Kids

గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకున్న చీమ

show-off-ant-tnilive-kids-stories

*** పిల్లల కోసం TNI కథలు – గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకున్న చీమ

ఒక ఇంటి ఇల్లాలు లడ్డూలు చేసి డబ్బాలో సర్ది వంటింట్లో గట్టుపై ఉంచింది. ఘుమఘుమలాడుతూ నోరూరించేలా ఉన్న ఆ లడ్డూలకు ఆకర్షితురాలైంది ఒక చీమ. లడ్డూలు చుట్టేంతసేపూ అక్కడే కాపు కాసింది. ఆమె వేరే పని మీద వెళ్లంగానే తానొక లడ్డూ దొరకబుచ్చుకుని కడుపారా తిన్నంత తిని నేస్తాల సాయంతో మిగిలింది పుట్టలోకి తీసుకెళ్లాలనుకుంది. కానీ దాని ఆశల్ని అడియాశలు చేస్తూ ఆమె లడ్డూలు డబ్బాలో సర్దేయడమే కాక డబ్బా చుట్టూ చీమల మందూ చల్లేసింది. చీమ నిశ్చేష్టురాలైపోయింది. ఉపాయాలు అన్వేషించసాగింది. అటుగా వెళ్లే ఒక దోమను పిలిచింది. ‘దోమా! దోమా! నీ ఆహారం ఎలాగూ రక్తమే కదా! నీ కాళ్లతో పట్టినంత లడ్డూ దొరకబుచ్చుకుని నాకివ్వవూ! తాజాగా తినాలని తహతహగా ఉంది’ అని కోరింది. దోమ రివ్వుమంటూ ఎగిరి ఒట్టి కాళ్లతో తిరిగి వచ్చి డబ్బాపై మూత ఉందని చెప్పి ఎగిరిపోయింది. చీమ నిరాశపడకుండా ఇంకా ఆలోచించింది. మిగిలిన చీమలతో ఈ విషయం చర్చించింది. అవి నింపాదిగా ‘తొందరెందుకు? పిల్లలు తినేటప్పుడు సరిగా చేతకాక కొద్ది పొడి ఒలకబోసుకుంటారు కదా! అప్పుడు నేలపై రాలినది మనకేగా’ అన్నాయి. కానీ ఆ ఆలోచన చీమకు నచ్చలేదు. పిల్లలు తిన్నాక మిగిలిన వాళ్ల ఎంగిలి నాకొద్దు… నాకు ఆ తాజా లడ్డూనే కావాలి. అందరికంటే మొదటగా నేనే రుచి చూడాలి అంది. కానీ దాని కోరిక తీరే మార్గం తెలియలేదు. ఇంతలో ఒక విచిత్రం జరిగింది. ఆ ఇల్లాలి చిన్న కొడుకు ఆటలు ముగించుకుని అలిసిపోయి ఇంటికి చేరాడు. వస్తూనే ఇల్లంతా అలుముకుని ఉన్న కమ్మని నేతి లడ్డూల వాసనకు సంబరపడ్డాడు. కేరింతలు కొడుతూ వెళ్లి డబ్బా మూత తీసి ఒక లడ్డూ చేతిలోకి తీసుకున్నాడు. ఇంతలో తల్లి ఒక్కసారిగా ‘చిన్నూ!’ అంటూ గట్టిగా అరిచేసరికి ఉలిక్కి పడ్డాడు. చేతిలో లడ్డూ జారి నేలపాలైంది. ‘కాళ్లు కడుక్కోకుండా ఇంట్లోకి రావడం, చేతులు కడుక్కోకుండా తినడం తప్పు కదా నాన్నా! చూడు.. కాళ్లూ, చేతులూ ఎంత మురికిగా ఉన్నాయో! చక్కగా స్నానం చేసిరా. హాయిగా తిందూగాని’ అంటూ చేతిలో తువ్వాలుతో పిల్లవాడిని సమీపించింది అమ్మ. బిక్కమొహంతో నిలబడిన కొడుకుని, కిందపడ్డ లడ్డూని చూసి విషయం గ్రహించింది. ‘లడ్డూపోతే పోన్లే. గట్టిగా అరిచేసరికి ఉలిక్కిపడ్డావా?’ అంటూ సముదాయించింది. పడి ఉన్న లడ్డూని పెరట్లోకి విసిరింది. చీమ తన కళ్లని తానే నమ్మలేకపోయింది. వేగంగా పాకుతూ ఆ లడ్డూని చేరింది. ఆత్రంగా తింటూ ఇలా ఆలోచిస్తోంది. మొత్తానికి పిల్లల కంటే ముందే తినాలనే తన ఆశ తీరింది. అంటే… తాను ఏం తలుచుకుంటే అది జరిగింది. తనకు అంత శక్తి ఉంది. ఇదంతా తన గొప్పదనమే. ఇలా భావిస్తూ అది మిగిలిన చీమల్ని పిలిచింది. అన్నీ కలిసి విందు చేసుకుని మిగిలింది పుట్టలోకి మోసుకుపోయాయి. ఈ తతంగం జరుగుతున్నంతసేపూ చీమ తన ఘనతను తోటి చీమలకు వివరిస్తూనే ఉంది. విన్నవి విన్నాయి. కొన్ని అలా బడాయిలు చెప్పుకోకూడదని చెప్పబోయి శత్రువులైపోయాయి. ఆ రోజు నుంచి చీమ ఠీవిగా తిరగసాగింది. సాటి చీమలు నవ్వుకుంటున్నా లెక్క చేయలేదు. ఒక రోజు దానికి మరో ఆలోచన వచ్చింది. ఆ ఇంటి యజమాని పెంపుడు కుక్కకు ప్రేమతో బిస్కెట్లు తినిపించడం చూశాక తననూ ఆ ఇంటి వారికి పెంపుడు ప్రాణిగా మారాలని ఆశ కలిగింది. ఈసారి అది ఆరాటపడలేదు. తను తలుచుకుంటే జరిగి తీరుతుంది కనుక నిబ్బరంగా ఉంది. కానీ వేచి ఉండే ఆలస్యమెందుకు? తన కోరికను యజమాని చెవిలో వేస్తే పోలా? అనుకుంది. తలచిందే తడవుగా అరుగుపై కూర్చుని ఉన్న ఆయన చొక్కాపైకెక్కింది. పాకుతూ వెళ్లి చెవి దగ్గర చేరింది. తననూ పెంచుకోమంటూ అరిచింది. ఆయన నుంచి స్పందన లేకపోయేసరికి తనది చాలా చిన్న నోరు కదా! ఎలుగెత్తి అరిచినా వినబడటం లేదు పాపం అనుకుంది. తట్టి పిలిచే సదుద్దేశ్యంతో చెవి కొరికింది. మెరుపులా దానిలో అనుమానం ప్రవేశించింది. ఆయనకు మంటపుట్టి నలిపితే తాను నలిగిపోతానేమో అన్న దాని అనుమానం నిజమూ అయ్యింది. చనిపోయే ఆఖరి క్షణంలోకూడా అది తాను నలిగిపోతానేమో! అనుకోవడం వల్లే తనకీ గతి పట్టిందని, తాను అలా తలవకుండా ఉండాల్సిందని, తన తలుపునకు అంత శక్తి ఉందనే నమ్మింది. కొందరంతే! కాకతాళీయంగా జరిగిపోయే సంఘటనలకు తమ ఘనతను ఆపాదించుకుంటుంటారు. కానీ అవి యాదృచ్ఛికాలని వారికితోచదు, చెప్పినా వినరు, డంబాలు మానరు. -గుడిపూడి రాధికారాణి