NRI-NRT

సిలికానాంధ్ర శిష్యసైన్యం ఇప్పుడు 50వేలు

SiliconAndhra Reaches 50000 Student Milestone-సిలికానాంధ్ర శిష్యసైన్యం ఇప్పుడు 50వేలు

ప్రవాస బాలలకు తెలుగు నేర్పిస్తున్న సిలికానాంధ్ర మనబడి మరోసారి తన ప్రత్యేకత చాటుకుంది. గత 12 సంవత్సరాలలుగా అమెరికాలోని 35 రాష్ట్రాలలో 250 ప్రాంతాలతో పాటు మరో 10 దేశాలలో మనబడి ద్వారా తెలుగు భాష నేర్చుకుంటున్న విద్యార్ధుల సంఖ్య ఈ విద్యాసంవత్సరం నమోదు ప్రక్రియలో భాగంగా 50,000 మైలు రాయిని దాటిందని సిలికానాంధ్ర మనబడి అధ్యక్షులు రాజు చమర్తి తెలిపారు. 2007 లో 300 మంది విద్యార్ధులతో ప్రారంభమై, తెలుగు విశ్వవిద్యాలయం సౌజన్యంతో పాఠ్యప్రణాళికను తయారుచేసుకుని, 4-6 సంవత్సరాల పిల్లలకోసం బాలబడి 6 సంవత్సరాల నుండి ప్రవేశం, ప్రసూనం, ప్రకాశం, ప్రమోదం, ప్రభాసం తరగతులను నిర్వహిస్తూ తెలుగు విశ్వవిద్యాలయం వారు పరీక్షలు నిర్వహించగా ఉత్తీర్ణులయిన వారికి యూనివర్సిటీ క్రెడిట్‌లతో కూడిన సర్టిఫికేట్లు అందించే ఏకైక విద్యాలయం మనబడి అని రాజు చమర్తి తెలిపారు. మనబడి 50వేలమంది విద్యార్ధులకు చేరిన నేపధ్యంలో ‘ పుష్కర కాలంలో అక్షర సైన్యం అర లక్ష ‘ అనే నినాదంతో 2000 మందికి పైగా ఉన్న భాషా సేవకుల తరఫున తెలుగు భాషా సేవకు పునరంకితమౌతున్నామని, రేపటి తరానికి ప్రతినిధులైన ప్రవాస బాలలకు మన మాతృభాషతో పాటు, మన కళలు, సంస్కృతిని పరిచయంచేసే ఎన్నో కార్యక్రమాలతో రూపకల్పన చేసామని రాజు చమర్తి తెలిపారు. మనబడి ప్రాచుర్యం మరియు అభివృద్ది విభాగం ఉపాద్యక్షులు శరత్ వేట మాట్లాడుతూ, అమెరికా వ్యాప్తంగా ఉన్న మనబడి కేంద్రాలన్నీ ప్రతిష్టాత్మక WASC ( Western Association of Schools and Colleges) సంస్థ నుండి అక్రిడిటేషన్ పొందినయని, అటువంటి అర్హత సాధించిన ఏకైక తెలుగు విద్యాలయం మనబడి మాత్రమేనని తెలిపారు. మనబడి విద్యావిధానం గురించి ఇప్పటికే భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి ఎందరో ప్రముఖుల ప్రశంశలు పొందిందని, విద్యార్ధుల తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, భాషా సైనికుల అందిస్తున్న ప్రోత్సాహం తో ముందుకు సాగుతామని ఆయన తెలిపారు. సిలికానాంధ్ర మనబడి 2019-20 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నాయని, ఈ విద్యాసంవత్సరం తరగతులు సెప్టెంబర్ 7 నుండి అమెరికా వ్యాప్తంగా 250 కి పైగా కేంద్రాలలో ప్రారంభమౌతున్నాయని, అగస్టు 31 లోగా నమోదు చేసుకోవాలనీ, నమోదు మరియు మరిన్ని వివరాల కొరకు manabadi.siliconandhra.org చూడవచ్చని, లేదా 1-844-626-(BADI) 2234 నంబరును సంప్రదించాలని సిలికానాంధ్ర ఉపాద్యక్షులు ఫణిమాధవ్ కస్తూరి తెలిపారు.