Movies

MeToo గొడవ

Siddique and revathi sampath metoo scandal

ప్రముఖ మలయాళ నటుడు సిద్ధిఖీ తనను లైంగికంగా వేధించారని నటి రేవతి సంపత్‌ ఆరోపించారు. తాజాగా సిద్ధిఖీ మాలీవుడ్‌లో నటీమణుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కమిటీ ‘వుమన్‌ ఇన్‌ సినిమా కలెక్టీవ్‌’ (డబ్ల్యూసీసీ)ను విమర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను చూసిన రేవతి ఆయనపై ఆగ్రహంతో తనకు జరిగిన చేదు సంఘటనను వెల్లడించారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ‘2016లో తిరువనంతపురంలోని నీల థియేటర్‌లో ‘సుఖమయిరికటే’ సినిమా ప్రివ్యూ జరుగుతున్నప్పుడు సిద్ధిఖీ నాతో అసభ్యంగా ప్రవర్తించారు. నా 21 ఏళ్ల వయసులో ఆయన చేసిన వ్యాఖ్యలు నాపై తీవ్ర ప్రభావం చూపాయి. ఆయన నాతో ప్రవర్తించిన విధానం, నేను కుంగుబాటుకు గురైన రోజుల్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంటా. ఆయనకు నాలాంటి కూతురు ఉంది. ఇలాంటి సంఘటన నీ కూతురికి ఎదురైతే ఏం చేస్తారు మిస్టర్‌ సిద్ధిఖీ’. ‘ఇప్పుడు ఇలాంటి వ్యక్తి ఎంతో ప్రతిష్ఠాత్మకమైన డబ్ల్యూసీసీని విమర్శిస్తున్నారు, దాన్ని వేలెత్తి చూపిస్తున్నారు. దీనికి నువ్వు అర్హుడివేనా మిస్టర్‌ సిద్ధిఖీ??.. నీకు నువ్వు ఓసారి ఆలోచించుకో. చిత్ర పరిశ్రమలోనే నువ్వు జెంటిల్‌మెన్‌ అని చెప్పుకోవడం సిగ్గుపడాల్సిన విషయం’ అని రేవతి పోస్ట్‌ చేశారు. ఆమె వ్యాఖ్యలు మలయాళ చిత్ర పరిశ్రమను షాక్‌కు గురి చేశాయి. మరోపక్క ఆమె పబ్లిసిటీ కోసం సిద్ధిఖీపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సిద్ధిఖీ మలయాళంలో దాదాపు 300 సినిమాల్లో నటించారు. పలు తమిళ చిత్రాల్లోనూ కనిపించారు.