Devotional

మానస సరోవర యాత్ర ప్రారంభం

Manasa Sarovar Yatra 2019 Begins In June

1. ప్రారంభమైన మానస సరోవర యాత్ర – తదితర ఆద్యాత్మిక వార్తలు
కైలాస మానస సరోవర యాత్ర ప్రారంభమైంది. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయ్‌శంకర్‌ ప్రకటించారు. ఈసారి యాత్రకు 2,996 మంది దరఖాస్తు చేయగా, వారిలో 2,256 మంది పురుషులు, 740 మంది మహిళలు. 624 మంది వయోవృద్ధులు కూడా ఆసక్తి చూపారు. ఉత్తరాఖండ్‌లోని లిపులెఖ్‌ మార్గం ద్వారా 18 బృందాలను పంపుతారు. ఒక్కో బృందంలో 60 మంది ఉంటారు. సిక్కింలోని నాథు లా మార్గం మీదుగా 50 మంది సభ్యుల చొప్పున ఉండే 10 బృందాలను పంపుతున్నారు. ఒక్కో బృందంతో పాటు ఇద్దరు సమన్వయ అధికారులుంటారు. 19,500 అడుగుల ఎత్తుకు ట్రెక్కింగ్‌ చేయాల్సి రావడం, విపరీత వాతావరణ పరిస్థితుల వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులనే ఈ యాత్రకు అనుమతిస్తారు.
2. తితిదే సభ్యత్వానికి పెద్దిరెడ్డి రాజీనామా
తిరుమల, తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, తెలంగాణకు చెందిన మాజీ మంత్రి ఇ.పెద్దిరెడ్డి మంగళవారం రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌కు పంపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో తితిదే ధర్మకర్తల మండలిలో 8 మంది సభ్యులు ఇప్పటికే రాజీనామా చేశారు. కొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది.
3. మల్లన్న హుండీ ఆదాయం రూ.2.54కోట్లు
శ్రీశైలం ఉభయ దేవాలయాల్లో హుండీ ఆదాయాన్ని మంగళవారం స్వామివారి నిత్యకల్యాణ మండపంలో లెక్కించారు. హుండీల ద్వారా గత 27 రోజుల్లో రూ.2,54,37,397 లభించినట్టు దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎ.శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. అలాగే విదేశీ కరెన్సీ కూడా వచ్చిందన్నారు.
4. హైదరాబాద్‌లో యాదాద్రి భవన్‌ సమాచార కేంద్రం
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్‌లోని బర్కత్‌పురలో నిర్మించిన యాదాద్రి భవన్‌ సమాచార కేంద్రాన్ని ఈ నెల 14న ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ భవన ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎంను కలిసి అందజేశారు. సమాచార కేంద్రంతోపాటు కల్యాణమండపాన్ని నిర్మించినట్లు ఆలయ ఈవో గీతారెడ్డి, వంశపారంపర్య ధర్మకర్త నరసింహమూర్తి తెలిపారు. అందులో స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించిన అనంతరం నగరవాసులకు అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు.
5. వారిని దర్శించుకున్న సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా పుష్కరిణికి చేరుకుని పవిత్ర జలాలను ప్రోక్షణం చేసుకుని అనంతరం శ్రీవరాహస్వామివారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి ప్రధానాలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపానికి వచ్చారు. పండితులు వేదాశీర్వచనం చేయగా తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జేఈవో శ్రీనివాసరాజు శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం సీఎస్‌ తిరుచానూరు చేరుకుని శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకుని విజయవాడకు తిరుగు ప్రయాణమయ్యారు.
6. చరిత్రలో ఈ రోజు/జూన్ 12
1898 : స్పెయిన్ దేశం నుండి ఫిలిప్పీన్స్‌కు విముక్తి, ఫిలిప్పీన్స్ స్వాతంత్ర్య దినం.
1902 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు పాలకోడేటి శ్యామలాంబ జననం.(మ.1953)
1932 : గ్రంథాలయ గాంధీ గా ప్రసిద్ధిచెందిన వెలగా వెంకటప్పయ్య జననం (మ. 2014).
1955 : ప్రముఖ కవి, గీత రచయిత నందిని సిధారెడ్డి జననం.
1957 : ప్రముఖ పాకిస్థాన్ క్రికెట్ క్రీడాకారుడు జావెద్ మియాందాద్ జననం.
1964 : దక్షిణ ఆఫ్రికా లో నెల్సన్ మండేలా కు జీవిత ఖైదు విధించబడింది.
1987 : కోల్డ్ వార్: బెర్లిన్ గోడను పగలగొట్టమని అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ బహిరంగంగా మిఖయిల్ గోర్బచెవ్ కు సవాల్ విసిరాడు.
1987 : 13 సంవత్సరాల కౄర పాలనకు శిక్షగా మధ్య ఆఫ్రికా మహారాజు జీన్-బెడెల బొకాస్సాకు మరణశిక్ష విధించబడింది.
1996 : భారత లోక్‌సభ స్పీకర్‌గా పి.ఎ.సంగ్మా పదవిని స్వీకరించాడు.
1999 : ఆంధ్ర ప్రదేశ్ 6 వ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు మరణం
7. శుభమస్తు
తేది : 12, జూన్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : బుధవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : దశమి
(నిన్న రాత్రి 8 గం॥ 22 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 6 గం॥ 29 ని॥ వరకు)
నక్షత్రం : హస్త
(నిన్న మద్యాహ్నం 1 గం॥ 3 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 11 గం॥ 53 ని॥ వరకు)
యోగము : వ్యతీపాతము
కరణం : తైతిల
వర్జ్యం : (ఈరోజు రాత్రి 7 గం॥ 35 ని॥ నుంచి ఈరోజు రాత్రి 9 గం॥ 7 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 6 గం॥ 10 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 41 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 11 గం॥ 49 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 41 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 15 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 53 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 36 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 14 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 7 గం॥ 19 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 57 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 41 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 50 ని॥ లకు
సూర్యరాశి : వృషభము
చంద్రరాశి : కన్య