Business

UPI చెల్లింపుల్లో భారీ వృద్ధి-BusinessNews-Mar 04 2024

UPI చెల్లింపుల్లో భారీ వృద్ధి-BusinessNews-Mar 04 2024

* ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా (MG Motor India) తన ఎస్‌యూవీ హెక్టర్ (Hector) కారులో కొత్తగా చిరిస్టెన్డ్ షైన్ ప్రో (Christened Shine Pro), సెలెక్ట్ ప్రో (Select Pro) వేరియంట్లను ఆవిష్కరించింది. 2019 జూన్ నుంచి భారత్‌లో అమ్ముడవుతున్న అత్యంత పాపులర్ ఎస్‌యూవీ కార్లలో హెక్టర్ (Hector) ఒకటి. కొత్తగా మార్కెట్లో ఆవిష్కరించిన చిరిస్టెన్డ్ షైన్ ప్రో కారు ధర రూ.15,99,800 (ఎక్స్ షోరూమ్), సెలెక్ట్ ప్రో రూ.17,29,800 (ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించింది.

* 43 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల‌తో కూడిన యూట్యూబ్ మ్యూజిక్ టీమ్ త‌మ కొలువులు కోల్పోయింది. ఈ ఉద్యోగులు గ‌త ఏడాది కాలంగా మెరుగైన వేత‌నాలు, ప్ర‌యోజ‌నాల‌ను డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల బృందం గూగుల్‌, కాగ్నిజెంట్‌ల కోసం ప‌నిచేస్తున్నారు. మ‌రోవైపు ఈ లేఆఫ్స్‌కు తాము బాధ్యులం కాద‌ని గూగుల్ స్ప‌ష్టం చేసింది. మ‌రోవైపు గూగుల్‌తో త‌మ యూనియ‌న్ సంప్ర‌దింపుల‌కు మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని యూట్యూబ్ డేటా అన‌లిస్ట్ జాక్ బెనెడిక్ట్ అస్టిన్ సిటీ కౌన్సిల్‌ను కోరుతున్న వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) వరుసగా నాలుగో రోజూ లాభాల్లో ముగిశాయి. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాలతో లాభాల్లో ప్రారంభమైనప్పటికీ.. మదుపరుల అప్రమత్తత కారణంగా కాస్త వెనక్కి వచ్చాయి. దీంతో స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. నిఫ్టీ 22,400 పాయింట్ల ఎగువన ముగిసింది. సెన్సెక్స్ ఉదయం 73,903.09 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొంది. ఇంట్రాడేలో 73,747.01 – 73,990.13 మధ్య చలించిన సూచీ.. చివరికి 66.14 పాయింట్ల లాభంతో 73,872.29 వద్ద ముగిసింది. నిఫ్టీ 27.20 పాయింట్ల లాభంతో 22,405.60 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.89గా ఉంది.

* భారత ఆర్థిక వృద్ధి అంచనాలను ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్స్‌ సంస్థ మూడీస్‌ పెంచింది. గతంలో 6.1 శాతంగా ఉన్న అంచనాను తాజాగా 6.8 శాతానికి సవరించింది. 2023లో ఆర్థిక గణాంకాలు ఊహించిన దానికన్నా బలంగా ఉండడమే దీనికి కారణమని పేర్కొంది. అలాగే అంతర్జాతీయంగా ఉన్న సవాళ్ల ప్రభావమూ క్రమంగా క్షీణిస్తున్నట్లు వెల్లడించింది. భారత వాస్తవిక జీడీపీలో వార్షిక ప్రాతిపదికన 2023 కేలండర్ ఏడాది చివరి మూడు నెలల్లో 8.4 శాతం వృద్ధి నమోదైంది. ఫలితంగా గత ఏడాది మొత్తం వృద్ధిరేటు 7.7 శాతానికి చేరింది. ప్రభుత్వ మూలధన వ్యయం, తయారీ కార్యకలాపాలు పుంజుకోవటం 2023 ఆర్థిక వృద్ధికి దన్నుగా నిలిచినట్లు మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ తెలిపింది. జీ20 దేశాల్లో అత్యంత వేగవంతమైన వృద్ధి నమోదు చేస్తున్న దేశంగా భారత్‌ కొనసాగుతోందని చెప్పింది. 2025లో జీడీపీ వృద్ధి అంచనాలను 6.4 శాతంగా పేర్కొంది.

* గత 12 ఏళ్లలో దేశంలో డిజిటల్‌ లావాదేవీలు 90 రెట్లు పెరిగాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. ప్రపంచంలోని మొత్తం ఆన్‌లైన్‌ చెల్లింపుల్లో (Digital Payments) దాదాపు సగం మన దేశంలోనే జరుగుతున్నాయని తెలిపారు. ముంబయిలోని ఆర్‌బీఐ కేంద్ర కార్యాలయంలో జరిగిన డిజిటల్‌ చెల్లింపుల అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘‘2012-13 ఆర్థిక సంవత్సరంలో దేశంలో 162 కోట్ల రిటైల్‌ ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ జరగ్గా.. 2023-24 నాటికి ఆ సంఖ్య 14,726 కోట్లకు పెరిగింది. అంటే గత 12 ఏళ్లలో డిజిటల్‌ చెల్లింపులు దాదాపు 90 రెట్లు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం డిజిటల్‌ లావాదేవీల్లో దాదాపు 46శాతం భారత్‌లోనే జరుగుతున్నాయి’’ అని శక్తికాంతదాస్‌ వెల్లడించారు. ఇక, ‘యూపీఐ (UPI)’ అనేది భారత్‌లోనే గాక.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగవంతమైన చెల్లింపు వ్యవస్థగా మారిందన్నారు. ‘‘దేశంలో డిజిటల్‌ పేమెంట్స్‌ గణనీయమైన వృద్ధి సాధించడంలో యూపీఐలదే కీలక పాత్ర. 2023లో జరిగిన ఆన్‌లైన్‌ చెల్లింపుల్లో 80శాతం వాటా దీనిదే. 2017లో 43 కోట్ల యూపీఐ లావాదేవీలు జరగ్గా.. 2023 నాటికి ఆ సంఖ్య ఏకంగా 11,761 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం రోజుకు సగటున 43 కోట్ల యూపీఐ చెల్లింపులు జరుగుతున్నాయి’’ అని ఆర్‌బీఐ గవర్నర్‌ పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z