Politics

అది భాజపా అదృష్టం అంతే!

Uttam says bjp won due to mere luck and congress is the only source to crush TRS-TNILIVE-telugu political news

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీయే తెరాసకు ప్రత్యామ్నాయమని, ఆ పార్టీని ఎప్పటికైనా గద్దె దించేది తామేనని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో భాజపాకు ఆ స్థాయి లేకపోయినప్పటికీ అదృష్టం కొద్దీ నాలుగు లోక్‌సభ స్థానాల్లో గెలిచిందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 100స్థానాల్లో భాజపాకు డిపాజిట్‌ కూడా దక్కలేదని.. ఈ అంశమే స్థానికంగా భాజపాకు ఉన్న బలమేంటో తెలియజేస్తోందన్నారు. నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో ఇష్టాగోష్ఠిలో పలు అంశాలపై మాట్లాడారు. కాంగ్రెస్‌ పునాదులపై తక్కువ అంచనా వేశారని ఉత్తమ్‌ అన్నారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో తమ పార్టీ బలంగా ఉందని, లోక్‌సభ ఎన్నికల్లో ఆరు సీట్లు గెలవాల్సి ఉన్నప్పటికీ మూడింట్లో మాత్రమే విజయం సాధించామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపిందని చెప్పారు. తనకు ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తానని స్పష్టంచేశారు. పీసీసీ మార్పుపై ఎప్పటివరకు ఎలాంటి చర్చా జరగలేదన్నారు. కాంగ్రెస్‌ నుంచి ఎవరు వెళ్లినా నష్టంలేదని లోక్‌సభ ఫలితాలు స్పష్టంచేశాయని చెప్పారు. రాజకీయాల్లో అహంకారం పనికిరాదన్న ఉత్తమ్‌ నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే హవా ఉంటుందన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జడ్పీ ఛైర్మన్లు కూడా కాంగ్రెస్‌వేనన్నారు. రాష్ట్రంలో తెరాస ఒకప్పటిలా లేదని.. ఇప్పుడు పరిస్థితి మారిందని ఉత్తమ్‌ అన్నారు.