NRI-NRT

సింగపూర్ ప్రవాసుల శివపదం నాట్యారాధన

sivapadam in singapore

రుషిపీఠం స్థాపకులు, ఆధ్యాత్మిక ప్రవచనకర్త సామవేదం షణ్ముఖశర్మ ఆధ్యర్యంలో సింగపూర్‌లో తొలిసారిగా మార్చి 30,31 తేదీల్లో ప్రవచన కార్యక్రమం, శివపదం నాట్యారాధన కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు.శ్రీనివాస పెరుమాళ్ ఆలయంలోని పీజీపీ హాల్ వేదికగా సింగపూర్ లోని తెలుగు వారంతా రెండురోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. 30వ తేదీ ..నిత్య జీవితంలో పాటించాల్సిన నైతిక విలువలు, రామాయణం, మహాభారతం, భాగవతం లాంటి పురాణ ఐతిహాసాల నుంచి చక్కని ఉదాహరణలతో సామవేదం షణ్ముఖశర్మ అందించిన ప్రవచనసుధ మంత్రముగ్ధులను చేసింది. హిందూ సనాతన ధర్మ ఔన్నత్యాన్ని పరిరక్షించే విధంగా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని గుర్తు చేసింది.31వ తేదీ.. సామవేదం షణ్ముఖశర్మ సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమం కోసం అమెరికా నుంచి వచ్చిన వాణి గుండ్లపల్లి ఆధ్వర్యంలో, కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఒడిస్సీ నృత్యకళా రీతులలో శివపదం నాట్యారాధన కార్యక్రమం నిర్వహించారు. భారతీయ నృత్య కళా సంస్కృతికి అద్దం పట్టేలా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి స్వయంగా సామవేదం షణ్ముఖశర్మ భాష్య ప్రవచనం చెప్పడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.సామవేదం షణ్ముఖశర్మ కలం నుంచి జాలువారిన వేయికి పైగా పాటల సంకలనమే “శివపదం”. శివపదం నృత్యరూపకాలను చిత్ర శేఖరన్, ప్రత్యూష అవధానుల, అమృతని శివహరన్, విద్యాలక్ష్మి శ్రీనాథ్, నమ్రత, పడాల అక్షయ తదితర నాట్యాచార్యులు రూపొందించారు. సింగపూర్ లో తొలిసారి ఇలాంటి సంగీత సాహిత్య నృత్య సమ్మేళనం నిర్వహించడం విశేషం.కార్యక్రమాల్లో భాగంగా ఆంధ్రుల రాజధాని అమరావతి ఘనతను చాటుతూ అరుణ్ వేమూరి రచించిన పాటను సింగపూర్ గాయనీ గాయకులు ఆలపించి అలరించారు. కార్యక్రమాలకు రత్నకుమార్, శ్రీధర్ భరద్వాజ్, నాగేంద్ర, రామాంజనేయులు ముఖ్య నిర్వాహకులుగా, రాధిక వ్యాఖ్యాతగా వ్యవహరించారు. వాణి, పద్మజ లక్ష్మి, విద్యాభాస్కర్ తదితరులు సహకారం అందించారు. కార్యక్రమాల్లో సుమారు 600 మంది తెలుగు వారు పాల్గొన్నారు.