాలలోనే చదివి తాను ఈ స్థాయికి ఎదిగానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎల్బీ స్టేడియంలో లెక్చరర్లు, టీచర్లు ఉద్యోగాలకు ఎంపికైన 5,192 మందికి నియామక పత్రాలను ఆయన అందజేశారు. మూడు నెలల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని పేర్కొన్నారు. ఎల్బీ స్టేడియంలోనే రైతును రాజుగా చేసే పాలనకు నాంది పడిందని చెప్పారు.

* అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు నటుడు అజయ్ ఘోష్‌ (Ajay Ghosh). స్టార్‌ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ విలన్‌ పాత్రలకు పెట్టింది పేరుగా మారారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. బాల్యంలో తాను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు చెప్పారు. తన జీవితాన్ని ‘రంగస్థలం’ మలుపు తిప్పిందని.. ‘పుష్ప’ మరో స్థాయికి తీసుకెళ్లిందన్నారు. ‘ఒకప్పుడు నాకు వేసుకోవడానికి దుస్తులు కూడా లేవు. మా అన్నయ్య వాళ్ల స్నేహితులు వాడేసిన డ్రెసులు తెచ్చుకొని వేసుకునేవాడిని. ఎన్నో విషయాల్లో ఒత్తిడికి గురై నష్టాలను చూశాను. ఆతర్వాత.. ఎలా జరగాలని రాసుంటే అలా జరుగుతుందని ఆలోచించడం మానేశాను. నాకు మొదటినుంచి కష్టాలెక్కువే. నేను బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు నా పిల్లలు కూడా ఎన్నో కష్టాలు అనుభవించారు. వాళ్లకు తిండి కూడా సరిగ్గా ఉండేది కాదు. ఎన్నో రోజులు పచ్చడి మెతుకులు తినే బతికారు. అలా ఇబ్బందుల్లో పెరిగారు కాబట్టే వాళ్లు ఇప్పుడు ఎంతో క్రమశిక్షణగా ఉన్నారని నేను అనుకుంటాను’.

* న్యాయ అవసరాలకు కేటాయించిన స్థలంలో ఉన్న కార్యాలయాలను ఖాళీ చేయాలని ఆమ్‌ఆద్మీ పార్టీ(AAP)ని సోమవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. అందుకోసం జూన్‌ 15 వరకు గడవు విధించింది. న్యాయ అవసరాలకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు దిల్లీ హైకోర్టుకు స్థలాన్ని కేటాయించారు. అందులోనే ఆప్‌ కేంద్ర కార్యాలయం ఉంది. దిల్లీ హైకోర్టుకు కేటాయించిన స్థలంలో ఆప్‌ కార్యాలయం ఉందన్న విషయాన్ని సుప్రీం పరిశీలించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ మాట్లాడుతూ.. ఎవరూ కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోలేరని అన్నారు. ‘ఒక రాజకీయ పార్టీ అక్కడ ఎలా కార్యకలాపాలు నిర్వహిస్తుంది..? అక్రమ కట్టడాలన్నింటిని తొలగిస్తాం. ప్రజలకు ఉపయోగపడే భూమిని హైకోర్టుకు తిరిగి స్వాధీనం చేయాలి. అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని నిర్ధారించేందుకు తదుపరి వాయిదాలోగా దిల్లీ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్ సమావేశం కావాలి’ అని ఆదేశించింది.

* ఈ ఐదేళ్లలో ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? నేనిచ్చింది ఐటీ ఉద్యోగాలు.. జగన్‌ ఇచ్చింది వాలంటీర్ ఉద్యోగాలు. తెదేపా – జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాలంటీర్‌ వ్యవస్థ ఉంటుంది. ఎవరి ఉద్యోగం తీసేయం. వాలంటీర్లకు మంచి భవిష్యత్తు ఉంటుంది.. మీకు న్యాయం చేస్తాం. వారిని వైకాపా కోసం పనిచేయవద్దని కోరుతున్నా. అని చంద్రబాబు అన్నారు.

* ‘ప్రధానికి కుటుంబం లేదు’ అంటూ ఆర్జేడీ అధినేత, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రధాని మోదీ దీటుగా బదులిచ్చారు. ఈ దేశమంతా తన కుటుంబమేనని, తన జీవితం తెరిచిన పుస్తకమని అన్నారు. ఆదిలాబాద్‌లోని బహిరంగసభలో మాట్లాడుతూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

* ఓటమి ఖాయమని తేలిపోవడంతో ముఖ్యమంత్రి జగన్ ముసుగు తీసేసి ఫ్యాక్షనిస్టు పోకడలతో బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. ‘‘మాజీ మంత్రి నారాయణ సన్నిహితుల ఇళ్లపైకి పోలీసులను పంపించి భయానక వాతావరణం సృష్టించారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే అధికార పార్టీ అరాచకపర్వానికి తెరలేపింది’’అని మండిపడ్డారు.

* మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి ‘నార్కో అనాలసిస్‌’ పరీక్షకు సిద్ధమా? అని తెదేపా నేత బీటెక్‌ రవి సవాల్‌ విసిరారు. హత్య జరిగిన రోజే గొడ్డలితో చంపినట్లు ఎలా తెలిసిందో సీఎం జగన్‌ చెప్పాలన్నారు. కేసులో ఆయన హస్తం ఉందనేది త్వరలో బయటకు వస్తుందన్నారు.

* సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. మీరు చేసిన వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో తెలియదా? మీరేం సామాన్య పౌరుడు కాదు. ఓ మంత్రి పదవిలో ఉన్నారు’’ అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

* వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల నేతలతో భారాస అధినేత కేసీఆర్‌ సమీక్ష చేపట్టారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామా నాగేశ్వరరావు, మాలోతు కవితకు మరోసారి అవకాశం కల్పించారు. ఖమ్మం, మహబూబాబాద్‌ స్థానాలకు వారిని అభ్యర్థులుగా నిర్ణయించారు.

* భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చీఫ్‌ సోమనాథ్‌ క్యాన్సర్‌ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు రూపొందించిన ‘ఆదిత్య ఎల్‌ 1 (Aditya-L1 mission)’ ప్రయోగం చేపట్టిన రోజే వ్యాధి నిర్ధరణ అయినట్లు తెలిపారు.

* టీ20 ప్రపంచకప్‌ 2024లో జూన్ 9న న్యూయార్క్‌ వేదికగా భారత్ – పాకిస్థాన్‌ మధ్య పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌ టికెట్ల రీసేల్‌ చేసే కొన్ని వెబ్‌సైట్లలో 400 డాలర్ల విలువైన టికెట్‌.. 40వేల డాలర్లకు చేరింది. ఇక ప్లాట్‌ఫామ్‌ ఫీజు, ఇతర రుసుములతో కలిపి అది 50 వేల డాలర్లకుపైమాటే. అంటే మన రూపాయల్లో దాదాపు రూ. 42 లక్షలు.

* ప్రధాని నరేంద్రమోదీ గురించి గూగుల్‌కు చెందిన ఏఐ ప్లాట్‌ఫామ్‌ జెమిని (Gemini AI) ఇచ్చిన సమాధానం వివాదానికి దారి తీసింది. దీనిపై తాజాగా గూగుల్‌ క్షమాపణ చెప్పింది. అంతేకాకుండా తమ ప్లాట్‌ఫామ్‌ను ‘నమ్మదగినది కాదు’ అని పేర్కొంది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఓ ఆంగ్ల పత్రికకు తెలియజేశారు.

* మాజీ మంత్రి, సినీ నటుడు బాబూమోహన్‌ (Babu Mohan) ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆయనకు కేఏ పాల్‌ (KA Paul) కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి బాబూమోహన్‌ పోటీ చేస్తారని కేఏ పాల్‌ ప్రకటించారు. కాగా, ఇటీవల భాజపాకు బాబూమోహన్‌ రాజీనామా విషయం తెలిసిందే. పార్టీలోని గ్రూపులతో తనపై విమర్శలు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్‌ ఎంపీ టికెట్‌ను ఆశించానని.. అది ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. జీవితంలో కచ్చితంగా ఒక్కసారైనా అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుస్తానని గతంలో చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రజాశాంతి పార్టీలో చేరారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z