🕑 Published: June 16, 2026 at 09:35 AM CST
నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నెదర్లాండ్స్ ఎన్నారై తెదేపా కార్యదర్శి వెంకట్ కృష్ణ కోక, నవీన్ ఆచంట సమన్వయపరిచారు. ఈ సందర్బంగా గుంటూరు మిర్చియార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. ఒక జాతి అస్థిత్వాన్ని, ప్రత్యేకతను చాటిచెప్పేది మాతృభాషేనని గుర్తించిన ఎన్టీఆర్ తెలుగును ప్రోత్సహించారన్నారు. యూరప్‌లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు ఆయన ఆశయాలకనుగుణంగా తమ పిల్లలను అమెరికాలోని సిలికానాంధ్ర వారి తోడ్పాటుతో చక్కటి తెలుగు నేర్పిస్తున్నారని తెలిపారు. మాతృభూమికి దూరమైన మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటున్నారని కొనియాడారు. నెదర్లాండ్స్‌లో మనబడి ద్వారా 25 మంది వాలంటీర్లుగా ఏర్పడి 280 మందికి తెలుగు నేర్పించడం గర్వకారణమన్నారు. మాతృభాషను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఐరోపా ఖండంలో తెలుగు వెలుగుల్ని విరజిమ్ముతున్న తెలుగు వారందరికీ అభినందనలు తెలియజేశారు.
సంపత్ ఐనంపూడి మాట్లాడుతూ.. ‘మా పిల్లలు తెలుగు భాషతో పాటు స్కూళ్లలో డచ్, ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్ తదితర భాషలను కూడా నేర్చుకుంటారు. భౌగోళిక సరిహద్దులు భాషకు ప్రతిబంధకాలు కావని మా పిల్లలు నిరూపిస్తున్నారు. భాష సాంస్కృతిక వారధి. అలాంటి వారసత్వ సంపదను పదిలంగా ఉంచుకుంటున్నాం’’ అని తెలిపారు. అనంతరం సిలికానాంధ్ర ఆధ్వర్యంలో నడుస్తున్న మనబడి బోధనా కేంద్రాన్ని సందర్శించి అక్కడి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నెదర్లాండ్స్ ఎన్నారై తెదేపా అధ్యక్షుడు వివేక్ కరియావుల, ఆచంట గోపాలరావు, సత్యనారాయణ సలకి, అమర్ చంద్ రావి, వివేక్ కరియావుల, ప్రసాద్ రామినేని, పవన్ గుమ్మడి , ప్రవీణ్ ముమ్మినేని, చైతన్య వెల్లంకి, నవీన్ పరుచూరి, ఫణీష్ పోతురాజు, నంద ఉదయగిరి తదితరులు పాల్గొన్నారు.
