Politics

కవితను కసికసిగా ఎందుకు ఓడించారు?

What made nizamabad voters to stomp on kavithas victory chances-TNILIVE political analysis in telugu

సిటింగ్‌ ఎంపీగా నిజామాబాద్‌ స్థానం నుంచి బరిలోకి దిగిన ముఖ్యమంత్రి తనయ.. కల్వకుంట్ల కవిత ఓటమి పాలయ్యారు. ఇందూరు లోక్‌సభ స్థానంలో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ ఫలితంపై సర్వత్రా ఆసక్తికర చర్చ చోటుచేసుకుంది. రైతులు పెద్దసంఖ్యలో పోటీకి దిగడంతో నామినేషన్ల సమయంలోనే దేశవ్యాప్తంగా ఈ నియోజకవర్గం చర్చనీయాంశమయింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో కవితపై తెరాస రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ధర్మపురి శ్రీనివాస్‌ రెండో కుమారుడు భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ 62 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందారు. పసుపు, ఎర్రజొన్నలకు మద్దతు ధర కోసం ధర్నాలు చేస్తే తమను పట్టించుకోలేదని రైతులు అసంతృప్తితో ఉన్నారు. కనీసం తమను అధికార పార్టీ నేతలు పిలిచి కూడా మాట్లాడలేదని వారి మనసులో నిలిచిపోయింది. దీంతో కర్షకులంతా పార్లమెంటు ఎన్నికల్లో పెద్దసంఖ్యలో నామినేషన్లు వేయటం ద్వారా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. తామెలాగూ గెలిచే పరిస్థితి లేదు.. కానీ, తమను పట్టించుకోని వారికి మాత్రం రైతులెవరూ ఓటు వేయొద్దని ఊరూరా తీర్మానాలు చేశారు. పోలింగ్‌లో రైతు కుటుంబాలు భాజపా వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది.